రాబర్ట్ వాద్రాకు అనుమతుల్లో అక్రమాలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కష్టాలు తప్పేలా లేవు. గుర్గావ్లో ఆయనకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ గ్రూపునకు అనుమతులు ఇవ్వడంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లుగా జస్టిస్ (రిటైర్డ్) ఎస్ఎన్ ఢింగ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నిగ్గుతేల్చినట్లు తెలిసింది. గుర్గావ్లోని నాలుగు గ్రామాల్లో భూముల వినియోగ మార్పిడి విషయంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు ఈ కమిషన్ను నియమించారు.
రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ గ్రూపు కూడా ఈ భూమి వినియోగ మార్పిడి వల్ల లబ్ధి పొందింది. ఆ గ్రూపునకు అనుమతులు మంజూరుచేయడంలో సైతం అక్రమాలు జరిగినట్లు ఢింగ్రా కమిషన్ నిర్ధారించిందని సమాచారం. ఈ ప్రాంతంలో పెద్ద మనుషులకు భూవినియోగ మార్పిడి అనుమతులు ఇవ్వడం వల్ల ఆ తర్వాత ఇక్కడి భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని ఢింగ్రా కమిషన్ గుర్తించింది.