మితంగా...పర్యావరణ హితంగా..!
పర్యావరణస్పృహతో ఈసారి మీరు కూడా మీ ఇంటికి పర్యావరణ హిత దీపావళిని ఆహ్వానిం చండి. పండగ సంతోషాన్ని రెట్టింపు చేసుకోండి.
మీ ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే, ఆ పెద్దవాళ్ల కంటే పెద్దవాళ్లు ఉంటే... ఒక్కసారి అడిగి చూడండి - ‘‘ఆ రోజుల్లో దీపావళి ఎలా జరిగేది?’’ అని. వాళ్లు కథలు కథలుగా ఆ రోజుల గురించి చెబుతారు. వాటిలో మీకు పొరపాటున కూడా కాలుష్య భూతం కనిపించదు. కాలంతో పాటు దీపావళికి కాల్చే బాణాసంచాలో మార్పు వచ్చింది. ఎంత ఎక్కువగా కాలిస్తే అంత కన్నుల పండగగా జరుపుకున్నట్లు, ఎంత శబ్దం వస్తే అంత గొప్పగా జరుపుకున్నట్లు... అనుకునే రోజులు వచ్చాయి.
ఈ ధోరణిలో మార్పు రావాలి. ఆ మార్పు కోసమే కృషి చేస్తూ కాలుష్యరహిత దీపావళిపై స్పృహ కలిగించడానికి హైదరాబాద్ యువతలో కొందరు ‘స్కై లాంతర్స్ ఛాలెంజ్’ పేరుతో వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. రద్దీ ప్రదేశాల్లో అకస్మాత్తుగా, ఆసక్తికరంగా నృత్యాలు చేస్తూ ‘ఫ్లాష్ మాబ్’, ‘స్ట్రీట్ ప్లే’ మొదలైన వాటితో పర్యావరణ హిత దీపావళి గురించి ఆసక్తి కలిగిస్తున్నారు. ఆకాశదీపాల (స్కై లాంతర్లు) ద్వారా దీపావళి అంటే ‘శబ్దం’ కాదని ‘వెలుగు’ అనే సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రతి వ్యక్తీ మరో ముగ్గురిని భాగస్వామ్యం చేసేలా కృషి చేస్తున్నారు.
పర్యావరణ హిత దీపావళి గురించి గత నాలుగేళ్ళుగా ప్రచారం చేస్తున్న పర్యావరణ ప్రేమికుడు అరుణ్ కృష్ణమూర్తి ‘‘కాస్త ఆలస్యంగానైనా తగిన ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను’’ అంటున్నారు. ‘‘గతంలో మేము ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్పందన పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం బాణాసంచా వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. తమ పరిసరాల్లో ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వాల్సిందిగా అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. ఇదొక మంచి పరిణామం’’ అంటున్నారు అరుణ్. కాగా, పర్యావరణహిత ‘గ్రీన్-దీపావళి’ గురించి ప్రచారానికి సుదీర్ఘమైన ఉపన్యాసాల మీద ఆధారపడకుండా వినోదాన్నే ఆశ్రయి స్తున్నారు.
ప్రాచుర్యం పొందిన సినిమా పాటల బాణీలతో భూగర్భ జల కాలుష్యం, శబ్ద కాలుష్యం... మొదలైన సమస్యలపై పాటలు అల్లి ప్రచారం చేస్తున్నారు. అయితే ‘బాణాసంచా కాల్చొద్దు అనడం హిందూ సంస్కృతికి వ్యతిరేక’మంటూ కొందరి నుంచి అభ్యంతరాలు వినవచ్చాయి. దీపావళి అంటే శబ్దాడంబరం కాదని... దీపాల వరుస అని, కాలుష్య కారకమైన బాణాసంచా కాల్చడం అనేది దీపావళి సంప్రదాయంలో ఎప్పుడూ లేదని, గత నాలుగు దశాబ్దాల నుంచే కాలుష్యాన్ని పంచే బాణాసంచా సంప్రదాయం పెరిగిందని... పై అభ్యంతరానికి సమాధానం ఇచ్చారు గ్రీన్-దీపావళి ప్రేమికులు.
వీటి కోసమేనా మనం బాణాసంచా కాల్చేది!?
శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
భూగర్భ జలాలు కలుషితమవుతాయి
వాయు కాలుష్యం పెరుగుతుంది. ముక్కు, గొంతు, కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి
రకరకాల చర్మరోగాలకు కారణం అవుతాయి.