Siriasis
-
అకాల మరణాలతో ఆగినపెళ్లిళ్లు..!
సాక్షి, ఉప్పునుంతల (అచ్చంపేట): అప్పటి వరకు పెళ్లి సందడితో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. తండ్రి అకాల మృతితో పెళ్లి పీఠల వరకు వచ్చిన పెళ్లి నిలిచిపోయింది. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి మండలంలోని కాంసానిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాచర్ల నిరంజన్(50), రేణమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకూతురికి గతంలోనే వివాహం కాగా.. రెండో కూతురు అఖిల వివాహం ఆదివారం వంగూరు మండలం మిట్టసదగోడు గ్రామానికి చెందిన శంకర్‌తో నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లి పందిరి వేసి నిరంజన్ ఇంట్లో గురువారం సత్యనారాయణ వ్రతం నిర్వహించి అఖిలను పెళ్లి కూతుర్ని చేశారు. శుక్రవారం అమ్మాయి ఇంట్లో ప్రతానం కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా గురువారం రాత్రి అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. మరో రెండు గంటల్లో పెళ్లి కుమారునికి సంబంధించిన బంధువులు కాంసానిపల్లి రావాల్సి ఉంది. రాత్రి పదిగంటల సమయంలో నిరంజన్ భోజనం చేస్తుడంగా ఛాతిలో నొప్పి వస్తుందని కుప్పకూలి కొద్దిసేపటికే మృతిచెందాడు. దీంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి మృతితో కూతురు పెళ్లి ఆగిపోవడం బంధువులను, గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. వడదెబ్బతో కౌలురైతు... పాన్‌గల్ (వనపర్తి): పొలం పనులు చేస్తున్న ఓ కౌలురైతు వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం పాన్గల్లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగనమోని రాములు(58) భార్య బాలమ్మతో కలిసి శుక్రవారం కౌలుకు తీసుకున్న పొలంలో చెత్తను, కంప చెట్లను తొలగించే పనులు చేస్తున్నారు. ఈ తీవ్రమైన ఎండకు వడదెబ్బకు గురై పొలంలోనే సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందాడు. గత రెండు రోజులుగా వ్యవసాయ పనులు చేస్తుండటంతో వడదెబ్బకు గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రాములుకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇంటి యజమాని అకాల మరణంతో కటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా రాములు మృతితో శనివారం జరగాల్సిన సోదరుని కుమారుని వివాహం నిలిచిపోయింది. వడదెబ్బతో మృతిచెందిన రాములు కుటుంబాన్ని తహసీల్దార్ అలెగ్జాండర్, ఆర్ఐ బాల్‌రాంనాయక్, సర్పంచ్ సురేఖ, మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడు ఆనందం, సింగోటం, నర్సింహ, వార్డుసభ్యులు భాస్కర్‌రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మత్స్యకార్మిక సంఘం నాయకులు కోరారు. -
‘పౌల్ట్రీ’కి ఎండదెబ్బ!
అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతలు నిత్యం వందలాది కోళ్ల మృత్యువాత ఆందోళనలో పౌల్ట్రీఫాంల యజమానులు యాచారం : రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. వేడిగాలులు, ఎండదెబ్బతో నిత్యం వందలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వారం రోజులుగా వేసవి తీవ్రత ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో కోళ్లు వేడిని తట్టుకోలేకపోతున్నాయి. వాటిని రక్షించుకోవడానికి పౌల్ట్రీఫాంల యజమానులు శతవిధాలుగా చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండాపోతుంది. అప్పులపాలు కాకతప్పదని వారు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలో పలు గ్రామాల్లో సన్న, చిన్నకారు రైతులు మాల్ ఆంధ్రా బ్యాంకు, యాచారం పీఏసీఎస్, ఎస్బీహెచ్లలో అప్పులు తీసుకొని పౌల్ట్రీఫాంలు ఏర్పాటు చేశారు. తమ్మలోనిగూడ, చౌదర్పల్లి, నక్కర్తమేడిపల్లి, మొండిగౌరెల్లి, యాచారం, చింతుల్ల తదితర గ్రామాల్లో దాదాపు 200 మంది రైతులు ఆయా బ్యాంకుల్లో రూ. లక్షలాది రుణాలు పొందారు. వ్యవసాయానికి తోడుగా పౌల్ట్రీఫాంలను నిర్వహిస్తే మంచి ఆదాయం పొందవచ్చని ఆశించారు. ప్రస్తుతం వారి కలలు కల్లలయ్యే దుస్థితి దాపురించింది. లాభాల మాటేమోగాని నష్టాలు చవిచూడకుండా ఉంటే చాలని రైతులు పేర్కొంటున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వేలాది కోళ్లు వేసవి తాపానికి అస్వస్థతకు గురికావడం, నీళ్లు చల్లినా, అవసరమైన మందులు అందిస్తున్నా క్షణాల వ్యవధిలోనే మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండలంలోని పలు గ్రామాల్లో పౌల్ట్రీఫాంలను నిర్వహిస్తున్న రైతులు వివిధ బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఇంటిగ్రేషన్ పద్ధతిన కోళ్ల పెంపకం చేపడుతున్నారు. స్నేహ, సుగుణ, శ్రీ వెంకటేశ్వర తదితర కంపెనీల నుంచి కోడిపిల్లలను తీసుకువచ్చి పెంచుతున్నారు. నిబంధనలు, ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే నిర్వహణ డబ్బులు చెల్లిస్తాయి. కోడిపిల్లలను అందజేసిన 35 నుంచి 38 రోజుల్లోనే ఆయా సంస్థలే కోళ్లను తీసుకెళ్తాయి. ప్రస్తుతం చికెన్ ధరలు బాగానే ఉన్నప్పటికి, కోళ్లు మృత్యువాత పడుతున్న దృష్ట్యా ఇంటిగ్రేషన్ సంస్థలు 45 రోజులు దాటినా కోళ్లను తీసుకెళ్లడంలేదంటున్నారు రైతులు. కోళ్లు రోజురోజుకూ బరువు పెరుగుతుండటంతో పాటు దాణా రెండింతలు తింటున్నాయి. సకాలంలో కోళ్లను తరలించకపోవడం, దాణా ఖర్చులు భారంగా మారడంతో రైతులకు పెంపకం ఖర్చులు భారంగా మారాయి. దీనికి తోడు వారంరోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో వేసవి తాపానికి కోళ్లు మృతిచెందుతున్నాయి. దీంతో తాము అప్పుల్లో కూరుకుపోయే దుస్థితి దాపురించిందని పౌల్ట్రీ యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.