చంటిబిడ్డ తల్లి ముసుగులో ఎర్రచందనం రవాణా
ఐదుగురు దొంగల అరెస్టు
8 ఎర్రచందనం దుంగల స్వాధీనం
పెనుమూరు(చిత్తూరు జిల్లా): ఎర్రచందనం స్లగ్లర్లు రూటు మార్చారు. ఫ్యామిలీ టూరు, చంటిబిడ్డ తల్లితో ప్రయాణం సాగిస్తున్నట్టు చూపుతూ ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పెనుమూరులో గురువారం తెల్లవారుజామున చంటిబిడ్డ తల్లి ముసుగులో తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు. పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసరావు కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కంబతూకి గ్రామానికి చెందిన రామస్వామి కుమారులు ఆర్.అన్నామలై(40), ఆర్.గణేష్(30), కుంభపాడికి చెందిన వి.సుబ్రమణ్యం(29), ధర్మపురి జిల్లా ముత్తువాలూరుకు చెందిన ఆర్.గోపాలస్వామి(26), అతని భార్య జి.మంగమ్మ (23), కుమార్తె సగి(2) కలిసి ఎనిమిది ఎర్రచందనం దుంగలను తీసుకుని ఇండికారులో గురువారం తెల్లవారుజామున శేషాచల అడవుల నుంచి తమిళనాడుకు బయలు దేరారు.
పెనుమూరు చెక్‌పోస్టు వద్ద ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో అతివేగంగా వస్తున్న ఇండికా కారును ఆపారు. డ్రైవర్ పక్క సీటులో చిన్నబిడ్డను పెట్టుకొని మహిళ కూర్చొని ఉండడంతో పోలీసు సిబ్బంది కారును పంపే ప్రయత్నం చేశారు. ఎస్ఐ శ్రీనివాసరావుకు అనుమానం రావడంతో కారును ఆపి తనిఖీ చేయడంతో ఎర్రచందనం దుంగలు బయట పడ్డాయి. కారుతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆర్.అన్నామలై, ఆర్.గణేష్, వి.సుబ్రమణ్యం,ఆర్.గోపాలస్వామి, అతని భార్య జి.మంగమ్మను అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు.