social activist Devi
-
నిరంకుశత్వంపై నిరసన గళాలు
‘సర్ ఫరోషీకి తమన్నా ఆజ్ హమారే దిల్ మె హై దేఖనా హై జోర్ కితనా బాజువే కాతిల్ మెహై’... అంటూ తెల్లదొరలకు సవాలు విసిరిన రాంప్రసాద్ బిస్మిల్‌ని, ఆ పాట పెదాలపై చిరునవ్వుగా వెలయించి మరణించిన అష్ఫదుల్లా ఖాన్ని భుజాన్నేసుకుని ఊరేగుతున్నది నేటి యువతరం. పౌర చట్టం వద్దంటూ వీధి వీధినా... ‘కాబిల్’ ఎవడయినా, ఏ నిరంకుశుడయినా కావచ్చుగాని జనం కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధమవుతున్న యువత పీక నులిమేంత శక్తి ఏ పాలకుడికీ, పోలీసు మిలటరీకి లేదన్నదే ఈ సవాలు. నేటి నిరసనల్లో ప్రతి వ్యక్తికీ తమదయిన ఒక అభివ్యక్తీకరణ ఉంది. తాము చెప్పదల్చుకున్నది పోస్టరు నినాదమో, చిత్ర రూపమో స్వంతంగానే రాసుకుంటారు. లేదంటే ‘నెట్’ సృజనకారుల నుండి తమను వ్యక్తపరిచేదాన్ని స్వంతం చేసుకుంటారు. ‘తు జింద హై తా జిందగీకి జీత్ మే యకీన్ కర్’ అంటూ ‘నువ్వు బతికే ఉంటే జీవిత విజ యాన్ని విశ్వసించు. స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించు’ శంకర్ శైలేంద్రని బతికిస్తారు. ‘హమ్ దేఖేంగే’ అన్న ప్రముఖ ఉర్దూ కవి ఫెయిజ్ అహ్మద్ ఫెయిజ్ని ఇక్సాల్ బానో స్వరంతో మేళవించి ‘మేం చూస్తాం వాగ్దానం చేసిన ఆ రోజులు... శిలాఫలకాలపై రాసిన ఆ రోజులు వస్తాయో లేదో మేమూ చూస్తాం... నియంతృత్వ పర్వతాలు దూదిపింజల్లా ఎగిరిపోయే కాలాన్ని మేం చూస్తాం’ అంటూ గిటార్ స్వరాలు పలుకుతారు. అన్నిరంగాలవాళ్లు ‘మాకు కావాలి ఆజాదీ.. పౌర చట్టం నుండి ఆజాదీ, మత రాజ్యం నుండి, దరిద్రం నుండి, నిరుద్యోగం నుండీ’ అంటూ జేఎన్‌యూ నినాదం కొత్త సొబగులు అద్దుకుంటోంది. ఫీజుల పెంపుకు నిరసనలో ‘గుడ్డోడికి కూడా నిరసనా’ అంటూ గల్లీ పోలీసుల చేతుల్లో వీపుపైనే కాదు మనసు కూడా గాయపడిన సుమన్ ‘ఈ నేలపై ప్రవహిస్తున్న నెత్తుటికి లెక్కలు కావాలి గులాబీలు కాదు విప్లవాలు కావాలి’ అని గంభీరంగా నిలదీస్తాడు. ‘విలాస మందిరాల్లోనే వెలిగే దీపాల్ని, కాంతిలేని ఉదయాల్ని నేను స్వాగతించను, నేను అంగీకరించను’ అంటూ జైలు కవిత్వం రాసిన హబీజ్ జలీబ్ని ఆవాహన చేస్తాడు. ‘బెల్గానియో వెనక్కి పో’ అంటూ రెండో ప్రపంచ యుద్ధకాలంలో ముస్సోలినీని తిరగ్గొట్టిన గీతం హిందీలో ‘వాపస్ జావ్’ అంటూ గిటారు చేతులతో ప్రకంపిస్తాడు ఫూజన్. వాపస్ జావ్ అంటూ వేల గొంతులతనికి బదులు పలుకుతాయి. ‘నేనెవరిని ఎక్కడినుండి వచ్చాను నాకు చోటేది’ అన్న ఎమర్జెన్సీ నాటి రంగస్థల గీతాలు, ‘రుకేన జాకీన’ ఆగేది లేదు లొంగేది లేదు అంటూ క్రమశిక్షణగా సాగే ఊరేగింపుల మార్చింగ్ సాంగ్లవుతున్నాయి. వ్యంగ్యంలో కూడా తీసిపోకుండా ‘మోదీజీ... మోదీజీ... లాఠీచార్జీ తేలిగ్గా ఉంటుందనీ బాష్పవాయువు హాయిగా ఉంటుందనీ మీరు చెబితే ఇపుడే తెలిసిందని’ జామియా మిలియా భజనలు చేస్తున్నది ‘దేనే హైసారీ దునియా ప్రపంచం అంతా చుట్టావు... జపాను నుండి అమెరికా దాకా అపుడపుడూ భారత్‌లో ఆగుతావు.. మంచిరోజుల కలలమ్ముతావు’ అంటూ 80వ దశకంలో మార్మోగిన ఐలవ్ ఇండియా పాట పేరడీకి డ్యాన్స్ చేస్తారు. స్టాండప్ కమెడియన్లు గత ఆరేళ్లుగా ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇవ్వాళ యువతకు వీరు హీరోలు. సంగీతకారుడు రాహుల్‌రాయ్ రాసిన అనేక వ్యంగ్య గీతాలు తీవ్రమైన నిరసనల మధ్య వినోదాన్ని పంచుతూ పాలకుల్ని వెక్కిరి స్తున్నాయి. ఇది ముస్లింల సమస్య కాదు సమస్త భారతీయులదీ. ఈ దేశం అదానీలు, అంబానీలు, సంఘీయుల వారసత్వం కాదు. స్వాతంత్య్ర పోరా టంలో మీ అడ్రసెక్కడ అంటూ ప్రశ్నిస్తున్నాయి. జంతర్ మంతరా, షహీక్ బాగా, ఆజాద్ మైదానా లేక అనేక నగరాల్లోని గల్లీలధర్నా చౌకీలా కాదు.. ప్రతిచోటా.. ఒక పద్ధతిలో వస్తారు. పాడతారు, నృత్యం చేస్తారు, ఉపన్యాసాలిస్తారు. కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు తమ బాధ్యతగా కలాలు పదునుపెడుతున్నారు. పరిపాలకుల ప్రతి విధానం కవితారూపక వ్యంగ్యాన్నో, విసురునో, నిరసననో ఎదుర్కొంటున్నది. హిందీ సినిమా రచయిత వరుణ్‌గ్రోవర్ కవిత ‘మేం కాగితాలు చూపించం (సర్టిఫికెట్లు) రాం ప్రసాదు ‘బిస్మీల్’ కాగల దేశం ఈదేశం మా అందరికీ సొంతం మట్టినెట్లా విభజిస్తావు కలిసుంది దాన్లో అందరి రక్తం’ దేవి వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త, ఈమెయిల్: devi11021967@gmail.com -
‘అలాంటి మహిళల కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోంది’
మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఉపాధి రంగంలో పని చేస్తున్నారు. కంపెనీ సీఈవోలవుతున్నారు. ప్రజాప్రతినిధులుగా పాలన పగ్గాలందుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మహిళలు అభివృద్ధి ప్రస్థానం ఎంతో ముందుకు సాగిపోయారనే అనిపిస్తుంది. మహిళలు నిర్ణయాత్మక స్థాయికి చేరినట్లేనా? మహిళ సాధికారత సాధించిందా? సోషల్ యాక్టివిస్టు దేవి ఏమంటున్నారో చూద్దాం. 1. ఇన్ని దశాబ్దాల పోరాటంలో భారతీయ మహిళ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ సాధించిందనుకోవచ్చా? ఇప్పటికీ ఏదో సాధించేసింది అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్థిక సాధికారత రెండు రకాలు. ఒకటి ఉపాధి కలిగి ఉండడం, రెండవది వనరులు కలిగి ఉండడం. అంటే స్థిరాస్థుల వంటివి అన్నమాట. ఒకవేళ ఆస్థి ఉన్నా దాని మీద నిర్ణయం తీసుకునే హక్కు ఆ మహిళకు ఉండడం లేదు. అది లేనంత వరకు ఎంత ఆస్థి ఆమె పేరు మీద ఉన్నా సరే ఆమెకు ఆర్థిక సాధికారత ఉందనలేం. 2. సమాజంలోని అన్ని స్థాయులలోనూ స్త్రీ ఆర్థిక సాధికారత విషయంలో ఒకేరకమైన పరిమితులు ఉంటున్నాయా? నగరాలలో నేడు నెలకు పదివేల లోపు సంపాదిస్తున్న మహిళలు చాలా మంది తమ కుటుంబాలను తామే పోషిస్తున్నారు. భర్త సంపాదనకు తన సంపాదన జత చేర్చడం కాదిక్కడ. నూటికి నూరుశాతం కుటుంబ బాధ్యత ఆమెదే అవుతోంది. భర్త సంపాదన తాగుడు, జూదాలకు వెళ్లిపోతోంది. ఈ కండిషన్‌ని ఆర్థిక సాధికారత అనలేం. ఆమె మోస్తున్న బతుకు భారం అది. ఇక సంపన్నవర్గాల మహిళల్లో చేతిలో డబ్బు, ఖర్చు పెట్టుకోగలిగిన స్వేచ్ఛ ఉన్నప్పటికీ దానిని కూడా సాధికారత కోణంలో చూడలేం. ఎందుకంటే అది మిగులు డబ్బుతో వచ్చిన ఆర్థిక వెసులుబాటు తప్ప ఆర్థిక సాధికారత కాదు. ఇక మధ్య తరగతి మహిళ సాధికారత అనే భావన జోలికి వెళ్లడానికే భయపడుతోంది. పారిశ్రామిక రంగంలో కూడా గ్లాస్ సీలింగ్ బ్రేక్ చేసిన మహిళల కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోంది. అన్నింటికంటే మొదట... ప్రపంచం ఇంకా మహిళను సంప్రదాయ పద్ధతిలో చూడడానికే ఇష్టపడుతోంది. అందుకు ఇవాంక పెద్ద ఉదాహరణ. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్కొచ్చిన ఇవాంక ట్రంప్ తన ప్రసంగంలో ‘మొదట తానొక భార్యను, తల్లిని...’ అంటూ మొదలు పెట్టింది. అదే ఒక మగవాడు అలాంటి సమ్మిట్ కొచ్చినప్పుడు ఏం మాట్లాడుతాడు? తనను తాను ఎంట్రప్రెన్యూర్‌గా పరిచయం చేసుకుంటాడు. ఇవాంకకు తాను హాజరైన సమావేశం ఉద్దేశాన్ని గౌరవించాలనే ఆలోచన కూడా లేకపోయింది. 3. బతుకు మీద భరోసాకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తప్పని సరి అనవచ్చా? నిజమే. అల్పాదాయ వర్గాల మహిళల్లో కనిపించే ధైర్యం మధ్యతరగతిలో కనిపించడం లేదు. అల్పాదాయ వర్గాల్లో మహిళకు తన బతుకు తాను బతకగలననే భరోసా ఉంది. దాంతో యాంబిషియస్‌గా కూడా ఉంటోంది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి వచ్చేటప్పటికి మహిళ ఉద్యోగం చేస్తుందే తప్ప, ఆమెకు స్వావలంబన ఉండడం లేదు. విద్య, వైద్యం ఖరీదై పోవడంతో ఒక జీతంతో కుటుంబాన్ని నడపడం కష్టమై ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తున్న పరిస్థితులే ఎక్కువ. ఆమెకు వచ్చే జీతానికి ఖర్చులను ముందే నిర్ణయించి ఉంటాడు భర్త. 4. మహిళలు తమంతట తాముగా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారా? కనీసం అలా కొన్ని అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకరు నడిపిస్తే నడవాలని ఎదురు చూస్తున్నారా? ఆ తపన ఉన్న వాళ్లు అవకాశాలు అడ్డుకుంటున్నా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లోకి కానీ ఉద్యోగాల్లోకి నెట్టబడినా సరే ఆ తర్వాత తప్పనిసరిగా నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. ఇష్టమైన రంగాల్లో కొనసాగుతున్నారు, ఆసక్తి లేని వాళ్లు మాత్రం ఎవరో ఒకరు చేయి పట్టి నడిపించినప్పుడు నాలుగు అడుగులు వేసి ఆ తర్వాత కనుమరుగవుతున్నారు. 5. ఈక్వల్ రైట్స్ సాధించుకోవాలన్నా, తన చాయిస్ తనకు ఉండాలన్నా... అందుకు ఆర్థిక స్వావలంబన పునాది అనవచ్చా? ఆర్థిక స్వావలంబన అనేది సంపాదిస్తున్న రూపాయి మీద ఉండేది కాదు, ఆమె ఖర్చు చేయగలిగిన రూపాయి మీద ఉండేది. ఖర్చు పెట్టగలగడం మాత్రమే కాదు తాను నిర్ణయం తీసుకోగలిగిన రూపాయి మీద ఆమెకు ఉండేదే స్వావలంబన అయినా సాధికారత అయినా. ఇక్కడికి వచ్చే సరికి డబ్బు కోసం కుటుంబాన్ని వదులుకోవడమా... అనే సామాజిక ఒత్తిడి మహిళ తల మీద ఉంటోంది. దానికి తలొగ్గాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. దాంతో చాలా సందర్భాలలో ఈక్వల్రైట్, తన చాయిస్ అనేవి మరుగున పడిపోతున్నాయి. 