గోడు చెప్పుకుందాం
- జిల్లాకు విచ్చేసిన శివరామక్రిష్ణన్ కమిటీ
- నేడు రెవెన్యూ భవన్లో భేటీ
సాక్షి, అనంతపురం : అన్ని విధాలుగా వెనకబడిన జిల్లా అభివృద్ది చెందాలంటే అనంతపురంలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ను లేవనెత్తిన నాయకులు కదలి రావాల్సిన సమయం వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడుండాలో అధ్యయనం చేయడానికి నియమించిన శివరామక్రిష్ణన్‌కమిటీ సోమవారం రాత్రి జిల్లాకు చేరుకుంది. పనిలో పనిగా కేంద్ర, రాష్ట్ర సంస్థల ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కమిటీ జిల్లాలోకి ప్రవేశించగానే గుత్తిలో ప్రభుత్వ అధికారులతో జిల్లా సమాచారాన్ని సేకరించారు. జిల్లా ప్రాముఖ్యత, చారిత్రాత్మక విషయాలు, గుత్తి కోట ప్రాముఖ్యత గురించి అధికారులు కమిటీ సభ్యులకుక్షుణ్ణంగా వివరించారు. రాత్రి 9గంటలకు అనంతపురం చేరుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కమిటీ జిల్లావాసులతో భేటీ కానుంది.
తొలుత అధికారులతో జిల్లా స్థితిగతులపై సమీక్షిస్తారు. అనంతరం 11 గంటలకుప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాలు, జిల్లా ప్రజల వినతులు స్వీరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రాతికేయుల సమావేశంలో మాట్లాడనున్నారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై గత వారం ఎస్కేయూలో మేధావుల సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొన్న వారితో పాటు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతి నిధులు, ప్రతిపక్ష నేతలు కమిటీ ఎదుట హాజరై డిమాండ్లను విన్నవించుకోనున్నారు.