Six members arrested
-
గుప్త నిధుల కోసం తవ్వుతున్న ఆరుగురి రిమాండ్
యాచారం: రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనే ఆశ వారిని జైలు పాల్జేసింది. వ్యవసాయ భూమిలో 10 కిలోల బంగారం ఉందని నమ్మి తవ్వకాలు జరుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి యాచారం పీఏస్‌లో బుధవారం వెల్లడించిన వివరాలు... మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన గ్యారల వెంకటయ్య, గ్యారల బాలయ్య వ్యవసాయ పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. బాలయ్య అల్లుడైన మాడ్గుల్ మండలం అవుర్‌పల్లికి చెందిన యాదగిరి వ్యవసాయ పొలంలో బంగారు నిధులు ఉన్నాయని కొందరు పురోహితులు చెప్పారు. వారి మాటలు నమ్మిన నల్లవెల్లి గ్రామానికి చెందిన బాలయ్య, వెంకటయ్య, మహేష్, నగరానికి చెందిన చతుర్వేది, రాంరెడ్డి, సురేందర్‌తో పాటు మరో ముగ్గురితో కలిసి సోమవారం రాత్రి బాలయ్య, వెంకటయ్యల వ్యవసాయ పొలంలో తవ్వకాలు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి చతుర్వేది, రాంరెడ్డి, సురేందర్, వెంకటేష్‌లను అదే రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి బాలయ్య, మహేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచచి 4 మోటార్సైకిల్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన 6 మందిని బుధవారం రిమాండ్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేక టీంలుగా ఏర్పడుతున్న కొందరు పూరాతన దేవాలయాలు, పాత భవనాలు లక్ష్యంగా చేసుకుని తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో యాచారం సీఐ చంద్రకుమార్, ఎస్సై వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాములు హత్యకేసులో ఆరుగురు నిందితుల రిమాండ్
నల్లగొండ లీగల్, న్యూస్‌లైన్ :టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొనపురి రాములు హత్య కేసులో ఆరుగురు నిందితులను మంగళవారం జిల్లాకోర్టులో రిమాండ్ చేశారు. నిందితుల్లో ఏ3గా సురేష్, ఏ12గా కుమారస్వామి, ఏ13గా ఉమేష్, ఏ14గా యల్లేష్, ఏ15గా రవి, ఏ16గా సోమయ్య ఉన్నారు. వీరిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకోగా నల్లగొండ టుటౌన్ పోలీసులు పీటీ వారెంట్‌పై ఇక్కడికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం రైలులో భారీ బందోబస్తు నడము తీసుకువచ్చి కోర్టులో హాజరుపర్చారు. వెంటనే పోలీసులు ఆ నిందితులను విచారిం చేందుకు తమకు అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన మేజిస్ట్రేట్ (మద్య నిషేధ న్యాయస్థాన న్యాయమూర్తి) సత్యనారాయణ షరతులతో అంగీకరించారు. నిందితులను విచారించే ముందు వారితో వారి న్యాయవాదిని, డాక్టర్‌ను వెంట ఉంచాలని, విచారణ పగటి వేళనే జరపాలనే షరతులు విధించారు. ఈ పిటిషన్‌పై సదరు నిందితులను 10రోజులపాటు పోలీసులు తమ అధీనంలో ఉంచుకుని విచారణ పూర్తిచేసి తిరిగి కోర్టుకు అప్పగించాలని తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖిల వాదించారు. సదరు ముద్దాయిలపై సెక్షన్ 147, 148, 332, 115, 157, 158, 302, 120(బి) రెడ్‌విత్ 149 ఐపీసీ, 25,27 ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద నేరం మోపి రిమాండ్‌కు పంపారు.