స్మార్ట్ కార్డుల వైపు టీఎస్ఆర్టీసీ చూపు!
హైదరాబాద్: కండక్టర్లతో సంబంధం లేకుండా, డ్రైవర్లు కూడా టిక్కెట్లు ఇచ్చే అవసరం లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని టీఎస్ఆర్టీసీ యోచిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అమలవుతున్న స్మార్ట్ కార్డు విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. ఈ విధానంలో ప్రతి ప్రయాణీకుడు ప్రీ-పెయిడ్ కార్డును కొనుగోలు చేయాల్సివుంటుంది.
ప్రయాణీకుడు బస్సుఎక్కే సమయంలో సెన్సార్ల ద్వారా కార్డును ఆటోమేటిక్ స్వైప్ అయ్యేవిధంగా ఈ టెక్నాలజీ ఉండబోతోంది. వ్యక్తి ఏ ప్రాంతంలో ఎక్కి ఎక్కడ వరకూ ప్రయాణించాడో అంత మొత్తాన్ని స్మార్ట్ కార్డు ద్వారా మెషిన్ సెన్సార్లు గుర్తించి నిర్ధారిత మొత్తం కార్డు నుంచి డిడక్ట్ చేసుకుంటుంది. వీటిని తొలుత ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 23 వేల కండక్టర్లు ఉన్నారు. తాజాగా వేతనాలు కూడా పెరగడంతో అసలే అప్పుల బాధలతో పీకల్లోతు కూరుకుపోయిన సంస్థ వాటి నుంచి బయటపడేందుకు చర్యలు చేపట్టింది.