6. ‘మహిళలకు సాధికారత ఉండాలని మగవాళ్లను చైతన్యవంతం చేయాలా’? లేక... ‘సాధికారతను సాధించుకోండి’ అని మహిళలను చైతన్యవంతం చేయాలా? ఎవ్వరూ ఎవ్వరికీ అన్నీ అమర్చి ప్లేట్లో పెట్టి ఇవ్వరు. తమకు తాముగా సాధించుకోవాల్సిందే. పైగా ‘సాధికారత’ అనే పదంలోనే పెద్ద మోసం ఉంది. ‘నీకు అధికారం కావాలి’ అని చెప్పి, రాజ్యాంగ సవరణ చేసి వదిలేసి, అదే పదాన్ని చిలుకపలుకుల్లాగా వల్లిస్తే సరిపోదు. ‘ఒకరి చేతికి అధికారం రావాలంటే ఎలా? అది ఎవరి చేతిలో ఉందో వారి చేతి నుంచి తీసుకోవాలి’. అలా తీసుకోగలిగిన పరిస్థితులను కల్పించాల్సింది ప్రభుత్వం, రాజకీయ పార్టీలతోపాటు సమాజం కూడా. 7. రాజకీయ సాధికారత విషయంలో భారతీయ మహిళ స్థితి ఎలా ఉంటోంది? మహిళకు సాధికారత లేని స్థితికి కారణమైన పరిస్థితులను యథాతథంగా కొనసాగిస్తూ మహిళలను ‘మీరు సాధికారత సాధించండి’ అని చెప్పడం కాదు. సర్పంచ్‌గా ఎన్నికైన మహిళ స్వతంత్రంగా, క్రియాశీలకంగా ఉండడానికి ఆయా రాజకీయ పార్టీలు కూడా చొరవ తీసుకోవాలి. ఆమె భర్త అన్నింటిలో జోక్యం చేసుకునే పరిస్థితిని ఆ పార్టీలు కూడా అడ్డుకోవాలి. అలా జోక్యం చేసుకోవద్దని భర్తకు చెబితే ఇంట్లో ఘర్షణలు మొదలవుతాయని, దానికి సమాజ ఆమోదం కూడా లభించదనే భయంతో మహిళలు మౌనం వహిస్తుంటారు. అందుకే ప్రభుత్వం, రాజకీయపార్టీలు, సమాజం మూడూ సమష్టిగా పని చేస్తేనే మహిళ నూటికి నూరుశాతం సాధికారత సాధించగలుగుతుంది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మహిళ స్థానంలో ఆమె బాధ్యతలను హైజాక్ చేసే మగవాళ్లను నిలువరించేలా జీవో తేవాలి. 8. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మహిళలు చాలా వరకు ఆర్థికంగా భర్త లేదా కుటుంబం మీద ఆధార పడి ఉంటారు కాబట్టి పాలనలోనూ తన నిర్ణయాలను వ్యక్తం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటోందేమో! భర్త మీద ఆధారపడి ఉండడం ఒక కారణమైతే, కొందరి విషయంలో ఆ ఊరి పెత్తందారులు ఆర్థిక సహాయం చేసిన సందర్భాలుంటాయి. అప్పుడు భర్త మాట కూడా చెలామణిలో ఉండదు. ఆ పెత్తందారు మాటే చెల్లుబాటులో ఉంటుంది. ఇవన్నీ తిరిగి తిరిగి ఆర్థిక వెసులుబాటు దగ్గరకే వస్తాయి. 9. స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా ఎంపికైన మహిళలు తమ బాధ్యతల పట్ల నిరాసక్తంగా ఉంటే ఆ ప్రభావం రాబోయే తరం మీద ఎలా ఉంటుంది? తప్పనిసరిగా వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. చట్టసభల్లో ప్రాతినిధ్యం గురించి గళమెత్తిన ప్రతిసారీ... మీకు స్థానిక సంస్థల్లో ఇచ్చిన రిజర్వేషన్‌నే సరిగ్గా ఉపయోగించుకోవడం లేదంటూ విమర్శలు ఎదురవుతాయి. అందుకే గెలిచిన వాళ్లు క్రియాశీలకంగా ఉండాలి. సామాజిక వేదికలు కూడా ఆ అవకాశాన్నివ్వాలి. సివిల్ సొసైటీ గ్రూపులు ఈ ప్రయోజనం కోసం కూడా పోరాడాలి. 