సత్ప్రవర్తనకు సాక్షి... గణపతి
శ్లోకనీతి
పోతన రచించిన భాగవతంలోని కొన్ని పద్యాలనైనా నేర్చుకోవడం తెలుగువారి కనీస కర్తవ్యం. పద్యాలను కేవలం కంఠోపాఠంగా కాకుండా, మనసుకి అర్థం చేసుకుని, అందులోని అంతరార్థాన్ని గ్రహించి అప్పుడు ఆ పద్యం నేర్చుకుంటే, అది చిరకాలం మన మదిలో పదిలంగా నిలిచిపోతుంది.
పద్యం-1
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం
పాదికి దోషభేదికి బ్రపన్న వినోదికి విఘ్నవల్లి కా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్
మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్
వ్యాఖ్యాన భావం... శ్రీమద్భాగవత ఇష్టదేవతా ప్రార్థనలో బమ్మెర పోతన వినాయకుడిని స్తుతిస్తూ...
పర్వతరాజ కుమార్తె అయిన తన తల్లి పార్వతీదేవిని ఆనందింపచేశాడు. కల్మషాలను హరించడంలో దక్షత, క ష్టాలలో ఉన్నవారి బాధలను తీర్చడంలో నేర్పరితనం, లతలాగ అల్లుకుపోయిన ఆశ్రీతుల విఘ్నాలను ఛేదించటంలో మేటి, తీయనైన సున్నితమైన మాటలతో సకల జనులకు ఆనందం కలిగించడం వినాయకుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరు ఏది పెట్టినా, వాటిని ప్రేమగా ఆరగించాలే కాని, ఆ వంటకంలోని లోపాలను ఎత్తిచూపుతూ, ఆహారపదార్థాలను వృథా చేయకూడదనే అంశాన్ని స్వయంగా, భక్తులు తనకు ప్రేమగా నివేదించిన ఉండ్రాళ్ల ద్వారా చూపాడు. చిన్నప్రాణిని సైతం ఆదరంగా చూడాలని మూషికాన్ని తన వాహనంగా చేసుకుని ఆదర్శంగా నిలిచాడు.
తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముక్కోటి నదులలో స్నానం చేసిన పుణ్యం సంపాదించి, తల్లిదండ్రులే ప్రత్యక్షదైవాలని నిరూపించిన గణపతిని పూజించడం ద్వారా సత్ప్రవర్తన అలవరచుకోవచ్చని భాగవతంలోని ఈ పద్యం బోధిస్తోంది.
- డా. పురాణపండ వైజయంతి