అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి
గంగావతి : అమ్మాయిది జపాన్... అబ్బాయిది కర్ణాటక.. మూడేళ్ల ప్రేమ బంధం చివరికి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. జపాన్ దేశానికి చెందిన యువతితో తాలూకాలోని ఆనెగొందికి చెందిన యువకునికి హిందూ సాంప్రదాయం ప్రకారం మల్లాపురం గ్రామ సమీపంలోని వానభద్రేశ్వర దేవస్థానంలో సోమవారం ఉదయం 11 గంటల శుభలగ్నంలో ఘనంగా వివాహం జరిగింది. జపాన్ దేశానికి చెందిన సియాకి జెపాలో కొజియాకు ఆనెగొందికి చెందిన హకీం వెంకటరాముడు బంధుమిత్రులు, పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సియాకి జెపాలో కొజియా గత ఐదేళ్లుగా భారతదేశానికి విచ్చేస్తూ తాలూకాలోని హనుమనహళ్లి సమీపంలో ఉన్న వెంకటరాముడి రెస్టారెంట్లో ఆరు నెలల పాటు బస చేసి తిరిగి జపాన్ వెళ్లేది. వెంకటరాముడు తన రెస్టారెంట్లో ఇచ్చిన ఆతిథ్యం, మంచిగా చూసుకుంటున్న సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది.
మూడేళ్లుగా మొదలైన వీరి ప్రేమ ప్రయాణం చివరకు వివాహ బంధంగా మారింది. ఆరు నెలల క్రితం వీరు రిజిస్టర్ వివాహం చేసుకోగా, సోమవారం తిరిగి వానభద్రేశ్వరాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వెంకటరాముడు తల్లిదండ్రులు, బంధువుల అంగీకారంతోనే వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆనెగొంది గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు టీజీ బాబు, సయ్యద్ నజీర్, అలివేలు రుద్రయ్య, వరుని తల్లి అనసూయమ్మ, తండ్రి రామస్వామి పాల్గొన్నారు.