Sircilla Rajanna
-
తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేటీఆర్
బీజేపీపై, ఆ పార్టీ కీలక నేతలపైనా తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో చేశారు. ఈ కార్యక్రమాల వేదికగా ఆయన బీజేపీ నేతలపైనా ఆగ్రహం వెల్లగక్కారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీని బొంద పెడదాం అంటూ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారాయన. తెలంగాణ వస్తే కరెంట్, నీళ్లు ఉండవని అన్నారు. పాలన చేతనైతుందా? అని సమైక్యవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. అలాంటిది తెలంగాణపై ఎందుకు అంత అక్కసు అంటూ బీజేపీని నిలదీశారు మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని, వారికి వ్యక్తిగతంగానే సమాధానం చెప్పాలని కేటీఆర్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు బంటు అని తెలుసు. బండి సంజయ్ ఎవరి బంటో తెలియదు. కిషన్‌రెడ్డి ఏం నాయకుడో అర్థం కాదు. కేసీఆర్‌ను ఏమైనా అంటే చుక్కలు చూపిద్దాం. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడదాం అంటూ కార్యకర్తల్లో జోష్ నింపాడాయన. రాజ్యసభలో రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలను చేసిన మోదీని తెలంగాణ సమాజం క్షమించదని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీజేపీని బట్టలిప్పి నగ్నంగా కొడదామని మంత్రి కేటీఆర్ అన్నారు. మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ, మోదీ కనీసం చిల్లర పైసలు కూడా ఇవ్వలేదు. పైగా మిషన్ భగీరథను కాపీ కొట్టి.. హర్, ఘర్, జల్ అంటూ డ్రామాలాడుతున్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ రేషన్, వన్ రిజిస్ట్రేషన్ అంటారు. కానీ, దేశంలో జరిగిన ఒకే ఒక తప్పు.. 2014లో మోదీని నమ్మి గెలిపించడమే. నమో అంటే.. నమో నమ్మించి మోసం చేసేవాడు. నరేంద్ర మోదీ కాదు. నమోని నమ్మి ఎనిమిదేళ్లు మోసపోయాం. జీవితాలు మార్చమంటే.. జీవిత బీమా సంస్థకు కూడా అమ్మేస్తున్నారు అంటూ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేటీఆర్. బీహార్‌లో ఓ వ్యక్తి అకౌంట్లో రూ. 10 లక్షలు జమ అయ్యాయి. మోదీ పంపిండు అని ఆ పైసలతో ఇల్లు కట్టుకుండు. మోదీ పంపలేదు. అదంతా అబద్దం.. పైసలు కట్టు అని బ్యాంకు అధికారి నిలదీస్తే ఆ వ్యక్తి దీక్ష చేసిండు. జన్ ధన్ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని మోదీ మాట మరిచారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఉద్యోగాల గురించి మీడియా ప్రశ్నిస్తే.. మోదీ తెలివిగా సమాధానం చెప్పాడు. మీ సిరిసిల్ల హాస్పిటల్ ముందట పకోడి వేసుకోవడం ఉద్యోగం కదా? అని మోదీ అంటున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. మేడారం జాతరకు అంతేనా? మేడారం జాతరను మినీ కుంభమేళా అని అంటారు కిషన్ రెడ్డి. ఐదారు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు వస్తుంటారు. అట్లాంటి జాతరకు కేంద్రం ఇచ్చేది రూ. రెండున్నర కోట్లు మాత్రమేనా?. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాకు రూ. 375 కోట్లు ఇచ్చారు. మనకేమో ముష్టి వేసినట్టు రూ. రెండున్నర కోట్లు ఇచ్చారు. దీనికే కిషన్ రెడ్డి సిగ్గులేకుండా.. ఇది మినీ కుంభమేళా అంటారు.. కానీ నిధులు మాత్రం తీసుకురారు. కరీంనగర్‌కు ఒక ట్రిపుల్ ఐటీ కావాలని అడిగితే ఇవ్వలేదు. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఎన్ని విద్యాసంస్థలు ఇచ్చారు? అని కిషన్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్‌లాగా గర్జించాలి.. గల్లీ టు ఢిల్లీ మనమే ఉన్నాం. అవులాగాడు, బేకూఫ్‌గాడు మాట్లాడితే బెదరొద్దు. ఏ నాయకుడు చేయని పని కేసీఆర్ చేసి తెలంగాణను అభివృద్ధి చేశారు. కేసీఆర్‌ను ఎవరైనా ఒక మాట అంటే ఊరుకునేది లేదు. జనగామ, ఆర్మూర్‌లో బీజేపీ నాయకులను పొట్టుపొట్టు తన్నారు. హద్దులు దాటితే తప్పకుండా బుద్ధి చెప్తాం అని బీజేపీ నేతలను ఉద్దేశించి కేటీఆర్ హెచ్చరించారు. సిరిసిల్ల గడ్డ మీద చైతన్యం చూపిస్తాం. ఇక నుంచి ఊకోం అని తేల్చిచెప్పారు. కేసీఆర్ తెలంగాణకు ఏం తక్కువ చేసిండు అని బీజేపీ నాయకులను నిలదీయాలని మంత్రి కేటీఆర్, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ అంటే.. బీజేపీ అంటే బక్వాస్ ఝూఠా పార్టీ.. లొల్లి ఎక్కువ, చేసేది తక్కువ. అందుకే ఈ కొత్త పేరు పెట్టాం. బీజేపీ బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టాలి. చండాలమైన బీజేపీ పద్ధతులను ఎండగట్టాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పైనా కేటీఆర్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే మోదీ దగ్గరకు వెళ్లి.. వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకురావాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతోంది. ఈ కాలంలో మూడు పైసలు కూడా తేలేదు. వేములవాడకు పైసా తీసుకురాని బండి సంజయ్ నువ్వు ఎంపీగా ఎందుకున్నావ్? మీ మోదీ పెద్ద పోటుగాడు కదా.. వేములవాడ రాజన్నకు పైసలు తీసుకురా. అయోధ్యకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు. సిరిసిల్ల నేతన్నలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తరు. మనం అరిచినా, గీ పెట్టినా కూడా మనకు జాతీయ హోదా ఇవ్వరు. మోదీ కేవలం ఉత్తర భారతానికే ప్రధాన మంత్రా? తెలంగాణ ప్రజల మీద ఎందుకింత వివక్ష? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు సాయం చేయకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతారు అని బీజేపీ నాయకులపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. -
సిరిసిల్లలో ‘డబుల్ బెడ్రూం’ లొల్లి
సిరిసిల్ల: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల కేటా యింపు లొల్లికి దారితీసింది. సిరిసిల్లలో నాలుగు ప్రాంతాల్లో 2,052 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించగా.. 2,767 మంది అర్హులు ఉన్నారు. దీంతో ఇళ్లు రాని 963 మంది బాధితులు ఆందోళనకు దిగారు. ఇళ్ల కోసం లబ్ధిదారుల వద్ద మున్సిపల్ కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారని కొందరు ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా.. బాధితులు శుక్రవారం ఆందోళన నిర్వ హించారు. సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలో పాదయాత్ర చేశారు. అనంతరం కలెక్టర్ ఎదుట రెండుగంటలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల డ్రాలోనూ కొందరు అనర్హులకు దక్కాయని ఆరోపించారు. -
పత్తాలేని అండర్–19 రాష్ట్ర పోటీలు...
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా క్రీడారంగం కుదేలైందా.. జిల్లాలో క్రీడా పోటీల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది.. క్రీడలను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. క్రీడల్లో పాల్గొనేవారి సంఖ్య కూడా తగ్గుతోంది. 2019–20 విద్యాసంవత్సరంలో నిర్వహించే పోటీలను చూస్తుంటే క్రీడారంగం దయనీయ పరిస్థితికి అద్దం పండుతోంది. మొన్ననే రాష్ట్ర పాఠశాలల, కళాశాలల క్రీడాసమాఖ్య తెలంగాణలోని 31 జిల్లాలకు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే క్రీడలను ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో అండర్ – 14, 17 విభాగంలో కేవలం ఆరు అంశాల్లోనే పోటీలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఒక్క క్రీడాంశంలో కూడా రాష్ట్ర పోటీల నిర్వహాణ జరుగలేదు. ఇక అండర్–19 విభాగంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీలకే దిక్కు లేకుండా పోవడం కొసమెరుపు. కరీంనగర్ జిల్లా క్రీడారంగం తెలంగాణ రాష్ట్రానికే తలమానికం. గతంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పాఠశాలల, కళాశాలల క్రీడలతోపాటు వివిధ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు క్రీడల్లో విజయఢంకా మోగించి కరీంనగర్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. అంతేకాకుండా ఎప్పుడూ ఏదో ఒక క్రీడలో రాష్ట్ర, జాతీయ పోటీల నిర్వహణ పోటాపోటీగా జరుగడంతో క్రీడాహబ్‌గా కరీంనగర్ అభివృద్ధి చెందుతుందనే సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది నుంచి క్రీడల నిర్వహణ తగ్గుతోంది. గతేడాది సుమారు 10కిపైగా క్రీడల్లో రాష్ట్ర పోటీలు, ఒక క్రీడలో జాతీయస్థాయి పోటీలు జరిగాయి. ఈయేడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. పత్తాలేని అండర్–19 రాష్ట్ర పోటీలు... స్కూల్ గేమ్స్ పరంగా చూస్తే అండర్ 14, 17 విభాగాల్లో సుమారు ఆరు క్రీడాంశాల్లో రాష్ట్ర పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగానికి వచ్చే సరికే పత్తా లేకుండా పోయింది. నాలుగు జిల్లాల్లో కనీసం ఒక్క క్రీడలో రాష్ట్ర పోటీలు నిర్వహించే బాధ్యతను ఆ సమాఖ్య కార్యదర్శి తీసుకోకపోవడం గమనార్హం. గతేడాది పలు క్రీడల్లో రాష్ట్ర పోటీలతోపాటు జాతీయ స్థాయి పోటీలను నిర్వహించిన అండర్–19 కార్యదర్శి మధు జాన్సన్ ఈసారి ఒక్క క్రీడలో పోటీలు నిర్వహించలేదు. ముందుకు రాని కార్యదర్శులు... పాఠశాలల, కళాశాలల క్రీడల్లో భాగంగా నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎక్కువ క్రీడల్లో పోటీలు నిర్వహించడానికి స్కూల్ గేమ్స్ కార్యదర్శులు ముందుకు రాలేదు. కరీంనగర్లో రెండు, జగిత్యాలలో రెండు, పెద్దపల్లిలో మూడు రాష్ట్రస్థాయి పోటీలు మాత్రమే జరుగనుండగా రాజన్నసిరిసిల్లా జిల్లాలో ఒక్క అంశంలో కూడా క్రీడాపోటీలు నిర్వహించలేదు. స్కూల్ గేమ్స్‌పై కొన్నేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యం చూపడం.. నిధులు మంజూరు కాక పోవడం.. సొంత ఖర్చులతో పోటీల నిర్వహించాల్సి రావడం తదితర కారణాలతో ఈఏడాది పోటీల నిర్వహణకు పలువురు కార్యదర్శులు ఆసక్తి చూపలేదని సమాచారం. సిరిసిల్ల జిల్లాలో నిల్.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఈ యేడు పాఠశాలల, కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించలేదు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎస్జీఎఫ్ కార్యదర్శి విడుదల చేసిన అండర్ 14, 17, 19 మూడు విభాగాల జాబితాలో ఒక్క క్రీడలో కూడా ఈ ఏడాది పోటీలు నిర్వహించలేదు. మొత్తం 96 క్రీడాంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోటీల నిర్వహాణ మూడు కేటగిరీలలో పోటీలు జరుపాల్సి ఉంది. కానీ, సిరిసిల్ల జిల్లాలో ఒక్క కేటగిరిలో కూడా పోటీలు జరుగకపోవడం గమనార్హం. మూడేళ్లుగా విడుదల కాని నిధులు.. నిజానికి మూడేళ్ల నుంచి స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల నిర్వహాణకు ఇచ్చే నిధులు విడుదలకాలేదు. దీంతో జిల్లాలో గతంలో పలువురు కార్యదర్శులు నిర్వహించిన పోటీల బడ్జెట్ ఇంతవరకు విడుదల కాలేదు. ఈ క్రమంలో ఈసారి పోటీల నిర్వహాణకు దూరం ఉన్నారు. అండర్ 19 విభాగంలో గతంలో నిర్వహించిన పోటీలకు సుమారు రూ.20 లక్షలు, అండర్ 14, 17 విభాగంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు సుమారు రూ.42 లక్షలు బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే పోటీల నిర్వహణకు ఇటీవల కొత్తగా నియామకమైన పలువురు కార్యదర్శులు దూరంగా ఉన్నట్లు సమాచారం. -
