ఆరు అంశాలపై శ్వేతపత్రాలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఆరు శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గతంలో రూపొందించిన విజన్ 2020 డాక్యుమెంట్ మాదిరి గానే మరో డాక్యుమెంట్‌ను రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన తన నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ అనుబంధ రం గాలు, విద్యుత్ రంగం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఆయా రంగాల్లో గత పదేళ్లలో జరిగిన అవినీతిని కూడా వివరిస్తామని చెప్పారు.
విభజన వల్ల తలెత్తిన సమస్యలపై ప్రత్యేకంగా శ్వేతపత్రం విడుదల చేస్తామని, ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని, అవి ముగిసిన వెంటనే ఆయా పత్రాలను విడుదల చేసి ప్రజల్లో, అసెంబ్లీలో వాటిపై చర్చిస్తామన్నారు.
ప్రజలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖుల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా తమ పరిపాలన సాగుతందని బాబు తెలిపారు. అభివృద్ధితోపాటు పాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు.
గతంలో విజన్ డాక్యుమెంట్‌ను అందరూ ఎగతాళి చేశారని, చివరకు దాన్నే జాతీయ స్థాయిలో కూడా అనుసరించారని అన్నారు. తమ విజన్ డాక్యుమెంట్లో రానున్న 3 ఆర్థిక సంఘాల నుంచి నిధులు రాబట్టేందుకు ఏయే అంశాలను ప్రతిపాదించాలో పొందుపరుస్తామన్నారు.
రాష్ర్టంలో పారదర్శకత లేకుండా పోయిం దని, వ్యవస్థలను నాశనం చేశారని ఈ నేపథ్యంలో పరిపాలనను గాడిలో పెట్టేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో తాము కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయంగా సాయం చేయాలని కోరుతున్నామన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కావాలని, వాటిని సాధించేందుకు మార్గాలు వెతుకుతామన్నారు. టైటానియం కేటాయింపు తదితర అంశాలపై సమీక్షించి తగిన చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం వచ్చే వరకూ తాను హైదరాబాద్‌లో ఉంటానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందిస్తామన్నారు.