ఇంధన సామర్థ్యంలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సామర్థ్యంలో వినూత్న ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. భారీ స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారింది. ఏపీని చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ట్రాలకు కేంద్రం చెప్పే స్థాయికి చేరుకుంది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు ఏపీ అనుసరిస్తున్న ‘రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ)’కి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఏపీని ఆదర్శంగా తీసుకుని 18 రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తెలిపింది. బీఈఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మూడేళ్లుగా ఏటా రూ.3,914 కోట్ల విలువైన 5,608 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేస్తోంది.
ఇందులో ఒక్క పాట్ పథకం ద్వారానే 3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్తును పొదుపు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ప్రత్యేకమైన ఐవోటీ ఆధారిత విద్యుత్తు పర్యవేక్షణ డివైస్‌ను రాష్ట్రంలోని 65 ఎంఎస్ఎంఈల్లో ప్రవేశపెట్టింది. ఇది యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.
’ఏపీఎస్ఈసీఎం’కు ప్రశంసలు
రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీయే ఈ ఎస్ఎల్ఎస్సీ. ఈ కమిటీ నేతృత్వంలో ఇంధన సామర్థ్య చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏపీఎస్ఈసీఎం సేవలను బీఈఈ డీజీ అభయ్ భాక్రే ప్రశంసించారు.
ఏపీ మోడల్ ఎస్ఎల్ఎస్సీ విధానాన్ని ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, హరియాణ, తమిళనాడు, తెలంగాణ సహా 18 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని వెల్లడించారు. ఇంధన సామర్థ్యం, సంరక్షణ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, భాగస్వాముల్లో చైతన్యం తెస్తున్న ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని బీఈఈ డైరెక్టర్ జనరల్‌తోపాటు క్లైమేట్ అండ్ ఎనర్జీ లీడ్ బ్రిటిష్ హై కమిషన్ లిబ్బి గ్రీన్, ఈఈఎస్ఎల్ ఎండీ విశాల్ కపూర్ అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంకిత భావంతో పనిచేయడం వల్లే ఏపీఎస్ఈసీఎం దేశంలోనే ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు–2022, ఇతర అవార్డులను గెలుచుకుందని భాక్రే చెప్పారు. ఏపీఎస్ఈసీఎం ద్వారా బీఈఈ తొలిసారిగా విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ బజార్ నిర్వహించి, ఇతర రాష్ట్రాలకు మార్గాన్ని చూపిందన్నారు. ఫలితంగా దేశం మొత్తం మీద రూ.2,500 కోట్ల విలువైన 73 ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను గుర్తించామని చెప్పారు.
ఇందులో ఒక్క ఏపీలోనే రూ.400 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ..దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీఈఈ డైరెక్టర్, కార్యదర్శికి, ఏపీఎస్ఈసీఎం చైర్మన్ కె.ఎస్.జవహర్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు