దళితులపై దాడులను అరికట్టాలి
గజ్వేల్‌రూరల్: గోరక్షణ పేరుతో ఆర్ఎస్ఎస్ మతోన్మాద దాడులకు పాల్పడుతుందని, బీజేపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని కేవీపీఎస్(కుల వివక్ష పోరాట సమితి) రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు పేర్కొన్నారు. ఆగస్టు 23న సంగారెడ్డిలో ప్రారంభమై సెప్టెంబర్ 11 వ తేదీ వరకు రాష్ట్రంలోని 10 జిల్లాల మీదుగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘ఆత్మగౌరవ ఉద్యమ యాత్ర’ బస్సుయాత్ర బుధవారం కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు చేరుకుంది.
ఈ సందర్భంగా పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభలో స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ గోరక్షణ ముసుగులో ఆర్ఎస్ఎస్ దళితులపై మతోన్మాద దాడులకు పాల్పడుతుందని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళిత కుటుంబాలకు 3ఎకరాల భూమి, డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే అందించాలని, సబ్‌ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం, డివిజన్ అధ్యక్షులు ఆర్. శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి మరాటి కృష్ణమూర్తి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జంగం నాగరాజు, ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు అరవింద్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఏగొండస్వామి, టీఎంఆర్పీఎస్ నాయకులు పొన్నాల కుమార్, మాల మహానాడు నాయకులు తుమ్మ శ్రీను, అంబేద్కర్ సంఘం నాయకులు పొన్నాల శ్రీనివాస్, వర్గల్ మండల ఎమ్మార్పీఎస్ నాయకులు యాదగిరి, ఎస్ఎఫ్ఐ నాయకులు అశ్రఫ్, సాయి, వెంకటేష్, అతీఫ్, అనిల్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.