బహుత్ ధన్యవాద్.. జైహింద్! | With 'Namaste', 'Bahut Dhanyawaad', Barack Obama strikes a chord with young India | Sakshi
Sakshi News home page

బహుత్ ధన్యవాద్.. జైహింద్!

Published Wed, Jan 28 2015 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రేక్షుకుల సందడి మధ్య ఒబామా

సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రేక్షుకుల సందడి మధ్య ఒబామా

న్యూఢిల్లీ: ‘బహుత్ ధన్యవాద్’, ‘జైహింద్’ అని హిందీలో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అందర్నీ ఆకట్టుకున్నారు. మంగళవారమిక్కడ సిరి ఆడిటోరియంలో తన ప్రసంగం ప్రారంభంలో ఆయన ఈ పదాలు ఉచ్చరించారు. ‘‘నేను అమెరికా ప్రజల స్నేహాన్ని, శుభాశీస్సులను మోసుకొచ్చా. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ మా ప్రజల తరఫున, నా తరపున, నా భార్య మిషెల్ తరపున  బహుత్ ధన్యవాద్’’ అని అనడంతో సభికుల చప్పట్లతో ఆడిటోరియం మార్మోగింది. అలాగే బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటించిన ‘దిల్‌వాలే దుల్హేనియా లే జాయేంగే’ చిత్రంలోని ఓ డైలాగ్‌ను చెప్పి ఒబామా అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘ఇంతకుముందు భారత్‌కు వచ్చినప్పుడు మేం ముంబైలో దీపావళి జరుపుకున్నాం.
 
 కొందరు పిల్లలతో కలసి డ్యాన్స్ చేశాం. కానీ ఈసారి ఆ అదృష్టం లేదు. ఆ డ్యాన్సులేవీ లేవు. ‘సినోరిటా.. బడే బడే దేశ్ మే ఐసీ చోటీ చోటీ బాతీ హోతీ రహెతీ హే’.. నేను చెప్పేది మీకు అర్థమైందనుకుంటా..!’’ అని ఒబామా నవ్వుతూ అనడంతో సభికుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. అనంతరం ఆయన మతం, మహిళా సాధికారత, ఇరుదేశాల మధ్య సంబంధాలు.. తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. ధైర్యం, మానవతా విలువలు భారత్-అమెరికాలను కలుపుతాయని చెబుతూ.. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ప్రముఖ క్రీడాకారుడు మిల్కాసింగ్, బాక్సర్ మేరీకోమ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి పేర్లను ప్రస్తావించారు. ప్రసంగాన్ని ‘జైహింద్’ అంటూ ముగించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత వేదిక దిగి సభికుల వద్దకు వెళ్లి నవ్వుతూ అందరితో కరచాలనం చేశారు. కాగా, ఒబామా ప్రసంగంలో తనను గుర్తుచేయడంపై షారూఖ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి ఒబామా భాంగ్రా డ్యాన్స్ చేయలేకపోయారని, మళ్లీ వచ్చినప్పుడు ‘చయ్యా చయ్యా..’ పాటకు తప్పకుండా నృత్యం చేస్తారని పేర్కొన్నారు.
 
ఒబామాను కలిసిన సత్యార్థి
 బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి సిరి ఆడిటోరియంలో ఒబామాను కలిశారు. ప్రపంచవ్యాప్తంగా బాలలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించే ఉద్యమంలో తన వంతు సహకారం అందించాలని కోరారు. నోబెల్ బహుమతి.. తన  బాధ్యత మరింత పెంచిందని పేర్కొన్నారు. ‘‘బాలలకు భద్రమైన ప్రపంచం నిర్మించడంలో, అహింసాయుత ప్రపంచలో వారి నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో సహకారం అందించాలని ఒబామాను కోరాను’’ అని కైలాశ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement