'స్మార్ట్ టి-షర్టు..ఏం చేస్తుందో తెలుసా?
టొరంటో: శాస్త్రవేత్తలు వినూత్నమైన టీ షర్ట్‌ను రూపొందించారు. ధరించిన వారి శ్వాసను మానిటర్ చేసే స్మార్ట్ టి-షర్టును పరిశోధకులు సృష్టించారు. ఎలాంటి వైర్లు లేదా సెన్సర్ల అవసరం లేకుండానే రియల్ టైంలో ధరించిన వారి శ్వాస రేటును ఇది పర్యవేక్షిస్తుందట. శ్వాసకోశ వ్యాధులను నిర్ధారించడానికి లేదా ఉబ్బసం, స్లీప్ అప్నియా లేదా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి బాధపడుతున్న వ్యక్తులను పర్యవేక్షించడానికి ఉపయోగపడేలా దీన్ని ఆవిష్కరించారు.
కెనడాలోని లావాల్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ 'స్మార్ట్ టీ షర్టును రూపొందించారు. దీని అంతర్గత ఉపరితలంపై పలుచటి వెండి పొరతో కప్పబడిన బోలుగా ఉండే ఆప్టికల్ ఫైబర్‌తో తయారు చేసిన యాంటెన్నాను షర్ట్ కాత్లో ఛాతీ స్థాయిలో అమర్చారు. ఇలా ప్రత్యేకంగా అమర్చిన ఈ యాంటెన్నా ధరించిన వ్యక్తి శ్వాస సంకేతాలను ప్రసారం చేస్తుంది. ఇలా పంపిన డేటా యూజర్ యొక్క స్మార్ట్‌ఫోన్ లేదా సమీప కంప్యూటర్ చేరుతుంది.
శ్వాసకోశ రేటు కొలిచే ఇతర పద్ధతుల మాదిరిగా కాకుండా, ఎలాంటి తీగలు, ఎలక్ట్రోడ్లు, లేదా సెన్సార్లతో సంబంధం లేకుండా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. బాహ్య పరిస్థితులకు తట్టుకునేలా ఈ ఫైబర్‌ను పాలిమర్ తో కవర్ చేసినట్టు యూనివర్శిటీ ప్రొఫెసర్, పరిశోధకుల్లో ఒకరు యునెస్ మెస్సడేక్ చెప్పారు. దీన్ని ధరించిన వ్యక్తి కూర్చున్నా, పడుకున్నా, నిలబడినా సెన్సింగ్ అండ్ ట్రాన్సిమిటింగ్ అనే రెండు విధులును ఇది విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే ఈ స్మార్ట్ టీ షర్టు అందించే డేటా విశ్వసనీయమైనదిగా తేలిందని చెప్పారు. అంతేకాదు 20 ఉతుకుల తరువాత కూడా ఈ యాంటెన్నా నీరు, డిటర్జెంట్‌ను తట్టుకోగలిగి, మంచి పని పరిస్థితిలో ఉందని ప్రొఫెసర్ చెప్పారు. ఈ అధ్యయనం సెన్సర్స్ జర్నల్ లో ప్రచురించబడింది.