డేంజర్
శిథిలావస్థలో భవనాలు
పట్టించుకోని అధికార యంత్రాంగం
పొంచి ఉన్న ప్రమాదం
గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చని వైనం
వర్షాలతో జనంలో భయం
సిటీబ్యూరో: విశ్వ నగరం దిశగా అడుగులేస్తున్నామని చెబుతూ... ఆకాశ హర్మ్యాల వైపు చూస్తున్న అధికారులు తమ కళ్ల ముందు శిథిల భవనాల రూపంలో పొంచి ఉన్న మృత్యువును గుర్తించడంలో విఫలమవుతున్నారు. మహా నగరంలో వానకు తడుస్తూ... గాలికి ఊగుతూ ఏక్షణాన కూలిపోతాయో తెలియని స్థితిలో వందలాది భవనాలు ఉన్నాయి. పొరపాటున ఏదైనా భవనం కూలితే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో చోటుచేసుకున్న ఈ తరహా సంఘటనల నుంచి అధికారులు ఎటువంటి పాఠమూ నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. శిథిల భవనాలపై కానీ.. ఫైర్‌సేఫ్టీ నిబంధనల అమలుపై కానీ జీహెచ్ఎంసీ అధికారులు శ్రద్ధ కనబరచడం లేదు. ఏదైనా ఘోరం జరిగినప్పుడో.. ప్రజల ప్రాణాలు పోయినప్పుడో మాత్రం లేనిపోని హడావుడి చేస్తూ... ఆ తర్వాత మిన్నకుంటున్నారు. రెండేళ్ల క్రితం సిటీలైట్ హోటల్ ప్రమాదంలో 13మంది మృతి చెందినప్పుడు ఎంతో హడావుడి చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. ఆ తరువాత షరా మామూలే. ఈ సీజన్లో ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం కురవలేదు. భారీ వర్షాలు వస్తే ఎన్ని భవనాలు కుప్పకూలుతాయో తెలియని దుస్థితి.
గుర్తించేదెవరో...
శిథిల భవనాలను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లూ చేయలేదు. తమ పరిధిలో ఉన్న భవనాల్లో బాగా పాతబడి... ఏ క్షణాన్నయినా కూలిపోవచ్చునేమోనన్నట్లుగా కనిపిస్తున్న వాటినే సంబంధిత అధికారులు శిథి లమైనవిగా గుర్తిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న సందర్భాల్లో నోటీసులు జారీ చేస్తున్నారు. అంతే తప్ప స్ట్రక్చరల్ స్టెబిలిటీని బట్టి శిథిల భవనాలను గుర్తించడం లేదు. వర్షాకాలానికి ముందే ఇలాంటివి కూల్చివేయాల్సి ఉంది. ఆ పనులూ కనిపించవు. ఏటా మొక్కుబడిగా నోటీసులివ్వడం... తదుపరి చర్యలు లేకపోవడంతో, శిథిల భవనాల యజమానులు సైతం మరమ్మతు చర్యలు చేపట్టడం లేదు.
లెక్క తేల్చినా...
గట్టిగా నాలుగు చినుకులు పడితే 1819 భవనాలు కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నట్లు రెం డేళ్ల క్రితం గుర్తించారు. వాటిల్లో 845 భవనాలకు మరమ్మతులు చేయడమో లేక కూల్చివేయడమో జరిగినట్లు పేర్కొన్నారు. మిగతా 974 ఇంకా అదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిపై ఇంతవరకు ఎలాంటి చర్యలూ లేవు. వీటిలో కొన్ని కూలినప్పటికీ సమాచారం లేదు. గడచిన రెండేళ్లలో మరికొన్ని భవనాలు శిథిలావస్థకు చేరి నా వాటి లెక్కలే లేవు. ఇలాంటి భవనాలను చూ సి పరిసర ప్రాంతాల ప్రజలు తల్లడిల్లుతున్నారు.
అమలుకు నోచని ప్రకటనలు..
తొలిదశలో యాభై ఏళ్లు దాటిన.. సున్నం తోనూ... పిల్లర్లు లేకుండా గోడల ఆధారంతో నిర్మించిన వాణిజ్య భవనాలను తనిఖీ చే సి చర్యలు తీసుకుంటామని రెండేళ్ల క్రితం చెప్పారు. సిటీలైట్ హోటల్ ప్రమాద ఘటనతో అప్పట్లో ఆ ప్రకటన చేశారు. ఆ తర్వాత మరచిపోయారు. ముంబై కార్పొరేషన్ చట్టం తరహాలో రాష్ట్రంలోనూ 30 ఏళ్లు దాటిన భవనాల యజమానులు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఇచ్చేలా చూస్తామన్నారు. ఆమేరకు జీహెచ్ ఎంసీ చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించినప్పటికీ అమలుకు నోచలేదు. శిథిల భవనాల వివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఉంచుతామనే హామీలూ అమలు కాలేదు.
ఇదీ పరిస్థితి
2008లో వర్షాకాలంలో పాతబస్తీలోని పంజేషాలో పురాతన భవనం కూలి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
2009లోనూ మరో రెండు భవనాలు కూలాయి.మూడేళ్ల క్రితం సైదాబాద్‌లో ఓ భవనం కూలింది.రెండేళ్ల క్రితం మౌలాలిలోని మెహదీజంగ్ కాలనీలో ప్రహరీ కూలి ఆరుగురు మృతి చెందారు.గతంలో దిల్‌సుఖ్‌నగర్‌లో సెల్లార్ పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. సోమాజిగూడలో ఓ కార్పొరేట్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ప్రమాద ం సంభవించింది.శిథిల భవనాల్లోనూ, నిర్మాణ పనుల్లోనూ, సెల్లార్ల నిబంధనల్లోనూ చూసీ చూడనట్లు వ్యవహరి స్తుండటంతో ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది.