ఇది తెలుగుజాతి కథ
మనసుకు నచ్చిన పని చేయాలంటే, మనీ లెక్కలేసుకుంటే కుదరదు. సినిమా అంటే ప్రాణం పెట్టే దర్శకుడు గుణశేఖర్ మొదటి నుంచీ నమ్మేదీ, ఆచరించేదీ అదే. పిల్లలతో ‘రామాయణం’ దగ్గర నుంచి మహేశ్ ‘ఒక్కడు’, ‘అర్జున్’ దాకా ఆయన తీసిన సినిమాలన్నీ అలాంటివే. నచ్చిన సబ్జెక్ట్‌ను నలుగురికీ నచ్చేలా చెప్పడానికి పదేపదే సాహసించే ఈ సృజనశీలి దాదాపు మూడేళ్ళుగా చేస్తున్న ప్రతిష్ఠాత్మక వెండితెర ప్రయత్నం - ‘రుద్రమదేవి’. చిన్నప్పుడు స్కూల్లో నాన్డీటైల్డ్గా చదివిన కాకతీయ సామ్రాజ్యపు వీరనారి రుద్రమదేవి కథనూ, తెలుగువారి గొప్పతనాన్నీ ప్రపంచమంతటికీ తెలియజెప్పేందుకు ఆయనే నిర్మాతగా కూడా మారారు.
రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడిగా రానా - ఇలా కీలకమైన చారిత్రక పాత్రలన్నీ ఈ సినిమాతో మన కళ్ళ ముందుకు రానున్నాయి. పైగా ‘‘చారిత్రక కథాంశంతో వస్తున్న తొలి స్టీరియో స్కోపిక్ 3డీ ఫిల్మ్’’ ఇదే. ఇళయరాజా (సంగీతం), తోట తరణి (కళ), నీతా లుల్లా (‘జోథా అక్బర్’ ఫేమ్ కాస్ట్యూమ్ డిజైనర్) లాంటి ప్రసిద్ధ టెక్నీషియన్ల పనితనంతో ఈ సినిమా అన్ని హంగులూ పూర్తి చేసుకొంది. విజువల్ ఎఫెక్ట్స్‌లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ‘‘ప్రస్తుతం అవన్నీ కూడా పూర్తి కావచ్చాయి. నాలుగైదు రోజుల్లో ఒక స్పష్టత రాగానే, రిలీజ్ ప్రణాళిక ప్రకటిస్తాం’’ అని గుణశేఖర్ ‘సాక్షి’కి చెప్పారు.
ఒకపక్క 3డీ వెర్షన్‌తో పాటు, 3డీ కళ్ళద్దాలతో అవసరం లేకుండానే 3డీ ఎఫెక్ట్‌లో సినిమా చూసేలా మరో వెర్షన్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. అందుకోసం కొత్త టెక్నాలజీతో ప్రతి ఫ్రేమ్నూ విదేశీ నిపుణుల సాయంతో సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమలోని ప్రముఖులందరూ నటించగా, తెలుగులో చాలాకాలం తరువాత వస్తున్న భారీ చారిత్రక కథా చిత్రం ఇదే. గుణశేఖర్ సాహసానికీ, సినిమాపై ప్రేమకూ తాజా నిదర్శనమైన ఈ ‘రుద్రమదేవి’ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీలోనూ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అధికారికంగా మరిన్ని వివరాలకు ఇంకొద్ది రోజులు ఆగాలి.