10. రాజకీయ సాధికారతలో... వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల మహిళల పరిస్థితి ఎలా ఉంది? కొన్ని దేశాల్లో పరిస్థితి మనదగ్గరకంటే చాలా దారుణంగా ఉంది. మన దగ్గర మహిళ దుస్తులు, అలంకరణ మీద కామెంట్స్ తక్కువే. ఒకరిద్దరు నోరు పారేసుకున్నా వెంటనే మహిళ దుస్తుల మీద మాట్లాడడం అనైతికం అనే వాదన బలంగా వినిపిస్తుంటుంది. కాబట్టి ఆ రకమైన కామెంట్స్ కొనసాగవు. అభివృద్ధి చెందాయని మనం విశ్వసించే పాశ్చాత్యదేశాలలో హిల్లరీని, మెర్కెల్, థెరిసామే వంటి వాళ్ల దుస్తుల మీద కూడా కామెంట్ చేస్తున్నారు. మహిళ రాజకీయాలలో సమర్థంగా వ్యవహరిస్తుంటే వెంటనే మగరాయుడిలా అనే మాట అక్కడా ఉంది. ఇందిరాగాంధీ విషయంలో ఆమె సమర్థతనే చూశారు కానీ మగరాయుడిలాంటి పోలికలు చెప్పలేదు మనదేశంలో. అయితే ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తం రాజకీయ రంగంలో మహిళను, మగవాడిని తూచే త్రాసులు వేరుగా ఉంటున్నాయి. మహిళ విషయానికి వచ్చేటప్పటికి ఆమె కుటుంబ జీవితాన్ని ప్రధానమైన అంశంగా తీసుకుంటారు. అదే మగవారి విషయంలో కుటుంబ జీవితాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఈ రకమైన రెండు తక్కెళ్ల విధానం మారాలి. –వాకా మంజుల -
సమానత్వం కోసం సమరం
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్త్రీపురుషుల మధ్య అంతరం ఎంతగా తగ్గితే అంత వేగంగా వృద్ధి రేటు పెరుగుతుంది. విద్యలో సమానావకాశాల ద్వారా కొన్ని దేశాలలో 50 శాతం ఎక్కువగా ఆర్థికాభివృద్ధి జరిగింది. స్త్రీపురుషుల మధ్య ఉపాధి, వేతన వ్యత్యాసాలు తొలగిస్తే స్త్రీల ఆదాయం 76 శాతం, ప్రపంచ ఆదాయం 17 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుంది. కాబట్టే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం స్త్రీల ఉపాధి, అన్నింటిలో సమానత్వం, సగం సగం భాగస్వామ్యం నినాదాన్ని ఇచ్చింది. ప్రపంచం దీనిని ఏ విధంగా గుర్తిస్తుందో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీపురుషుల మధ్య మరింత వేగంగా సమానత్వాన్ని సాధించడం అనివార్యం. అందుకే ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం మరింత పదునైన నినాదాన్ని ఇచ్చింది. అది–‘మారుతున్న పని, ప్రపంచ స్త్రీలు: 2030 నాటికి ఈ భూగ్రహం 50:50గా మారాలి’. గత ఏడాది స్త్రీల సాధికారత, సమా నత్వాలపై పునరాలోచించమని కోరింది. 2015లో తొలిసారిగా స్త్రీల సమ స్యలపై చర్చించి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానాలను సభ్యదేశాలన్నీ ఆమోదించాయి. ఆర్థిక వ్యవస్థలు బలపడాలంటే విశ్వ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు బలపడాలంటే ఉపాధి, వేతనం రెండింటిలో 50:50 వంతున సమంగా ఉండాలన్న వాస్తవం పలు అధ్యయనాల ద్వారా వ్యక్తమైంది. ఫలితంగా 167 దేశాలు స్త్రీల సాధికారత చట్టాలను, విధానాలను సమీక్షించుకున్నాయి. స్త్రీలు/బాలికలపై జరిగే హింస, హత్యలపై ఉక్కుపాదం మోపాలని లాటిన్ అమెరికా నిర్ణయించుకుంది. బ్రెజిల్ నేర పరిశోధన, విచా రణలో చేపట్టిన నూతన విధానాలను, పద్ధతులను ఆదర్శంగా తీసుకుని మెక్సికో, ఈక్వెడార్, పెరూ వంటి దేశాలు స్త్రీలపై ఇంటా బయటా జరిగే దారుణ హింసలను ఆపాలని తీర్మానించుకున్నాయి. 