అన్నదాతకు ఎన్ని కష్టాలో..
సాక్షి, ఏలూరు : జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్న అన్నదాతలు ఈ ఖరీఫ్‌లో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరు ఆలస్యం కావడంతో సకాలంలో పంటలు వేయలేకపోయారు. సమయం మించిపోవడంతో జిల్లాలోని 66,265 ఎకరాల్లో వరి పంటకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా అధికారులు తాజాగా ప్రకటించారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాల్లో వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు సాగుచేయక తప్పదని వ్యవసాయాధికారులు స్పష్టం చేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 87వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసుల ద్వారా బోరు నీటిని సాగుకు వినియోగిస్తున్నారు. బోర్లు లేనిచోట సాగునీటి కోసం చెరువులు, వర్షాధార కాలువలపై ఆధారపడుతున్నారు. ఆగస్టు నెలాఖరు వరకూ వర్షాలు తగినంతంగా కురవకపోతే జిల్లావ్యాప్తంగా 80వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోకతప్పదని గతంలో తేల్చారు. ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ ప్రారంభంలో కొద్దిపాటి జల్లులు కురవడంతో కొన్నిచోట్ల నాట్లు పడ్డాయి. చివరి వరకు మెట్ట ప్రాంతంలో వరినాట్లు వేయని 66,265 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సి వస్తోంది. అదును దాటిపోతుండటంతో డెల్టాలోని శివారు ప్రాంత చేలల్లో ఏ పంటనూ వేయకుండా ఖాళీగా వదిలేస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 2,38,506 హెక్టార్లలో వరి సాగు లక్ష్యాన్ని నిర్ధేశించగా, 2 లక్షల 12 వేల హెక్టార్లలో వరినాట్లు పూర్తి చేశారు. ఖరీఫ్ పంటకు సంబంధించి సాధారణ వర్షపాతం ఆగస్టు నెలాఖరు నాటికి 604.06 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇంతవరకూ 396.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో జిల్లాలోని 15 మెట్ట మండలాలైన జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నర్సాపురం, భీమడోలు, ఉంగుటూరు, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో ఇప్పటికీ నాట్లు వేయలేదు. ఇక్కడ ప్రత్యామ్నాయ పంటలు వేయాల్సి వస్తోంది. డెల్టాలోనూ శివారు చేలను ఖాళీగా వదిలేశారు.
సాగునీరు విడుదల అలస్యం కావడంతో రైతులు నారుమళ్లు వేసుకోలేకపోయారు. ఇప్పుడు సాగునీరు ఉన్నా అపరాల సాగు చేసుకునే అవకాశం లేదు. దీంతో అటు వరికి, ఇటు ప్రత్యామ్నాయ పంటలకు కాకుండా అక్కడి పంటచేలు ఖాళీగా ఉంచేయాల్సి వచ్చింది. వ్యవసాయ అధికారులు ఆయా మండలాల్లో పర్యటించి, రైతులను కలిసి ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన కల్పించడానికి సన్నద్ధమవుతున్నారు. వరిని వదులుకున్న వేలాది ఎకరాల్లో పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, కందులు, నువ్వులు వంటి పంటలు వేయడానికి 8వేల క్వింటాళ్ల విత్తనాలను అధికారులు ఆంధ్రప్రదేశ్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రప్పించి రైతులకు రాయితీపై అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.