బలమైన శక్తిగా టీఆర్ఎస్
సిరిసిల్ల: తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ అవతరించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన టీఆర్ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ 2001లో పార్టీ ప్రారంభించినప్పుడు ఈ స్థాయికి చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోపాటు సీఎం కేసీఆర్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించారని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అజేయమైన శక్తిగా నిలిచిందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి 32 జెడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం విశేషమన్నారు. ఈనెల 27 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదు ఉంటుందని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బూత్ కమిటీల నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తామన్నారు. పండుగ వాతావరణంలో సభ్యత్వాల నమోదు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా తలపడతాం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతోనే కాదు దేవుడితోనైనా తలబడేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు. బీడు భూములకు సాగునీరు వస్తే సీఎం ఫొటో ప్రతీరైతు గుండెలో ఉంటుందని, ఆయన ఫొటోను పెట్టుకుని మొక్కేరోజులు వస్తాయన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచి అయిందన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించి హరిత తెలంగాణ సాధిస్తామన్నారు. ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. వస్త్ర పరిశ్రమను విస్తరించాలి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విస్తరించాలని కేటీఆర్ కోరారు. సిరిసిల్ల పద్మశాలి నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడులోని తిరువూరుకు దీటుగా కొత్త ఆలోచనలతో వస్త్రోత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత జౌళిశాఖకు రూ.70 కోట్లు ఉన్న బడ్జెట్ ఇప్పుడు తెలంగాణలో రూ.1,270 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. సిరిసిల్లలో అపెరల్ పార్కు నిర్మాణంతో 10 వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మరమగ్గాలు, చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశామని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమాల్లో వేములవాడ, చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితుల సమస్యలు సీఎంకు తెలుసు ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితుల త్యాగం మరువలేనిదని కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ నిర్మాణ పనులను కేటీఆర్ పరిశీలించారు. సొరంగం తవ్వకాలను ఆయన క్షేత్ర స్థాయిలో చూశారు. నిర్వాసితుల త్యాగాలతోనే ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని, కొందరి త్యాగం కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన
సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం పర్యటిస్తారని మంత్రి వ్యక్తిగత అదనపు కార్యదర్శి జి.శ్రీనివాస్ గురువారం సాయంత్రం తెలిపారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట నివాసం నుంచి బయలుదేరి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఉదయం 10 గంటలకు జిల్లాలోని లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ముస్తాబాద్ మండలం ఆవునూరులో ఎస్సీ(మాల) కమ్యునిటీ హాల్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1గంటలకు ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో ఐదు వేల మెట్రిక్‌టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాంను ప్రారంభిస్తారు. అనంతరం వేబ్రిడ్జికి శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు ముస్తాబాద్ మండలం పోత్గల్‌లో వ్యవసాయ మార్కెట్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4 గంటలకు పోత్గల్ నుంచి బయలుదేరి 6.30 గంటలకు హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు చేరుకుంటారని వివరించారు. మంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.