ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించండి
ఐఐటీ విద్యార్థులకు సీఐఐ చైర్పర్సన్ శోభన కామినేని పిలుపు
- 474 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం
- సంగారెడ్డి జిల్లా కందిలో ఘనంగా ఐఐటీ ఆరో స్నాతకోత్సవం
సాక్షి, సంగారెడ్డి: ఉత్పత్తి రంగం సామర్థ్యం పెరుగుతున్నా ఆ మేరకు ఉద్యోగావకాశాలు పెరగడం లేదని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షురాలు శోభన కామినేని అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలో సంస్థ హైదరాబాద్ పాలక మండలి చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఐఐటీ హైదరాబాద్ ఆరో స్నాతకోత్సవ సభలో ఆమె మాట్లాడారు. యువత శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే శక్తి ఆధునిక భారతానికి ఉందని, డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. వివిధ రంగాల్లో ఉత్పాదకతను ఒక శాతం పెంచడం ద్వారా భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పారు.
తద్వారా కొత్తగా 50 లక్షల ఉద్యోగాలతో పాటు, ప్రతీ పది మందిలో తొమ్మిది మంది పేదరికం నుంచి బయట పడతారన్నారు. 85 శాతం మంది నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని శోభన పేర్కొన్నారు. రవాణా, సాంకేతికత కలబోత ద్వారా స్పేస్ ఎక్స్, హైపర్‌లూప్ వంటి అద్భుత ఆవిష్కరణలు జరుగుతున్నాయని వివరించారు. రోబోటిక్స్, ఆరోగ్య రంగం భాగస్వామ్యం.. శస్త్ర చికిత్సల ముఖచిత్రాన్ని మార్చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రాబోయే రెండు, మూడు దశాబ్దాల్లో దేశంలోని సగానికి పైగా జనాభా పట్టణాల్లో ఉంటుందని, ఈ నేపథ్యంలో వందలాది పట్టణాలు స్మార్ట్ సిటీలుగా మారేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ఆరోగ్య సేవలు, రక్షిత తాగునీరు, వ్యవసాయం, ప్రపంచ శాంతి, సైబర్, సరిహద్దుల రక్షణతో పాటు ఉద్యోగాల కల్పన అతి పెద్ద సవాలుగా నిలుస్తాయని చెప్పారు.
ఉద్యోగ అవకాశాలను సృష్టించండి
చదువు ముగించుకుని వెళ్తున్న ఐఐటీ విద్యా ర్థులు ఉద్యోగ అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించాలని ఐఐటీ హైదరాబాద్ పాలక మండలి చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు జరగాలన్నారు. బోధన, మానవ వనరులు, ఉత్తీర్ణత వంటి అంశాల్లో ఐఐటీ హైదరాబాద్ నానాటికీ మెరుగవుతోం దన్నారు. ఐఐటీహెచ్‌లో 3,238 మంది విద్యా ర్థులు 14 విభాగాల్లో చదువుతున్నారని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ తెలిపారు. ఐఐటీ హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.232 కోట్ల మేర నిధులతో పరిశోధనలు జరుగు తున్నాయన్నారు. జపాన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్, తైవాన్, స్విట్జర్లాండ్ తదితర దేశాలతో తమ సంస్థ పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొ నేందుకు రూపొందించాల్సిన సాంకేతికతపై జపాన్‌కు చెందిన కియో యూనివర్సిటీ పర్యావరణ, సమాచార శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ జూన్ మురయ్ ప్రసంగించారు.
473 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం
స్నాతకోత్సవం సందర్భంగా బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్డీ తదితర కోర్సులకు సంబంధించి 473 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. బీటెక్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన జోషి కేయూర్ ప్రయాగ్, అర్జున్ వీ.అనంద్, ఎమ్మెస్సీలో త్రిష భట్టాచార్య, ఎంటెక్‌లో తివారి రామయజ్ఞ బంగారు పతకాలు అందుకున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులు పోచంపల్లి ఖాదీ కండువాలతో హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.