త్వరితగతిన ఎత్తినహొళె
నిర్మాణ అంచనా రూ.12,912 కోట్లు : సీఎం
ఏడు జిలాల్లో తీరనున్న తాగునీటి సమస్య
1500 అడుగుల లోతుకు పడిపోయిన భూగర్భజలాలు
‘పరమ శివయ్య’ నివేదికనూ అమలు చేస్తాం
పడమటి కనుమల నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రం పాలు
ఎత్తినహొళె ద్వారా కేవలం 24 టీఎంసీలు మాత్రమే త రలింపు
చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : ఎత్తినహొళె పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసి కోలారు, చిక్కబళ్లాపురం, రామనగర, బెంగళూరు గ్రామీణ జిల్లాలతో పాటు హాసన, తుమకూరు, చిక్కమగళూరు జిల్లాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. నగరంలోని బీజీఎస్ పాఠశాల ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఎత్తినహొళెకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈ ప్రాంతంలో భూగర్భజలాలు 1200 అడుగుల నుంచి 1500 అడుగుల లోతుకు పడిపోయాయని తెలిపారు.
నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్నందున ఎత్తినహొళె పథకం ద్వారా 15 టీఎంసీల తాగు నీటిని, చెరువులను నింపేందుకు మరో తొమ్మిది టీఎంసీల నీటిని తరలిస్తామని వెల్లడించారు. కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల్లోని చెరువులను నింపి భూగర్భ జలాలు వృద్ధికి ప్రయత్నిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పరమ శివయ్య కమిటీ సమర్పించిన నివేదికను కూడా అమలు చేస్తామని ప్రకటించారు. ఎత్తినహొళె ద్వారా కేవలం 24.01 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగిస్తామని, అదీ కేవలం వరా ్షకాలంలో మాత్రమేనని తెలిపారు.
పడమటి కనుమల నుంచి సుమారు మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని, అందులో కేవలం 24 టీఎంసీలను మాత్రమే ఈ ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లా ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ మాట్లాడుతూ ఇది నేత్రావతి మళ్లింపు పథకం కాదని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయం లేదని, తాను గత అయిదు సంవత్సరాల నుంచి ఎత్తినహొళె పథకం గురించి అధ్యయనం చేశానని తెలిపారు.
రెండేళ్లలో పథకాన్ని పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. జల వనరుల శాఖ మంత్రి ఎంబీ.పాటిల్ మాట్లాడుతూ ఈ పథకానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. రూ.12,912.36 అంచనా వ్యయంతో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆది చుంచనగిరి మఠాధిపతి నిర్మలానంద స్వామీజీ మాట్లాడుతూ ఈ పథకం పూర్తయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇదే స్థలంలో ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, కృష్ణ బైరేగౌడ, టీబీ. జయచంద్ర, రోషన్‌బేగ్, శాసన సభ డిప్యూటీ స్పీకర్ శివశంకర రెడ్డి, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, కేహెచ్. మునియప్ప, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధాకర్, రమేశ్ కుమార్, సుబ్బారెడ్డి, జేకే. కృష్ణారెడ్డి, రాజన్న, కలెక్టర్ ఆర్. విశాల్ పాల్గొన్నారు.