Smart City status
-
జిల్లాను స్మార్ట్‌సిటీగా మారుస్తాం: బొత్స
సాక్షి అనంతపురం : అనంతపురం నగరాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇంఛార్జి మంత్రి హోదాలో సోమవారం నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి బొత్స.. మంగళవారం ఉదయం అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డితో కలిసి అనంత నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో బిందెలకాలనీ, ఎస్సీ కాలనీ, గుత్తి రోడ్డు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణపురం పంచాయతీలో డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు. అలాగే అన్ని మున్సిపాలిటీ లు, కార్పొరేషన్లలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనంతపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
అభివృద్ధి ముసుగులో ‘స్మార్ట్’గా దోపిడీ
సాక్షి, కాకినాడ( తూర్పు గోదావరి) : దేశవ్యాప్తంగా తొలి విడతలోనే జిల్లా కేంద్రం కాకినాడ ఆకర్షణీయ నగరంగా ఎంపికైందన్న ఈ ప్రాంతవాసుల ఆనందంపై గత తెలుగుదేశం పాలకులు నీళ్లు చల్లారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని కాకినాడ నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన పాలకులు ఆ నిధులను కైంకర్యం చేసేందుకే ప్రాధాన్యతనివ్వడంతో అభివృద్ధిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. 2016లో కాకినాడ నగరాన్ని స్మార్ట్‌సిటీగా ఎంపిక చేశాక తొలివిడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ద్వారా రూ.384 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కసారిగా అంతమొత్తంలో నిధులు విడుదల కావడంతో వాటిని ఎలా స్వాహా చేయాలనే అంశంపైనే అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. సరైన అంచనాలు, పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా పనులు మంజూరు చేయించి అందిన కాడకు దోచుకున్నారు. వేసిన రోడ్లపైనే మళ్లీమళ్లీ రోడ్లు వేయడం, లోపభూయిష్టమైన టెండరింగ్ విధానాన్ని అనుసరిస్తూ ఇష్టారాజ్యంగా టెండర్లు పిలవడం ద్వారా కోట్లాది రూపాయలను బొక్కేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నగరంలో అనేకచోట్ల రహదారులు ధ్వంసమైనప్పటికీ పట్టించుకోని అధికారులు శుభ్రంగా ఉన్న రహదారులపై మళ్లీ మళ్లీ రోడ్లు వేయడం విమర్శలకు తావిచ్చింది. ప్రజాప్రతినిధుల ధన దాహానికి స్మార్ట్‌సిటీలో పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన ఓ కీలక అధికారి అండదండలు ఉండడంతో ఇక ఆ నేతల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మంజూరైన రూ.384 కోట్లలో ఇప్పటి వరకు దాదాపు రూ.290 కోట్ల వరకు సొమ్ములు కూడా చెల్లించేశారు. కొత్త ప్రభుత్వం రాకతో బెంబేలు స్మార్ట్‌సిటీ నిధులను అడ్డంగా బొక్కేసిన నేతలకు ప్రభుత్వం మారడంతో షాక్ తగిలింది. ఇష్టారాజ్యంగా పనులు చేయించి నిధులు దిగమింగిన నేతల అక్రమాలు ఇప్పుడు బయటపడతాయన్న భయం వారిలో నెలకొంది. అప్పటి ప్రజాప్రతినిధి ఆదేశాలకు జీ హుజూర్ అంటూ తలాడించిన అధికారులకు ఇప్పుడు దడ పట్టుకుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక స్మార్ట్‌సిటీ ద్వారా జరుగుతున్న ఆరు ప్రాజెక్టులకు సంబంధించి రూ.198 కోట్ల పనులు నిలుపుదల చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎన్నికల ముందే స్మార్ట్సిటీపనుల్లో అక్రమాలను ఉన్నత స్థాయి వరకు తీసుకువెళ్లడంతో అప్పట్లోనే పనులను నిలుపుదల చేసి విచారణకు ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం కూడా మారిన నేపథ్యంలో నాటి అక్రమాలు వెలుగుచూసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అధికారులు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక, ఎన్నికల పూర్తయ్యాక కూడా ఆగమేఘాలపై రేయింబళ్లు, రాత్రి, పగలు కూడా పనిచేసి అనేక రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసేశారు. వందలకోట్ల నిధులతో నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా చేసే అవకాశాన్ని నీరుగార్చి స్వార్థంగా వ్యవహరించి నిధులు బొక్కేసిన పాలకుల అవినీతి త్వరలోనే వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు. -
అవినీతిరహిత పాలనే లక్ష్యం
కరీంనగర్.. స్మార్ట్‌సిటీ హోదాకు కృషి - వీఎల్టీ టాక్స్‌తో ఆదాయం పెంపు - మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన సర్దార్ రవీందర్‌సింగ్ - నల్లా కనెక్షన్ ఫైలుపై తొలి సంతకం సాక్షి, కరీంనగర్: అవినీతిరహిత, పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని నగర పాలక సంస్థ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నల్లా కనెక్షన్ ఫైలుపై తొలిసంతకం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు రూ.200 డీడీ చెల్లించి.. నల్లా కోసం దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లోగా కనెక్షన్ ఇస్తామన్నారు. దసరాలోగా నగరానికి నిరంతరం తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు నగరంలో రెండు గుంటల నుంచి ఎకరం వరకు ఖాళీ స్థలం ఉన్న వారి నుంచివీఎల్టీ టాక్స్ వసూలు చేస్తామన్నారు. నగరంలో ఎవరికి ఏ ఆపదొచ్చినా తనను, మున్సిపల్ కమిషనర్‌ను కలువొచ్చని చెప్పారు. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదాకు కృషి చేస్తాననిపేర్కొన్నారు. రోడ్లపై చెత్త వేస్తే చర్యలు ప్రతి డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు. నగరంలో వ్యాపారులకు ముప్పై రోజుల్లోగా చెత్త బుట్టలు పంపిణీ చేస్తామన్నారు. చెత్త రోడ్లపై వేస్తే చర్యలు తప్పవన్నారు. సమస్యలను సమష్టిగా పరిష్కరించుకుందామని కార్పొరేటర్లు, అధికారులను కోరా రు. డివిజన్లలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి కోసం అల్లాడుతున్న హౌసింగ్‌బోర్డు కాలనీలో అక్కడి ప్రజల మధ్యే శనివారం అధికారులతో కలిసి సమీక్ష చేస్తామన్నారు. రాజకీయ ఉద్యోగమిచ్చిన సీఎం కేసీఆర్‌కు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. మేయర్‌కు నగర కార్పొరేటర్లు.. అధికారులు శాలువా, పూలమాలలు వేసి అభినందన లు తెలిపారు. కాగా, అధికారులు మేయర్ చాంబర్లో కొత్త ఫర్నిచర్ వేశారు. నగర డెప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన గుగ్గిళ్లపు రమేశ్ చాంబర్లో మాత్రం పాత కుర్చీలే ఉంచారు. దీంతో అసంతృప్తికి గురైన రమేశ్ వెంటనే కొత్త ఫర్నిచర్ తెప్పించుకున్నారు.