పర్వత చిట్టిబాబు సోదరి మృతి
శంఖవరం : దివంగత టీడీపీ నేత పర్వత చిట్టిబాబు అక్కయ్య దేవారపు పార్వతమ్మ (62) ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గత ఆదివారం తెల్లవారుజామున చిట్టిబాబు కూడా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని స్వగ్రామం తుని నుంచి ఆమె ఆదివారం శంఖవరం వచ్చారు. చిట్టి బాబు పెదకర్మ బుధవారం జరగనున్న దృష్ట్యా ఇక్కడే ఉండిపోయారు. శనివారం రాత్రి నుంచి అస్వస్థతగా ఉన్న ఆమె ఆదివారం తెల్లవారుజామున గుండెనొప్పితో బాధపడ్డారు. ఆమెకు వైద్యసాయం అందించేలోగా తుదిశ్వాస విడిచారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు దేవారపు నాగేశ్వరరావు భార్య అయిన పార్వతమ్మ కొన్నేళ్లుగా తునిలో నివసిస్తున్నారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. అంత్యక్రియలు తునిలో జరిపేందుకు ఆమె భౌతికకాయాన్ని అక్కడికి తరలించారు.