మావోయిస్టు లొంగుబాటు
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : చత్తీస్‌గఢ్ రాష్ట్రం మెయిన్పూర్ డివిజన్లో జిల్లా కమిటీ సభ్యుడుగా పనిచేసిన మావోయిస్టు సీతా నరసింహులు అలియాస్ జానీ సలాం అలియాస్ జనార్దన్ (34) సంగారెడ్డిలో ఎస్పీ విజయ్‌కుమార్ ఎదుట బుధవారం లొంగిపోయారు. మెదక్ జిల్లా కొండపాక మండలం దోమలోనిపల్లి గ్రామానికి చెందిన సీతా నరసింహులు మావోయిస్టు ఉద్యమంలో వివిధ హోదాల్లో 16 ఏళ్లు పార్టీలో పనిచేశారని ఎస్పీ తెలిపారు.
1997లో గిరాయిపల్లి దళ కమాండర్ శ్రీరాముల శ్రీనివాస్ ఉపన్యాసాలకు ప్రభావితుడై పార్టీలో చేరి 1999 వరకు గిరాయిపల్లి దళంలో దళ సభ్యుడిగా పనిచేశాడని చెప్పారు. 1999లో నల్లమల అటవీ ప్రాంతానికి బదిలీ అయి 2004 వరకు అక్కడే పనిచేశాడన్నారు. 2000 సంవత్సరంలో ఏసీఎంగా పదోన్నతి పొంది, అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో పనిచేసినట్లు చెప్పారు. పార్టీ విధి విధానాలు నచ్చక పోవడం, ఆరోగ్య సమస్యలు తదితర కారణాలతో లొంగిపోయినట్లు తెలిపారు. కాగా ప్రభుత్వం రూ. 5 లక్షల రివార్డు ప్రకటించి ఉన్నందున ఆ రివార్డుతో పాటు ఇతర సదుపాయాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు.