తీవ్రవాదుల గురి!
రాజధాని నగరంపై పాకిస్తానీ ముష్కరులు గురి పెట్టారు. పలు చోట్ల పేలుళ్లు జరపడానికి కుట్ర పన్నారు. తమ ఏజెంట్‌ను పంపించి రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చిన ఐఎస్ఐ ఏజెంట్ జాకీర్ హుస్సేన్‌ను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి శాటిలైట్ ఫోన్లు, నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. తాజా ఘటనతో నగరంలో నిఘాను పటిష్టం చేశారు.
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరం చెన్నై ప్రశాంతంగా ఉంటుంది. నిత్యం జనంతో కిక్కిరిసి ఉండే ఈ నగరాన్ని తీవ్ర వాదులు టార్గెట్ చేసినట్టు గతంలో సమాచారం అందింది. అప్పటి నుంచి పటిష్ట నిఘాతో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోనప్పటికీ, తరచూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజల్లో భయాందోళన పుట్టిస్తున్నారుు. ఇటీవల విద్యార్థుల ముసుగులతో తీవ్రవాదులు నక్కి ఉన్న సమాచారం అందింది. అదే సమయంలో అజ్ఞాత తీవ్రవాదులు పట్టుబడడంతో నగర భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఏకంగా ఐఎస్ఐ ఏజెంట్‌గా భావిస్తున్న జాకీర్ హుస్సేన్ నెలలో మూడు సార్లు శ్రీలంక నుంచి చెన్నైకు వచ్చి మరీ పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.
అలర్ట్: రెండు రోజుల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్, క్యూ బ్రాంచ్ అలర్ట్ అయింది. నగర పోలీసు యంత్రాంగంలో చురుగ్గా ఉన్న కొందరు అధికారుల సహకారంతో ప్రత్యేక ఆపరేషన్‌కు క్యూబ్రాంచ్ వ్యూహ రచన చేసింది. మఫ్టీలో ఉన్న ఈ బృందాలు మన్నడి, పెరియ మేడు, ట్రిప్లికేన్ పరిసరాల్లో తిష్ట వేశాయి. ఆ పరిసరాల్లోని లాడ్జీలు, విడిది, మ్యాన్షన్లలో రహస్యంగా తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో శ్రీలంక నుంచి వచ్చిన జాకీర్ హుస్సేన్ మన్నడిలోని ఓ లాడ్జీలో దిగినట్టుగా కేంద్ర నిఘా వర్గాలు సమాచారం చేరవేశాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ మంగళవారం రాత్రి ఏడున్నర సమయంలో ఆరంభం అయింది. అతడు ఉన్న లాడ్జీ, పరిసరాల్లో మఫ్టీ సిబ్బంది తిష్ట వేశారు. అయితే, అతడు ఎలా ఉంటాడో తెలియక తికమక పడ్డారు. చివరకు సాహసం చేసి ఆ లాడ్జిలో అతడి వివరాలను రాబట్టారు. అదే సమయంలో అతడు ఆ లాడ్జి నుంచి ఆటోలో బయలు దే రడాన్ని అక్కడి సిబ్బంది గుర్తించి, మఫ్టీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడిని ఆటోల్లో వెంబడించారు. ట్రిప్లికేన్‌లో ఆటో దిగగానే, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణ: రాత్రంతా అతడిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరిపారు. అతడి నుంచి చెన్నై, బెంగళూరు మ్యాప్‌లు, శాటిలైట్ ఫోన్లు, నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తాను శ్రీలంకలోని కండిగైకు చెందిన వ్యక్తినని, పాకిస్తాన్‌లోని కొందరు సహకారంతో, సూచనల మేరకు ఇక్కడికి వచ్చి వెళుతున్నట్లు తేలిందని సమాచారం. నెలలో మూడు సార్లు చొప్పున ఇక్కడికి అతడు పర్యాటక వీసా మీద వచ్చినట్టు తేలింది. జెమిని వంతెన, అమెరికా దౌత్య కార్యాలయం పరిసరాల్లో ఎక్కువగా తిరిగినట్టు, పేలుళ్లే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నట్లు అతడు పేర్కొనడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. నెలలో మూడు సార్లు ఇక్కడికి వచ్చి వెళుతున్న దృష్ట్యా, ఇక్కడి యువతను పాకిస్తాన్‌కు తరలించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతడి వెనకు అదృశ్య శక్తులు ఇక్కడ తిష్ట వేసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సముద్ర మార్గం గుండానే శ్రీలంక మీదుగా భారత్‌లోకి తీవ్రవాదులు చొరబడుతున్నట్లు జాకీర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోఎ ఆ మార్గాన తీవ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడ్డారా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ ఇంటిని సైతం అద్దెకు తీసుకునేందుకు జాకీర్ ఏర్పాట్లు చేసి ఉండటం బట్టి చూస్తే, అందరినీ ఒక చోట చేర్చి దాడులకు సిద్ధం చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతోన్నాయి. దీంతో విచారణను మరింత వేగవంతం చేయడానికి క్యూబ్రాంచ్ సిద్ధం అవుతోంది.
రిమాండ్ : జాకీర్ హుస్సేన్‌పై 120, 480 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉదయాన్నే ఎగ్మూర్ కోర్టు మేజిస్ట్రేట్ శివ సుబ్రమణ్యం ఎదుట హాజరు పరిచారు. అతడిని పదిహేను రోజుల రిమాండ్ నిమిత్తం పుళ ల్ జైలుకు తరలించారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న శాటిలైట్స్ ఫోన్లలో కోడ్ సంకేతాలను సూచిస్తూ, అనేక సమాచారాలు వచ్చి ఉండటం, మరి కొన్ని కోడ్ సమాచారాలను ఇక్కడి నుంచి జాకీర్ పంపించి ఉండటం వెలుగు చూసింది. ఆ కోడ్ భాష ఏమిటో పసిగట్టడంతోపాటుగా రాష్ట్రంలో మరెక్కడైనా పాకిస్తానీ ముష్కరులు తిష్ట వేసి ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరిపేందుకు క్యూబ్రాంచ్ కసరత్తుల్లో పడింది. తమ కస్టడీకి అతడ్ని తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అత్యంత రహస్యంగా ఆపరేషన్‌ను విజయవంతం చేసి, అన్ని వివరాలను, జాకీర్ హుస్సేన్ ఫొటోను సైతం గోప్యంగా క్యూ బ్రాంచ్ ఉంచడం గమనించాల్సిందే.