64 దేశాల అధిపతులు కలసి స్త్రీ సాధికారితపై చర్చించారు. శాంతిభద్రతలను నెలకొల్పడంలో స్త్రీలు కీలక పాత్ర పోషిస్తున్నారనీ, ఈ ధోరణిని ప్రోత్సహించాలనీ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 12 దేశాల ప్రభుత్వాల అధిపతులుగా, 13 దేశాలలో రాజ్యా ధిపతులుగా ఇప్పుడు స్త్రీలు ఉండటం అనుకూలించే విషయం. స్త్రీపురుషు లకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ కెనడా తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఫిన్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్ అదే బాట పట్టాయి. స్వీడన్ అతను (హన్) ఆమె (హోన్) అనే పదాలకు బదులు ఇద్దరికీ వర్తించేలా ‘‘హెన్’’ అనే పదాన్ని వాడుకలోకి తెస్తున్నది. కొసావో మహిళలు ఐదు వేల దుస్తులను ఒకేచోట ఆరవేసి యుద్ధంలో అత్యాచారాలకు గురైన స్త్రీలకు గొంతుకనిచ్చారు. ఛాందస దేశమైన ట్యునీషియా కూడా భర్త అనుమతి అవసరం లేకుండా బిడ్డలతో కలసి భార్య ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చి ఒక మూఢా చారానికి స్వస్తి పలికింది. టర్కీ, రష్యా, బెలారస్ మొదలైన దేశాలలో యుని లివర్ కంపెనీ మహిళలకు పనిలో 50 శాతం ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల పని సంస్కృతిలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని ఖండాంతర కార్పొరేట్ సంస్థ ప్రకటించింది. అయితే ఇవన్నీ కాగితాల మీద రాతలేనా? లేక స్త్రీలు, బాలికల జీవితాల్లో మార్పు తెచ్చే ఫలితాలుగా కూడా అవతరిస్తున్నాయా? ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న చట్టపరమైన హక్కులు, ప్రపంచంలో సమానత్వం ఆవశ్యకతను చెప్పి ఒప్పించడం వంటి వాటితో అసమానతలను అంతం చేయొచ్చనే విశ్వాసం కలుగుతున్నది. ఎక్కువ శ్రమ, తక్కువ ఫలితం విద్యాపరంగా స్త్రీలకు సమాన హక్కులూ, అవకాశాలు అంటే– అమ్మాయి లంతా ప్రాథమిక స్థాయిలో బడిలో పేరు నమోదు చేసుకుంటే సరిపోతుం దనుకోవడం పొరపాటు. వాళ్లు ఎన్నేళ్లు విద్యనభ్యసించారు? నాణ్యమైన విద్య లభిస్తున్నదా? భద్రత కలిగించే వాతావరణం ఉందా? అభ్యుదయ భావాలతో పాఠ్య ప్రణాళికలు ఉన్నాయా? శిక్షణ పొందిన ఉపాధ్యాయులు న్నారా? వంటి అంశాలకు సానుకూలమైన జవాబు లభిస్తేనే విద్యలో సమా నావకాశం అన్న మాట అర్థవంతమవుతుంది. స్త్రీల విద్యకీ, ఉపాధి అవకాశా లకీ, నైపుణ్యాలకీ గల సంబంధం అందరికీ తెలుసు. అయితే బాలికలు బడిలో గడిపే ప్రతి అదనపు ఏడాది 9.5 శాతం శిశుమరణాలను తగ్గిస్తుందని ఎన్ని ప్రభుత్వాలు గుర్తించాయి? ప్రాథమిక స్థాయిలో సరిసమానంగా బాలి కలు బడికి వెళ్లినా డిగ్రీ స్థాయికి 8 శాతంగా ఎందుకు ఆ నిష్పత్తి మారుతోంది. ఆపై విద్యకు వెళ్లేది కేవలం 3 శాతం. బాల్య వివాహాలు, పనులలో పెట్టడం, మూఢాచారాలు, కుల పంచాయితీలు వగైరాలు బాలికల చదువుకు ఆటం కాలు. వీటిని తొలగించేందుకు నిర్దిష్ట చర్యలేవి? వాటి ఫలితాల శాతం ఎంత? నినాదాల్లో ఉన్న తీవ్రత క్షేత్ర స్థాయి కార్యాచరణగా మారడంలో వైఫల్యం ఎందుకుంది? ప్రపంచమంతటా అంతరాలు చదువుకుని ఉద్యోగాలు చేసే అమ్మాయిల సంఖ్య బాగా పెరిగింది. రాజకీయ పార్టీల్లో నాయకత్వ స్థాయికి, ప్రజా ప్రతినిధులుగా స్థానిక సంస్థల్లో 50 శాతానికి మహిళలు చేరుకున్నారు. విధాన నిర్ణయాల్లో సైతం మహిళలపై హింస చర్చకు వస్తున్నది. కానీ యువతులలో మూడోవంతు కూడా ఉత్పత్తి రంగంలో నేరుగా కనిపించరు. గత మూడేళ్లలో గ్రామీణ ఉపాధిలో మహిళలు 35 శాతం నుంచి∙24 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 24 శాతం నుంచిl15 శాతానికి తగ్గిపోయారు. ప్రపంచవ్యాప్తంగా సగటున పురుషుల కంటే స్త్రీలు 24 శాతం తక్కువగా ఆదాయం పొందుతున్నారు. కానీ భారతదేశంలో ఆ అంతరం 40 నుంచి 65 శాతం ఉన్నది. పురుషుల కంటే రెండున్నర రెట్లు సమయం స్త్రీలు వేతన కూలితో పాటు వేతనం లభించని చాకిరీ చేస్తున్నారు. ఒక పక్కన ప్రపంచ సంపద అనంతంగా పెరుగుతున్నది. కానీ స్త్రీలకు ఆ సంపదలో భాగం లేదు. భారత స్త్రీకి ప్రసూతి ఇప్పటికీ గండమే. కెనడా తల్లులతో పోలిస్తే ప్రసూతి సమయంలో మన స్త్రీలు మరణించడానికి అవకాశం వందశాతం ఎక్కువ. 38 శాతం కాన్పులు నేటికీ శిక్షితులైన వైద్యుల సాయం లేకుండానే జరుగుతున్నాయి. ఆదివాసీలు, దళితులలో ఇది మరీ ఎక్కువ. మంచి ఉపాధి, సురక్షిత పని ప్రదేశాలు, నీరు, మరుగుదొడ్లు, శిశు సంరక్షణాల యాలు, పెన్షను, ఆరోగ్య సదుపాయం అనే కనీస హక్కులకు నోచని మహి ళలు ఇక్కడ 50 శాతం పైమాటే. సమాన అవకాశాలతో కొన్ని సామాజిక ఆర్థిక లక్ష్యాలు సాధించవచ్చు. అయితే ఆర్థికాభివృద్ధికి అనుసరించే మార్గాలన్నీ స్త్రీల సమానత్వానికి ఉపకరించవు. పైగా కొన్ని ఆర్థిక విధానాలు పనిలో అసమా నతలను పెంచి (అంటే ఇది స్త్రీల పని, ఇది పురుషుల పని అని విభజిం చడం), తద్వారా వేతన వ్యత్యాసాలను కొనసాగిస్తాయి. ఫలితంగా వేతన శ్రమకూ, వేతనం లేని చాకిరికి గల తేడాను బలపర్చి స్త్రీలను ఇంటిపనికే పరిమితం చేస్తాయి. దీనికి ఉదాహరణ ప్రస్తుతం మన దేశంలో అమల వుతున్న విధానాలే. స్త్రీలను అతి తక్కువ వేతనం చెల్లించే, నైపుణ్యం అంతగా అవసరం లేని పనులలో–భవన నిర్మాణ కార్మికులుగా, ఇటుక బట్టీలలో అడ్డాకూలీలుగా, ఇంటి పనివారిగా, పారిశుధ్య కార్మికులుగా; బీడీ, అగ రొత్తులు, అప్పడాలు వగైరా వంటివి తయారు చేయడం, బుట్టలు అల్లడం, గుండీలు కుట్టడం వంటి పనులకు పరిమితం చేస్తున్నారు. ఇక స్వయం సహాయక బృందాల మహిళలకు ఉపాధినిచ్చే నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చే పని రెండు తెలుగు రాష్ట్రాలలోను అరకొరగానే ఉంది. మానవ హక్కులు గీటు రాయిగా గల పర్యవేక్షణ వ్యవస్థలు లేకుండా ‘‘సాధికారత కల్పించాం’’ అని చెప్పుకునే ప్రకటనలలోని నిజాన్ని నిగ్గు తేల్చడం కష్టం. చాలా సందర్భాలలో ఇటువంటి ఘనతలు పరిశీలనలో నిలబడవు. ఎలాగంటే స్వేచ్ఛా మార్కెట్ నినాదంతో చౌకగా శ్రమను అందిస్తామంటూ కార్పొరేట్లను ఆకర్షించాలన్న ఆత్రుతతో ఉన్న ప్రభుత్వాలు కార్మిక చట్టాలను, భద్రతా ప్రమాణాలను నీరు కారుస్తున్నాయి. లాభాపేక్షతో ప్రైవేటు కంపె నీలు అనుసరించే దోపిడీని ప్రశ్నించడానికి, న్యాయం పొందడానికి శ్రామిక మహిళలకు చట్టాలే ఆధారం. అటువంటి చట్టాలు కనీసం కాగితంపైన అయినా సమానత్వం నిలిపేందుకు కట్టుబడకపోతే స్త్రీల కనీస హక్కులకు హామీ ఎక్కడిది? పాతుకుపోయిన వివక్షా పూరిత భావనల వల్ల సమానత్వ చట్టాల అమలే కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో 498ఎతో సహా అన్ని చట్టా లకు తూట్లు పొడుస్తూ మరోవైపు స్త్రీలను రక్షించండి, ఆడపిల్లలను చదివిం చండి అని నినాదాలు ఇవ్వడం హాస్యాస్పదం. స్త్రీలకు హక్కులు దక్కాలి చట్టాల ద్వారా లభించే సూత్రప్రాయ సమానత క్షేత్రస్థాయిలో ఫలితంగా మారి కోట్లాది మంది స్త్రీల జీవితాలలో మార్పుకు నాంది పలకాలంటే ముందు సామాజికంగా అణచివేతకు గురైన తరగతుల వారికి వారసత్వంగా లభించిన ప్రతికూలతలను నిర్మూలించే దిశగా అడుగులు వేయాలి. అభివృద్ధి క్రమంలో చోటు దక్కని స్త్రీలకు ప్రాథమిక హక్కులు లభించాలి. దేశ ఆర్థిక విధానం సామాజిక న్యాయాన్ని, లైంగిక సమానత్వాన్ని సాధించే దిశలో అడుగువేయాలి. వ్యూహాత్మకంగా రచిస్తే సంక్షేమ పథకాలు ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి స్త్రీలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక ప్రతికూలతలను తొలగించాలి. అదే సమయంలో విధాన నిర్ణేతలు గమనించ వలసిన ప్రచారంలో ఉంచవలసిన ముఖ్య అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. మగవారు వేతనం లేని శ్రమను పంచుకున్నప్పుడే స్త్రీలు చేసే వేతన శ్రమలో సమానత్వానికి పునాది అవుతుంది. ఇంటిపని, పిల్లలూ వృద్ధుల సంరక్షణ వంటి వాటి వలన ఎంత నైపుణ్యం, సామర్థ్యం ఉన్నా స్త్రీలకు తగిన ఉద్యోగం, తగినంత జీతం లభించే, ఉపాధిని ఎంచుకునే అవకాశాలు తగ్గు తాయి. కాబట్టి ఈ చాకిరి తగ్గించే శిశు సంరక్షణా సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల కల్పన, సెలవులు వంటివి ఇస్తేనే వారు తమ శక్తిని పూర్తిగా వినిమయంలోకి తేగలరు. ఇంటా బయటా స్త్రీల శ్రమను తక్కువ చేసే ధోర ణులను నిరోధించే చర్యలు చేపట్టాలి. కార్మిక చట్టాలను అసంఘటిత రంగానికి కూడా వర్తింపు చేయాలి. శ్రమలో, ఉత్పత్తిలో స్త్రీల భాగస్వామ్యం ఎంత పెరిగితే అంతగా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అంతరాలు తగ్గితేనే ఆర్థికవృద్ధి స్త్రీపురుషుల మధ్య అంతరం ఎంతగా తగ్గితే అంత వేగంగా వృద్ధి రేటు పెరు గుతుంది. విద్యలో సమానావకాశాల ద్వారా కొన్ని దేశాలలో 50 శాతం ఎక్కు వగా ఆర్థికాభివృద్ధి జరిగింది. స్త్రీపురుషుల మధ్య ఉపాధి, వేతన వ్యత్యాసాలు తొలగిస్తే స్త్రీల ఆదాయం 76 శాతం, ప్రపంచ ఆదాయం 17 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుంది. కాబట్టే ఐక్య రాజ్యసమితి మహిళా విభాగం స్త్రీల ఉపాధి, అన్నింటిలో సమానత్వం, సగం సగం భాగస్వామ్యం నినాదాన్ని ఇచ్చింది. ప్రపంచం దీనిని గుర్తిస్తుందో, లేదా అంతరాలను పెంచే కొద్దిమం దికే దోచిపెట్టే పాత విధానాలనే కొనసాగిస్తుందో వేచి చూడాలి. ఇంకా చెప్పా లంటే పాలకులు మహిళల సమస్యల పరిష్కారానికి సామరస్యంగా కదులు తారో, సమరానికి సన్నద్ధం కాక తప్పని స్థితిని కల్పిస్తారో కూడా చూడాలి. - దేవి వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త ఈ–మెయిల్: pa-devi@rediffmail.com