ఉపాధి చెల్లింపులపై ప్రత్యేక నిఘా
=క్లస్టర్ల వారీగా ప్రత్యేక బృందాలు
=చేతివాటం ప్రదర్శిస్తే కఠిన చర్యలు
=సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ ఎస్కార్ట్
సాక్షి, విశాఖపట్నం: ఉపాధి హామీ చెల్లింపుల్లో ఎడాపెడా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్‌కార్డు ద్వారా జరిగిన చెల్లింపుల్లోనే అక్రమాలు జరిగాయన్న విమర్శలు గుప్పుమన్నాయి. ఇక నగదును నేరుగా అందిస్తే ఇంకెన్ని జరుగుతాయోనన్న అనుమానం అందరిలోనూ ఉంది. దాంతో అక్రమాలకు ఆస్కారమివ్వకూడదని నేరుగా చేసే ఉపాధి చెల్లింపులపై ప్రత్యేక నిఘా పెట్టారు. గ్రామ స్థాయి కమిటీలతోనే సరిపెట్టకుండా మండల స్పెషలాఫీసర్లకు పర్యవేక్షక బాధ్యతలు అప్పగించారు.
అంతటితో ఆగకుండా క్లస్టర్ల వారీగా పర్యవేక్షక కమిటీని నియమించారు. అయినప్పటికీ అక్రమాలకు పాల్పడితే బాధ్యులైన పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోనున్నారు. ఈమేరకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్, జూలై నెలకు సంబంధించి ఉపాధి కూలీల చెల్లింపులు జరగలేదు. రూ.17.9 కోట్ల మేర బకాయిలు ఉండిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ బకాయి వేతనాల కోసం ఆందోళనలు చేశారు. ఇంతలోనే ఉపాధి చెల్లింపులు చేస్తున్న ఫినో సంస్థతో ఒప్పందాన్ని అధికారులు రద్దు చేశారు. దీంతో బకాయిల విడుదల, పంపిణీ ప్రశ్నార్థకంగా మారాయి.
ఈ నేపథ్యంలో కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ జోక్యం చేసుకుని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిధులు విడుదలతో పాటు నేరుగా (మాన్యువల్) చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆమేరకు తొలి విడతగా రూ.13,87,24,000విడుదల చేయగా మిగతా మొత్తాన్ని తాజాగా విడుదల చేసింది. దీంతో 675 పంచాయతీల్లో చెల్లింపులకు చర్యలు తీసుకున్నారు. అయితే ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి, మండల ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆమేరకు సర్పంచ్, విలేజ్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌సీలతో ఉండే కమిటీలను గ్రామాల్లో నియమించారు. గ్రామాల వారీగా బకాయిలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు సెల్ఫ్ చెక్ ఇచ్చారు. వాటిని డ్రా చేసి సోమవారం నుంచి చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. కాకపోతే ఈ విధానంలో కూడా అక్రమాలు చోటు చేసుకోవచ్చన్న భయంతో ప్రత్యేక నిఘా పెట్టారు. స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాను చోడవరం, పెందుర్తి, పాడేరు, నర్సీపట్నం, యలమంచిలి, అరకు క్లస్టర్లగా విభజించి, వాటికి ముగ్గురు సభ్యుల గల పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా మాన్యువల్‌గా చేసిన చెల్లింపుల్లో చేతివాటం ప్రదర్శిస్తే బాధ్యులైన కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రోజూ చెల్లింపులపై నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఉపాధి చెల్లింపులు చేయాల్సిన వాటిలో 10 సమస్యాత్మక గ్రామాలున్నాయి. వాటిలో పంపిణీ దృష్ట్యా నగదు పట్టుకుని వచ్చి వెళ్లే పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక పోలీస్ ఎస్కార్ట్ ఇస్తున్నారు.