స్కోచ్ అవార్డుకు కేసీఆర్ కిట్
2017కు నామినేట్ అయిన పథకం
సాక్షి, హైదరాబాద్: సర్కారీ దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం తాజాగా స్కోచ్ అవార్డు–2017కు నామినేట్ అయ్యింది. పేదల కోసం ప్రభుత్వం చొరవ తీసుకుని అమలు చేసే కార్యక్రమాల విభాగంలో ఈ పథకం నామినేట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన వారికి రూ.12 వేలు.. ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి(రూ.13 వేలు) అందిస్తోంది.
4 దశలుగా ఈ సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. కాన్పు జరిగిన వెంటనే శిశువు సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్‌ను అందిస్తున్నారు. వైద్య శాఖ ఆగస్టు 21 వరకు 57,627 కిట్లను పంపిణీ చేసింది. జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో 15,839 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. జూలైలో ఈ సంఖ్య 34,963కు పెరిగింది. 1997 నుంచి గుర్గావ్ కేంద్రంగా స్కోచ్ పనిచేస్తోంది. సామాజిక, ఆర్థిక అంశాలు, సమ్మిళిత వృద్ధి తదితర అంశాలపై ఈ సంస్థ అధ్యయనం చేస్తుంది.