రాష్ట్రంలో నియంత పాలన: వైఎస్సార్సీపీ
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియంత పాలన కొనసాగిస్తున్నాడని వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు.
గరివిడిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సాక్షి చానల్ వాస్తవాలను తెలియజేస్తున్నందువల్లే టీడీపీ నాయకులు ఎంఎస్ఓలపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రసారాలు నిలిపివేశారన్నారు. చానల్ ప్రసారాలు నిలిపివేసినంత మాత్రాన ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ప్రజలకు తెలియవనుకోవడం అవివేకమని తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు పనితీరుపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, ఆయన అనుచరులకు వంత పాడే చానళ్లు, పత్రికలకు లబ్ధి చేకూరడం కోసమే సాక్షిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పత్రికలు, టీవీ చానళ్లపై వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధింపులు చేపట్టడం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని కోరారు.
విస్తృతస్థాయి సమావేశం
విజయవాడలో వైఎస్సార్సీపీ విస్తృస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ కొనిసి కృష్ణంనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, పొన్నాడ వెంకటరమణ, ముల్లు రాంబాబు, తాటిగూడ పీఏసీఎస్ అధ్యక్షుడు యడ్ల అప్పారావు, వలిరెడ్డి లక్ష్మణ, ఎలకల అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.