సీరియల్ రేపిస్టును వదిలేస్తే మళ్లీ...
దాదాపు రెండేళ్ల క్రితం జైలు నుంచి విడుదల చేసిన సీరియల్ రేపిస్టును బెంగళూరు పోలీసులు మళ్లీ పట్టుకున్నారు. ఎందుకంటే, అతగాడు మళ్లీ మరో ఇద్దరు మహిళల మీద అత్యాచారాలు చేశాడు! అతడిపేరు శివరామరెడ్డి. 2014లో తొలిసారిగా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అతడిని 2015లో వదిలేశారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని, వాళ్లపై అత్యాచారాలు చేసి దోచుకోవడం అతడి ప్రవృత్తి. బెంగళూరులో ఎక్కువగా ఉండే పేయింగ్ గెస్ట్ ఎకామడేషన్లను అతడు సులభంగా టార్గెట్ చేసుకుంటాడని బెంగళూరు తూర్పు మండల అదనపు పోలీసు కమిషనర్ హేమంత్ నింబాల్కర్ చెప్పారు.
తనను ఓ దుండగుడు కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని హాస్టల్లో ఉండే ఓ మహిళ గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత మరో హాస్టల్లో ఉండే మరో మహిళ తనపై కూడా ఇదే తరహాలో అత్యాచారం జరిగిందని, దోపిడీ కూడా జరిగిందని చెప్పారు. తొలి మహిళ నిందితుడి పోలికలు చెప్పారని.. దాంతో తమవద్ద ఉన్న ఫొటోను చూపించగా ఆమె వెంటనే గుర్తించారని నింబాల్కర్ తెలిపారు. 2014 ఆగస్టు నెలలో రెడ్డిని గూండా చట్టం కింద అరెస్టు చేసినా, కేవలం ఏడాది జైలుశిక్ష మాత్రమే పడిందని, దాంతో అతడిని విడుదల చేయగా.. మళ్లీ ఈ నేరాలు చేస్తున్నట్లు తేలడంతో ఇప్పుడు అరెస్టు చేశామని వివరించారు. పోలీసులు అతడిని పట్టుకోడానికి ప్రయత్నించగా, వాళ్లను కూడా కత్తితో గాయపరిచాడు. దాంతో అతడి కాళ్ల మీద కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.
నిందితుడు తెలుగు వాడే..
చిత్తూరు జిల్లాకు చెందిన శివరామరెడ్డి గత 15 ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నాడు. అతడికి తెలుగుతో పాటు కన్నడం, హిందీ, ఇంగ్లీషు భాషలు కూడా బాగా వచ్చు. ఇలాంటి సీరియల్ రేపిస్టును అంత సులభంగా ఎలా వదిలేశారని మహిళల హక్కుల సంఘాల వారు పోలీసుల మీద మండిపడుతున్నారు. పోలీసులు దాఖలుచేసిన చార్జిషీటు బలహీనంగా ఉండటం వల్లే అతడికి తక్కువ శిక్ష పడిందంటున్నారు. అతడిమీద ఇప్పటివరకు 16 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.