breaking news
Siri auditorium
-
బహుత్ ధన్యవాద్.. జైహింద్!
న్యూఢిల్లీ: ‘బహుత్ ధన్యవాద్’, ‘జైహింద్’ అని హిందీలో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అందర్నీ ఆకట్టుకున్నారు. మంగళవారమిక్కడ సిరి ఆడిటోరియంలో తన ప్రసంగం ప్రారంభంలో ఆయన ఈ పదాలు ఉచ్చరించారు. ‘‘నేను అమెరికా ప్రజల స్నేహాన్ని, శుభాశీస్సులను మోసుకొచ్చా. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ మా ప్రజల తరఫున, నా తరపున, నా భార్య మిషెల్ తరపున బహుత్ ధన్యవాద్’’ అని అనడంతో సభికుల చప్పట్లతో ఆడిటోరియం మార్మోగింది. అలాగే బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటించిన ‘దిల్వాలే దుల్హేనియా లే జాయేంగే’ చిత్రంలోని ఓ డైలాగ్‌ను చెప్పి ఒబామా అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘ఇంతకుముందు భారత్‌కు వచ్చినప్పుడు మేం ముంబైలో దీపావళి జరుపుకున్నాం. కొందరు పిల్లలతో కలసి డ్యాన్స్ చేశాం. కానీ ఈసారి ఆ అదృష్టం లేదు. ఆ డ్యాన్సులేవీ లేవు. ‘సినోరిటా.. బడే బడే దేశ్ మే ఐసీ చోటీ చోటీ బాతీ హోతీ రహెతీ హే’.. నేను చెప్పేది మీకు అర్థమైందనుకుంటా..!’’ అని ఒబామా నవ్వుతూ అనడంతో సభికుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. అనంతరం ఆయన మతం, మహిళా సాధికారత, ఇరుదేశాల మధ్య సంబంధాలు.. తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. ధైర్యం, మానవతా విలువలు భారత్-అమెరికాలను కలుపుతాయని చెబుతూ.. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ప్రముఖ క్రీడాకారుడు మిల్కాసింగ్, బాక్సర్ మేరీకోమ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి పేర్లను ప్రస్తావించారు. ప్రసంగాన్ని ‘జైహింద్’ అంటూ ముగించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత వేదిక దిగి సభికుల వద్దకు వెళ్లి నవ్వుతూ అందరితో కరచాలనం చేశారు. కాగా, ఒబామా ప్రసంగంలో తనను గుర్తుచేయడంపై షారూఖ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి ఒబామా భాంగ్రా డ్యాన్స్ చేయలేకపోయారని, మళ్లీ వచ్చినప్పుడు ‘చయ్యా చయ్యా..’ పాటకు తప్పకుండా నృత్యం చేస్తారని పేర్కొన్నారు. ఒబామాను కలిసిన సత్యార్థి బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి సిరి ఆడిటోరియంలో ఒబామాను కలిశారు. ప్రపంచవ్యాప్తంగా బాలలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించే ఉద్యమంలో తన వంతు సహకారం అందించాలని కోరారు. నోబెల్ బహుమతి.. తన బాధ్యత మరింత పెంచిందని పేర్కొన్నారు. ‘‘బాలలకు భద్రమైన ప్రపంచం నిర్మించడంలో, అహింసాయుత ప్రపంచలో వారి నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో సహకారం అందించాలని ఒబామాను కోరాను’’ అని కైలాశ్ చెప్పారు. -
విశాల్.. ఒబామా.. ఓ ఉద్విగ్నత!
న్యూఢిల్లీ: నాలుగేళ్ల కిందట.. అది ఢిల్లీలోని హుమాయూన్ సమాధి.. ఓ విశిష్ట వ్యక్తి వచ్చారు.. సందర్శన అనంతరం అక్కడే కూలిపని చేసుకుంటున్న ఓ 12 ఏళ్ల బాలుడిని ఆప్యాయంగా పలకరించాడు.. ఆ అబ్బాయి కుటుంబ నేపథ్యం, అతడి ఆశలు, ఆకాంక్షల గురించి అడిగి తెలుసుకున్నాడు..! మంగళవారం.. ఢిల్లీలోని సిరి ఆడిటోరియం.. అదే విశిష్ట వ్యక్తి.. నాలుగేళ్ల కిందట పలకరించిన బాలుడిని గుర్తుపెట్టుకున్నాడు.. నాడు అతడు చెప్పిన ఆశలనూ గుర్తుపెట్టుకున్నాడు.. బాలుడి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఏమేం చేస్తారో చెప్పారు.. తన కూతుళ్లతో సమానంగా ఆ కూలి బాలుడికి కూడా అవకాశాలు దక్కాలని, అతడి కలలు నెరవేరాలని అభిలషించారు..!! ఆ విశిష్ట వ్యక్తి ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆ కూలి బాలుడు విశాల్! సిరి ఆడిటోరియంలో సభికుల మధ్య కూర్చున్న విశాల్ గురించి మాట్లాడి ఒబామా అందరినీ ఆకట్టుకున్నారు. ‘‘నాలుగేళ్ల కిందట నేను హుమాయూన్ సమాధిని సందర్శించినప్పుడు.. ఈ దేశ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న కొందరు కూలీలు, వారి పిల్లలతో మాట్లాడా. భవిష్యత్తుపై ఎన్నో కలలు.. కళ్లలో ఎన్నో ఆశలు నింపుకున్న కొందరు అద్భుతమైన పిల్లల్ని చూశా. వారిలో విశాల్ ఒకరు. ఈరోజు ఆయనకు (విశాల్‌ను చూస్తూ..) 16 ఏళ్లు. ఆయన కుటుంబం దక్షిణ ఢిల్లీకి సమీపంలోని ఓ పల్లెలో నివాసం ఉంటోంది. ఆయన తల్లి హుమాయూన్ సమాధి వద్ద పని చేస్తుంటుంది. తండ్రి రాళ్ల పని చేస్తాడు. సోదరి యూనివర్సిటీలో చదువుతోంది. మరో సోదరుడు రోజువారీ కూలి. వీళ్లంతా పని చేయడం వల్ల విశాల్ స్కూలుకు వెళ్లగలిగాడు. ఆయనకు కబడ్డీ చూడడం ఇష్టం. సైన్యంలో చేరాలన్నది విశాల్ కల. ఆయనను చూసి మనమంతా గర్వపడాలి. ఇక్కడి పిల్లల్లో అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయనడానికి విశాల్ ఒక ఉదాహరణ. నా కూతుళ్లు మాలియా, నషా కలలు నాకు ఎంత ముఖ్యమో విశాల్ కలలు కూడా అంతే ముఖ్యం. నా కూతుళ్లకు దక్కే అవకాశాలే విశాల్కూ దక్కాలి.’’ అని ఒబామా అన్నారు. దీంతో ఉద్విగ్నతకు గురైన సభికులు చప్పట్ల మోతతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.