site evaluation
-
ఉప్పల్-యాదాద్రి ‘మెట్రో’కు స్థల పరిశీలన
► భువనగిరి, రాయగిరి వద్ద స్థలాలను పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి ► ఎంఎంటీఎస్ పొడిగింపు, మెట్రో మార్గంపై పరిశీలన సాక్షి, హైదరాబాద్: యాదాద్రికి రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్ నుంచి యాదాద్రికి 52 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ఈ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్) మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డితోపాటు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఇతర నిపుణుల బృందం పర్యటించింది. భువనగిరి, రాయగిరి ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఈ బృందం పరిశీలించింది. ఆకాశమార్గం(ఎలివేటెడ్) తరహాలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలా లేదా ఎంఎంటీఎస్ రెండో దశను సికింద్రాబాద్ నుంచి యాదాద్రికి పొడిగించాలా అన్న అంశాన్ని సైతం నిపుణుల బృందం పరిశీలించింది. ఉప్పల్-యాదాద్రి మార్గంపై సమగ్ర అధ్యయనం జరిపి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సెలవు రోజులు, పర్వదినాల్లో యాదాద్రికి నగరం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతుండడంతో రోడ్డు మార్గంలో వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో మెట్రో మార్గం ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్గంలో మెట్రో స్టేషన్లు, పార్కింగ్ వసతులు, ప్రధాన రహదారి మధ్యలో పనులు చేపట్టేందుకు వీలుగా విశాల రహదారులు అందుబాటులో ఉండడంతో మెట్రో నిర్మాణం నల్లేరు మీద నడకేనని నిపుణులు చెబుతుండడం విశేషం. పీపీపీ విధానమా.. ప్రభుత్వ నిధులా..? ఉప్పల్ నుంచి 52 కి.మీ. దూరంలో ఉన్న యాదాద్రికి ఎలివేటెడ్ తరహాలో మెట్రో మార్గాన్ని నిర్మించిన పక్షంలో కిలోమీటర్‌కు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వ్యయం కానుంది. అంటే ప్రాజెక్టుకు మొత్తం రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టి నిర్వహణ బాధ్యతలు సదరు సంస్థకే అప్పజెబితే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. అయితే మెట్రో కన్నా ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తే అంచనా వ్యయం భారీగా తగ్గుతుందన్న అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో నిపుణుల బృందం అధ్యయన నివేదికలను పరిశీలించిన తర్వాత తాజా ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి స్థల పరిశీలన
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు అధికారులు సోమవారం స్థల పరిశీలన చేశారు. మండలంలోని దిబ్బలపాలెం గ్రామంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ప్రాంతీయ డెరైక్టర్ శ్రీవాస్తవ, విశాఖపట్నం విమానాశ్రయం డెరైక్టర్ పట్టాభి, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు, ఆర్డీవో వెంకట్రావ్, తహసీల్దారు లక్ష్మారెడ్డి తదితరులు పరిశీలించారు. సముద్ర తీరానికి ఎంత దూరంలో ప్రతిపాదిత భూములు ఉన్నాయి, విమానాశ్రయానికి అనుకూలమా..కాదా తదితర అంశాలకు సంబంధించి భౌగోళిక అధ్యయనం జరిపారు. తమ భూములు పోతాయేమోనన్న ఆందోళన రైతుల్లో ఉందని, ఎన్ని ఎకరాలు సేకరించనున్నారని విలేకరులు అడగ్గా... తాము కేవలం స్థలం అనుకూలమా? కాదా? అన్న అంశానికే పరిమితమైనట్టు అధికారులు వెల్లడించారు. -
ఉగాది వేడుకలకు స్థల పరిశీలన
అనంతవరం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్పీ తాడికొండ : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను రాష్ట్ర ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో నిర్వహించను ంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, ఇతర అధికారులు ఆదివారం ఆ గ్రామాన్ని సందర్శించి స్థల పరిశీలన చేశారు. గ్రామ ప్రవేశానికి ముందు రోడ్డుపక్కన ఉన్న పొలాన్ని వేదికగా నిర్ణయించారు. తొలుత కలెక్టర్, ఎస్పీ గ్రామంలోని కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యే పూజలు నిర్వహించారు. అనంతరం పండుగనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండపైకి వచ్చి పూజలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి దేవాదాయశాఖ అసిస్టెంటు కమిషనరు పీవీ శ్రీనివాసరావుతో చర్చించారు. ప్రధాన రహదారి నుంచి సీఎం కాన్వాయ్ ఎటు నుంచి రావాలి, ఎటునుంచి వెళ్ళాలన్న దానిపై అధికారులతో చర్చించారు. రోడ్డుకు 75 మీటర్ల లోపల నుంచి వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. వేదిక ముందు వీఐపీ, మీడియాకు స్థలం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదే విధంగా ప్రధాన రహదారి నుంచి వేదిక వద్దకు, వేదిక వద్ద నుంచి కొండ వరకు తాత్కాలిక రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాలకు పార్కింగ్, ప్రజలకు వేదిక వద్ద కుర్చీలు ఉండేలా ఏర్పాటు చేయాలని చెప్పారు. సీఎం కూర్చునే వేదికతోపాటు పక్కనే మరో రెండు వేదికలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వేదిక కూడా తూర్పు ముఖంతో ఉండేలా చూడాలన్నారు. వేడుకలకు వచ్చేవారికి పానకం, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొండపైకి వెళ్ళేసమయంలో సీఎం కాన్వాయ్‌లో ఏడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఘాట్‌రోడ్డుపై ట్రయల్ రన్ నిర్వహించాలని అమరావతి సీఐ హనుమంతరావును ఆదేశించారు. సీఎం హెలిప్యాడ్‌పై ఖరారు కాని నిర్ణయం... అనంతవరం రానున్న సీఎం కోసం హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది అధికారులు నిర్ణయించలేదు. ఉగాది రోజున సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల్లోనైనా రోడ్డుషో నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. దీంతో రోడ్డుషో రూట్ ఖారారు అయిన తరువాత మాత్రమే హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై ఓ నిర్ణయానికి వస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ రాఘవేంద్రరావు, అదనపు జేసీ ఎం.వెంకటేశ్వరావు, డీఎస్పీ మధుసూదనరావు, పలు శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
క్రీడా విశ్వవిద్యాలయం కోసం స్థల పరిశీలన
ముద్దనూరు : కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(ఎన్ఐఎస్), స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని ఇంచార్జి ఏజేసీ,స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, ఆర్డీవో వినాయకం, జిల్లా స్పోర్ట్స్ అధికారి బాషామొహిద్దీన్‌లు గురువారం ముద్దనూరు మండలంలో పరిశీలించారు. శెట్టివారిపల్లెకు సమీపంలోని సుమారు 1000ఎకరాల ప్రభుత్వ భూమిని వారు పరిశీలించారు. అనంతరం ఇంచార్జి ఏజేసీ విలే కరులతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఎన్‌ఐఎస్‌కు సుమారు 250 ఎకరాలు, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయానికి సుమారు 125 ఎకరాల భూమి అవసరమన్నారు. రాష్ట్రానికి మంజూరైన ఈ సంస్థలకు జిల్లాల వారీగా ఎవరు ముందు అనువైన స్థలాన్ని సూచిస్తారో ఆ జిల్లాలోనే ఈ సంస్థల ఏర్పాటు చేస్తారన్నారు. జిల్లా స్పోర్ట్స్ అధికారి బాషామొహిద్దీన్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు ఈ క్రీడాసంస్థల్లో శిక్షణ, నైపుణ్యాన్ని అందిస్తారన్నారు. కేవలం స్థల పరిశీలనచేయాలని తమకు ఆదేశాలు అందినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 13 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు జిల్లా వ్యాప్తంగా 13మండల కేంద్రాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు స్థలాలను పరిశీలిస్తున్నట్లు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు ముద్దనూరు-జమ్మలమడుగు రహదారిలో ఎత్తులేటికట్ట కిందభాగంలో స్పోర్ట్ కాంప్లెక్స్ కోసం ఆర్డీవోతో కలసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు జయప్రసాద్, ఆర్ఐ సుశీల, వీఆర్వో మనోహర్, సర్వేయర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.