అరకును దత్తత తీసుకుంటా: బాబు
తల్లి ఊరును దత్తత తీసుకోనున్న భువనేశ్వరి
నేడు స్మార్ట్ ఏపీ కార్యక్రమం మొదలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ‘స్మార్ట్ విలేజీ - స్మార్ట్ వార్డు - స్మార్ట్ ఏపీ’ కార్యక్రమంలో భాగంగా తాను విశాఖ జిల్లా అరకు గ్రామ పంచాయతీని దత్తత తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన సతీమణి భువనేశ్వరి తన తల్లి పుట్టిన ఊరైన కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని కొమరోలు గ్రామాన్ని దత్తత తీసుకోనున్నారని తెలిపారు. కుమారుడు లోకేష్ నిమ్మకూరును, కోడలు బ్రాహ్మణి నారావారిపల్లెను దత్తత తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారని వివరించారు.
మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, కుటుంబరావులతో కలిసి చంద్రబాబు శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామాలు, వార్డుల్లో నెలకొన్న సమస్యలను అధిగమించడానికి ‘ప్రగతి కోసం ప్రజా ఉద్యమం’ నినాదంతో ఆదివారం నుంచి రాష్ట్రంలో ‘స్మార్ట్ విలేజీ- స్మార్ట్ వార్డు- స్మార్ట్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని వేలివెన్ను గ్రామం నుంచి 16 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని 12,918 గ్రామాలు, 3,463 మున్సిపల్ వార్డులను కలుపుకొని మొత్తం 16,383 యూనిట్ల అభివృద్ధి భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైలు, ఎన్నార్వీలు (గ్రామం వదిలి దేశంలో ఇతర ప్రాంతాల్లో స్థిర పడిన ప్రముఖలు)తో పాటు మొదటి దశలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దత్తతకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గ్రామాల వారీగా ప్రస్తుత పరిస్థితులతో కూడిన పూర్తి వివరాలతో ప్రత్యేక వెబ్‌సెట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు కూడా దత్తత గ్రామాలను ప్రకటించారు. విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఎన్నారై టీడీపీ అమెరికా విభాగం హుద్‌హుద్ తుపాన్ సాయంగా పది వేల అమెరికన్ డాలర్ల చెక్‌ను చంద్రబాబుకు అందజేసింది.