అప్పుడు 90 గంటలు.. ఇప్పుడు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు
''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan).. మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం చెన్నైలో జరిగిన CII మిస్టిక్ సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్ 2025లో సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిర్మాణ పరిశ్రమకు కార్మికుల కొరత ఏర్పడుతోంది. భారతదేశంలో కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ప్రభుత్వం అందించే కొన్ని పథకాల కారణంగా.. కార్మికుల ఆర్ధిక వ్యవస్థ బాగానే ఉందని, బహుశా ఈ కారణంగానే వారు పనిచేయడానికి ఇష్టపడటం లేదని అన్నారు.కార్మికుల కొరత భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభావం చూపుతోంది. ఎల్ అండ్ టీ సంస్థకు 4 లక్షల మంది కార్మికులు అవసరం. కానీ అవసరమైన మేర కార్మికులు లభించడం లేదు. అంతే కాకుండా ద్రవ్యోల్బణం కారణంగా.. కార్మికుల వేతనాలను కూడా సవరించాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు.కార్మికులలో మాత్రమే కాకుండా.. ఉద్యోగులలో కూడా అదే ధోరణి ఉందని సుబ్రమణ్యన్ అన్నారు. నేను ఎల్ అండ్ టీ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరినప్పుడు.. మా బాస్ ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. దానికి నేను ఒకే చెప్పాను. కానీ ఇప్పుడు ఎవరికైనా ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెబితే ఉద్యోగాన్నే వదిలేసి వెళ్ళిపోతారు అని అన్నారు.90 గంటల పనిపై చర్చవారానికి 90 గంటలు, ఆదివారాలు కూడా పనిచేయాలని చెప్పిన సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు గతంలో చర్చకు దారితీశాయి. దీనిపై ఆదార్ పూనవాలా, ఆనంద్ మహీంద్రా, ఐటీసీ సంజీవ్ పూరి వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు స్పందిస్తూ.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి వివరించారు.గరిష్ట పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనను పార్లమెంటుకు కూడా చేరింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేలో వారానికి 60 గంటలకు పైగా పని చేయడం వల్ల.. ఆరోగ్యం దెబ్బ తింటుందని, ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని వెల్లడించారు. రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు పనిచేస్తే.. శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయని ఒక సర్వేలో కూడా తెలిసింది.