జ్ఞానం కోసం జపించాలి
శ్లోకనీతి
పోతన రచించిన భాగవతంలోని కొన్ని పద్యాలనైనా నేర్చుకోవడం తెలుగువారి కనీస కర్తవ్యం. పద్యాలను కేవలం కంఠోపాఠంగా కాకుండా, మనసుకి అర్థం చేసుకుని, అందులోని అంతరార్థాన్ని గ్రహించి అప్పుడు ఆ పద్యం నేర్చుకుంటే, అది చిరకాలం మన మదిలో పదిలంగా నిలిచిపోతుంది.
పద్యం-2
క్షోణి తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరైణె క వాణికిన్
వాణికి నక్షదామ శుకవారిజ పుస్తక రమ్య పాణికిన్
వ్యాఖ్యాన భావం... సరస్వతీదేవి అవిశ్రాంతంగా... సుకుమారములైన తన నాలుగు చేతులలో క్రమంగా జపమాల, చిలుక, పద్మం, పుస్తకం ధరించి దర్శనమిస్తుంది. సరస్వతీదేవి చదువుల తల్లి. అందువల్లే చదువుకు, విజ్ఞానానికి ప్రతీకగా తన హస్తాలలోని జపమాల ద్వారా... నిరంతరం జ్ఞానాన్ని సముపార్జిస్తూ, మృదువాక్కులు జపిస్తూ ఉండాలని చూపుతోంది. ఇక చిలుక... గురువులు చెప్పిన విద్యను చిలుక వలె పలకాలని అంటే తీయగా, మృదుమధురంగా పలకాలని సూచిస్తోంది, పద్మం వలె వికసిత వదనాలతో స్వచ్ఛమైన హృదయంతో పుస్తకాన్ని చేతబూని జ్ఞానాన్ని సముపార్జించినప్పుడు వారు సరస్వతీదేవిలాగే జ్ఞాన సంపన్నులవుతారని అమ్మవారి అలంకారాలు బోధిస్తున్నాయి.
మంచికి మారుపేరయిన దేవతలను రక్షించటం ద్వారా, ఎంతటివారైనా మంచికి అన్యాయం జరుగుతుంటే తప్పక వారిని రక్షించాలని తెలుపుతోంది. తన ఇంపైన మృదుమధుర వచనాల ద్వారా... సత్యాన్నే పలకమని సూచిస్తోన్న సరస్వతీమాతకు సాష్టాంగపడి నమస్కరిస్తున్నాను అన్నాడు పోతన ఈ పద్యంలో.
- డా. పురాణపండ వైజయంతి