సహారన్పూర్లో కొనసాగుతున్న కర్ఫ్యూ
లక్నో : ఉత్తరప్రదేశ్లోని సహారన్ పూర్లో సోమవారం కూడా కర్ఫ్యూ కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం భూ వివాదం విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే.అయితే ఉద్రిక్తత మాత్రం ఇంకా కొనసాగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను అధికారులు పొడిగించారు. చెదురు మదురు ఘటనలు మినహా పరిస్థితి అదుపులో ఉన్నట్లు జిల్లా పోలీస్ అధికారి రాజేష్ పాండే తెలిపారు. వీలైనంత తొందరగా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కాగా ఈ ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ అల్లర్లలో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధం అయ్యాయి. ఇక ముందు జాగ్రత్తగా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశామని ఉత్తరప్రదేశ్ ఏడీజీ ముకుల్ గోయల్ తెలిపారు.