ఏపీ అసెంబ్లీ చిన్నది... విజిటర్స్‌కు ప్రవేశం లేదు
ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాలు, ఆర్థిక, వాణిజ్య శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసు బందోబస్తుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యనమల మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశమందిరం చాలా చిన్నదని ఆయన గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో విజిటర్స్‌కు అనుమతి ఇవ్వలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజిటర్స్ పాస్ కోరవద్దని ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇప్పటికే సూచించినట్లు చెప్పారు. మీడియా గ్యాలరీ కూడా చిన్నదని అందువల్ల ఎక్కువ మంది మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదని తెలిపారు. అలాగే అంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కొత్త మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను యనమల ఈ సందర్బంగా విశదీకరించారు. అలాగే గేట్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారని యనమల రామకృష్ణుడు వివరించారు.