కోర్టులో మహ్మద్ కైఫ్ లొంగుబాటు
శివాన్: బిహార్ పోలీసులు వెతుకుతోన్న షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ బుధవారం శివాన్ కోర్టులో లొంగిపోయాడు. అతడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జర్నలిస్టు రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో అతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్పై విడుదలైనపుడు ఆయన పక్కన కైఫ్ కనిపించడంతో బిహార్ రాజకీయాల్లో దుమారం రేపింది. కైఫ్ వ్యవహారం జేడీ(యూ)-ఆర్జేడీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
కాగా, తనకు కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించారని అంతకుముందు కైఫ్ ఆరోపించాడు. రాజకీయ కుట్రతో తనపై బురద చల్లుతున్నారని వాపోయాడు.‘నేను నేరస్తుడిని కాదని శివాన్ ప్రజలు, జర్నలిస్టులకు తెలుసు. రాజ్దేవ్ రంజన్ తో నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. నా పెళ్లికి కూడా అతడు వచ్చాడ’ని కైఫ్ వెల్లడించాడు. మహ్మద్ షాబుద్దీన్ ఎందుకు కనిపించావని ప్రశ్నించగా... ’మద్దతుదారుగా వెళ్లాను. అక్కడకు వెళ్లే ముందు మా న్యాయవాది సలహా కూడా తీసుకున్నాన’ని తెలిపాడు.