శివసైనికులను డబ్బుతో కొనలేరు
సాక్షి, ముంబై: శివసైనికులను డబ్బుతో కొనలేరని ఆ పార్టీ కార్యాధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే పేర్కొన్నారు. వారు ప్రాణాలైనా ఇస్తారని, అమ్ముడు పోరంటూ ధీమా వ్యక్తం చేశారు. నాసిక్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన పార్టీ కార్యకర్తల మార్గదర్శన శిబిరంలో పాల్గొన్న ఉద్ధవ్ పీడబ్ల్యూడీ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌ను లక్ష్యంగా చేసుకొని తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ‘భుజ్‌బల్ ఎవరినైనా డబ్బుతో కొనవచ్చుననే భ్రమలో ఉన్నారు. శివసైనికులు అవసరమైతే ప్రాణాలైనా ఇస్తారు. అంతేగానీ మీలాగా ఎవరికో అమ్ముడు పోరు. మీరు శివసేన పులులతో వైరం పెంచుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో మీకు వారి చేతిలో ఓటమి తప్పదు. ఈ విషయాన్ని భుజ్‌బల్ గుర్తుంచుకోవాలి. టైమ్స్ నౌ వంటి జాతీయ న్యూస్ చానళ్లు నిర్వహించిన సర్వేలో శివసేన అగ్రస్థానంలో ఉందని వెల్లడించా యి. ఇదెంతో సంతోషకరమైన విషయం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా శివసేన పార్టీ 15-17 స్థానాలను కైవసం చేసుకుంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలంటే ఇప్పటినుంచే పార్టీ కార్యకర్తలు ఆ దిశగా కృషి చేయాలి. అసెంబ్లీ భవనంపై కాషాయ జెండా ఎగురవేయాలని బాల్‌ఠాక్రే కలలుగన్నారు. దానిని సాకారం చేసే బాధ్యత మనందరిపై ఉంద’ని కార్యకర్తలకు ఉద్ధవ్ పిలుపునిచ్చారు.