చిరు వివాదం హత్యకు దారితీసింది
హైదరాబాద్ (బంజారాహిల్స్) : చిరు వివాదం కారణంగా ఓ కారు డ్రైవర్ హత్యకు గురయ్యాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సయ్యద్ నగర్లో నివసించే ఎండి. ఫిరోజ్‌ఖాన్(40) కారు డ్రైవర్. కాగా గురువారం రాత్రి విధులు ముగించుకొని కారులో ఇంటికి వెళ్తుండగా అదే బస్తీకి చెందిన అన్సర్ అలీ అనే కరాటే ట్రైనర్, పెయింటర్ తన భార్యతో కలిసి కూరగాయలు తెచ్చుకోవడానికి నడుచుకుంటూ వస్తున్నాడు.
అయితే రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న అన్సర్ అలీ భార్యకు ఫిరోజ్ కారు తగిలింది. దీంతో అన్సర్ తీవ్రంగా తిట్టాడు. కారు దిగి వచ్చిన ఫిరోజ్ కూడా ఎదురుదాడికి దిగాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. బలమైన దెబ్బలు తగలడంతో ఫిరోజ్ అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే మహావీర్ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనలో అన్సర్ అలీపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.