ఆశ్రమంలో హంతకుడు
► బంధువులపై ద్వేషంతో భక్తురాలి కుమారుడి ప్రాణాలు తీసిన వైనం
► మూలెగెద్ద సదానంద
► శివయోగాశ్రమ మఠంలో ఘటన
శివమొగ్గ : ఓ వ్యక్తి తన సమీప బంధువులపై ద్వేషాన్ని పెంచుకొని ఉన్మాదిగా మారి బాలుడి ప్రాణాలు బలిగొన్నాడు. మఠానికి వచ్చిన భక్తురాలి పక్కన నిద్రిస్తున్న ఆమె మూడేళ్ల కుమారుడిని ఎత్తుకెళ్లి ఊపిరి ఆడకుండా చేసి హత మార్చాడు. ఈ ఘటన హోసనగర తాలూకా, మారుతీపుర గ్రామ పంచాయతీ పరిధిలోని మూలెగెద్ద సదానంద శివయోగాశ్రమంలో చోటు చేసుకుంది. వివరాలు.. పూణెలోని గంధర్వనగరలో నివాసం ఉంటూ అక్కడి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కుమారస్వామి, చెత్ర దంపతుల బంధువులకు, హోసనగర తాలూకా, మారుతీపుర గ్రామ పంచాయతీ పరిధిలోని మూలెగెద్ద సదానంద శివయోగాశ్రమ మఠంలో పరిచారికుడిగా పనిచేస్తున్న రుద్రేష్కు మధ్య విభేదాలున్నాయి.
సదానంద శివమోగాశ్రమం మఠంలో జరుగనున్న చిన్న స్వామిజీ పట్టాభిషేక మహోత్సవాల్లో పాల్గొనేందుకు వారం రోజుల క్రితం చైత్ర తన మూడేళ్ల కుమారుడు సుహాయ్తో కలిసి వచ్చింది. చైత్ర బంధువులపై కక్ష పెంచుకున్న రుద్రేష్ ఇదే అదునుగా హత్యకు పథకం పన్నాడు. సోమవారం రాత్రి నిద్రమాత్రలు కలిపిన సాంబర్ అన్నాన్ని రుద్రేష్ వడ్డించాడు. అది తిన్న చైత్ర, ఆమె కుమారుడు, మరికొందరు భక్తులు గాఢ నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తల్లి పక్కన ఉన్న బాలుడిని రుద్రేష్ ఎత్తుకెళ్లి మఠం వెనుకకు చేరుకొని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులోకి విసిరేశాడు. మంగళవారం ఉదయం చిన్నారి కనిపించకపోవడం, చైత్రతోపాటు నలుగురు భక్తులు అస్వస్థతకు గురవ్వడంతో ఆశ్రమంలో కలకలం చోటు చేసుకుంది.
సీఐ మంజునాథ్గౌడ ఆశ్రమానికి చేరుకొని జరిగిన ఘటనపై ఆరా తీశారు.అస్వస్థులకు గురైన వారిని ఆస్పత్రికి తరలించి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అనుమానంతో రుద్రేష్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా చిన్నారి సుహాయ్ను ఊపిరాడకుండా చేసి హత్య చేసి శవాన్ని చెరువులో వేసినట్లు అంగీకరించాడు. దీంతో చెరువులో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా నిద్రమాత్రల ప్రభావంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చైత్ర ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. కుమారుడు చనిపోయిన విషయం తెలియక అమయాకంగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది.