ఉప్పల్-యాదాద్రి ‘మెట్రో’కు స్థల పరిశీలన
► భువనగిరి, రాయగిరి వద్ద స్థలాలను పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి
► ఎంఎంటీఎస్ పొడిగింపు, మెట్రో మార్గంపై పరిశీలన
సాక్షి, హైదరాబాద్: యాదాద్రికి రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్ నుంచి యాదాద్రికి 52 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ఈ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్) మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డితోపాటు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఇతర నిపుణుల బృందం పర్యటించింది. భువనగిరి, రాయగిరి ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఈ బృందం పరిశీలించింది.
ఆకాశమార్గం(ఎలివేటెడ్) తరహాలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలా లేదా ఎంఎంటీఎస్ రెండో దశను సికింద్రాబాద్ నుంచి యాదాద్రికి పొడిగించాలా అన్న అంశాన్ని సైతం నిపుణుల బృందం పరిశీలించింది. ఉప్పల్-యాదాద్రి మార్గంపై సమగ్ర అధ్యయనం జరిపి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సెలవు రోజులు, పర్వదినాల్లో యాదాద్రికి నగరం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతుండడంతో రోడ్డు మార్గంలో వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో మెట్రో మార్గం ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్గంలో మెట్రో స్టేషన్లు, పార్కింగ్ వసతులు, ప్రధాన రహదారి మధ్యలో పనులు చేపట్టేందుకు వీలుగా విశాల రహదారులు అందుబాటులో ఉండడంతో మెట్రో నిర్మాణం నల్లేరు మీద నడకేనని నిపుణులు చెబుతుండడం విశేషం.
పీపీపీ విధానమా.. ప్రభుత్వ నిధులా..?
ఉప్పల్ నుంచి 52 కి.మీ. దూరంలో ఉన్న యాదాద్రికి ఎలివేటెడ్ తరహాలో మెట్రో మార్గాన్ని నిర్మించిన పక్షంలో కిలోమీటర్‌కు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వ్యయం కానుంది. అంటే ప్రాజెక్టుకు మొత్తం రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టి నిర్వహణ బాధ్యతలు సదరు సంస్థకే అప్పజెబితే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. అయితే మెట్రో కన్నా ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తే అంచనా వ్యయం భారీగా తగ్గుతుందన్న అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో నిపుణుల బృందం అధ్యయన నివేదికలను పరిశీలించిన తర్వాత తాజా ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.