ఐజేయూ అధ్యక్షుడిగా ఎస్.ఎన్.సిన్హా
ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన దేవులపల్లి అమర్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్.ఎన్.సిన్హా, దేవులపల్లి అమర్ మళ్లీ ఎంపికయ్యారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. ఒక్కో నామినేషనే మిగలడంతో అధ్యక్షునిగా ఎస్.ఎన్.సిన్హా, ప్రధాన కార్యదర్శిగా దేవులపల్లి అమర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎంపికైనట్లు యూనియన్ కేంద్ర ఎన్నికల అధికారి రామకృష్ణ ప్రకటించారు. ఢిల్లీకి చెందిన ఎస్.ఎన్.సిన్హా హిందూస్థాన్ టైమ్స్‌లో ఫొటో జర్నలిస్టుగా చేరి 30ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసి ఫొటో ఎడిటర్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అమర్ సీనియర్ జర్నలిస్టు.
మీడియాలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉంది. 2005 - 2010 మధ్య రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ప్రముఖ వార్తా చానెళ్లలో న్యూస్ బేస్డ్ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తున్నారు. సిన్హా, దేవులపల్లి అమర్ మళ్లీ ఐజేయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎంపిక కావడంపట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. శేఖర్, కె.విరహత్ అలీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సోమసుందర్, ఐవీ సుబ్బారావు అభినందనలు తెలిపారు.