‘స్కూల్ గేమ్స్‌లో టెన్నికాయిట్ను చేర్చాలి’
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ స్కూల్ గేమ్స్ క్రీడాంశాల జాబితాలో టెన్నికాయిట్ క్రీడను చేర్చాలని భారత టెన్నికాయిట్ సమాఖ్య (ఐటీఎఫ్) కోరింది. దేశ, విదేశాల్లో గ్రామీణ క్రీడగా పేరు పొందిన టెన్నికాయిట్ క్రీడ ప్రస్తుతం అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి గేమ్‌గా ఎదిగిందని ఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్.లక్ష్మీకాంత్ తెలిపారు. భారత్, జర్మనీ, దక్షిణాఫ్రికా దేశాల్లో మూడు టెన్నికాయిట్ వరల్డ్‌కప్ పోటీలను సమర్థంగా నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
శ్రీనగర్‌లో జరగనున్న జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) కార్యవర్గ సమావేశంలో టెన్నికాయిట్ క్రీడను అండర్-14, 17, 19 బాలబాలికల విభాగాల్లో చేర్చాలని కోరుతూ సమాఖ్య కార్యదర్శి డాక్టర్ రాజేష్ మిశ్రాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. జాతీయ స్కూల్ గేమ్స్‌లో టెన్నికాయిట్ అండర్-19 బాలబాలికల పోటీలను 2012, 2013 సంవత్సరాల్లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నిర్వహించారని ఆయన చెప్పారు. దేశంలో 27 రాష్ట్రాల్లో టెన్నికాయిట్ సంఘాలున్నాయని ఆయన తెలిపారు. టెన్నికాయిట్ క్రీడకు భారత ఒలింపిక్ అసోసియేషన్, కేంద్ర క్రీడాశాఖ గుర్తింపు ఉందని ఆయన చెప్పారు. దీంతో ఎస్జీఎఫ్ఐలో టెన్నికాయిట్ను చేర్చాలని లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు.