ఆత్మహత్యల్లో భారత్‌దే అగ్రస్థానం
సాక్షి, బెంగళూరు : ఆత్మహత్యల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉందని సమాధాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఎస్.కృష్ణస్వామి వెల్లడించారు. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... జీవితంపై సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యల వైపు వెళుతుండడంతో దేశంతో పాటు రాష్ట్రంలోనూ బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాక విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చదువులో వెనకబడుతున్నామనే కారణంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే బలవన్మరణాల నిరోధానికి నగరంలో ర్యాలీని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈనెల 7న నగరంలోని కేఎల్ఈ కళాశాల నుండి 5 కిలోమీటర్ల మేర ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాక ఈనెల 10న ‘అంతర్జాతీయ ఆత్మహత్యా నివారణ దినోత్సవాన్ని’ సైతం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లోని పిల్లలకు జీవితం విలువను తెలియజేసేలా కౌన్సిలింగ్‌ను సైతం తమ సంస్థ అందించనుందని వెల్లడించారు.