‘అలాంటి మహిళల కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోంది’ | Social Activist Devi Interview with Sakshi | Sakshi
Sakshi News home page

మహిళ సాధికారత సాధించిందా?

Published Wed, Feb 28 2018 6:42 PM | Last Updated on Wed, Feb 28 2018 6:42 PM

Social Activist Devi Interview with Sakshi

మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఉపాధి రంగంలో పని చేస్తున్నారు. కంపెనీ సీఈవోలవుతున్నారు. ప్రజాప్రతినిధులుగా పాలన పగ్గాలందుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మహిళలు అభివృద్ధి ప్రస్థానం ఎంతో ముందుకు సాగిపోయారనే అనిపిస్తుంది. మహిళలు నిర్ణయాత్మక స్థాయికి చేరినట్లేనా? మహిళ సాధికారత సాధించిందా? సోషల్‌ యాక్టివిస్టు దేవి ఏమంటున్నారో చూద్దాం.

1. ఇన్ని దశాబ్దాల పోరాటంలో భారతీయ మహిళ ఫైనాన్షియల్‌ ఎంపవర్‌మెంట్‌ సాధించిందనుకోవచ్చా?
ఇప్పటికీ ఏదో సాధించేసింది అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్థిక సాధికారత రెండు రకాలు. ఒకటి ఉపాధి కలిగి ఉండడం, రెండవది వనరులు కలిగి ఉండడం. అంటే స్థిరాస్థుల వంటివి అన్నమాట. ఒకవేళ ఆస్థి ఉన్నా దాని మీద నిర్ణయం తీసుకునే హక్కు ఆ మహిళకు ఉండడం లేదు. అది లేనంత వరకు ఎంత ఆస్థి ఆమె పేరు మీద ఉన్నా సరే ఆమెకు ఆర్థిక సాధికారత ఉందనలేం.

2. సమాజంలోని అన్ని స్థాయులలోనూ స్త్రీ ఆర్థిక సాధికారత విషయంలో ఒకేరకమైన పరిమితులు ఉంటున్నాయా?
నగరాలలో నేడు నెలకు పదివేల లోపు సంపాదిస్తున్న మహిళలు చాలా మంది తమ కుటుంబాలను తామే పోషిస్తున్నారు. భర్త సంపాదనకు తన సంపాదన జత చేర్చడం కాదిక్కడ. నూటికి నూరుశాతం కుటుంబ బాధ్యత ఆమెదే అవుతోంది. భర్త సంపాదన తాగుడు, జూదాలకు వెళ్లిపోతోంది. ఈ కండిషన్‌ని ఆర్థిక సాధికారత అనలేం. ఆమె మోస్తున్న బతుకు భారం అది. ఇక సంపన్నవర్గాల మహిళల్లో చేతిలో డబ్బు, ఖర్చు పెట్టుకోగలిగిన స్వేచ్ఛ ఉన్నప్పటికీ దానిని కూడా సాధికారత కోణంలో చూడలేం. ఎందుకంటే అది మిగులు డబ్బుతో వచ్చిన ఆర్థిక వెసులుబాటు తప్ప ఆర్థిక సాధికారత కాదు. ఇక మధ్య తరగతి మహిళ సాధికారత అనే భావన జోలికి వెళ్లడానికే భయపడుతోంది.

పారిశ్రామిక రంగంలో కూడా గ్లాస్‌ సీలింగ్‌ బ్రేక్‌ చేసిన మహిళల కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోంది. అన్నింటికంటే మొదట... ప్రపంచం ఇంకా మహిళను సంప్రదాయ పద్ధతిలో చూడడానికే ఇష్టపడుతోంది. అందుకు ఇవాంక పెద్ద ఉదాహరణ. గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమ్మిట్‌కొచ్చిన ఇవాంక ట్రంప్‌ తన ప్రసంగంలో ‘మొదట తానొక భార్యను, తల్లిని...’ అంటూ మొదలు పెట్టింది. అదే ఒక మగవాడు అలాంటి సమ్మిట్‌ కొచ్చినప్పుడు ఏం మాట్లాడుతాడు? తనను తాను ఎంట్రప్రెన్యూర్‌గా పరిచయం చేసుకుంటాడు. ఇవాంకకు తాను హాజరైన సమావేశం ఉద్దేశాన్ని గౌరవించాలనే ఆలోచన కూడా లేకపోయింది.

3. బతుకు మీద భరోసాకి ఫైనాన్షియల్‌ ఇండిపెండెన్స్‌ తప్పని సరి అనవచ్చా?
నిజమే. అల్పాదాయ వర్గాల మహిళల్లో కనిపించే ధైర్యం మధ్యతరగతిలో కనిపించడం లేదు. అల్పాదాయ వర్గాల్లో మహిళకు తన బతుకు తాను బతకగలననే భరోసా ఉంది. దాంతో యాంబిషియస్‌గా కూడా ఉంటోంది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి వచ్చేటప్పటికి మహిళ ఉద్యోగం చేస్తుందే తప్ప, ఆమెకు స్వావలంబన ఉండడం లేదు. విద్య, వైద్యం ఖరీదై పోవడంతో ఒక జీతంతో కుటుంబాన్ని నడపడం కష్టమై ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తున్న పరిస్థితులే ఎక్కువ. ఆమెకు వచ్చే జీతానికి ఖర్చులను ముందే నిర్ణయించి ఉంటాడు భర్త.

4. మహిళలు తమంతట తాముగా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారా? కనీసం అలా కొన్ని అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకరు నడిపిస్తే నడవాలని ఎదురు చూస్తున్నారా?
ఆ తపన ఉన్న వాళ్లు అవకాశాలు అడ్డుకుంటున్నా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లోకి కానీ ఉద్యోగాల్లోకి నెట్టబడినా సరే ఆ తర్వాత తప్పనిసరిగా నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. ఇష్టమైన రంగాల్లో కొనసాగుతున్నారు, ఆసక్తి లేని వాళ్లు మాత్రం ఎవరో ఒకరు చేయి పట్టి నడిపించినప్పుడు నాలుగు అడుగులు వేసి ఆ తర్వాత కనుమరుగవుతున్నారు.

5. ఈక్వల్‌ రైట్స్‌ సాధించుకోవాలన్నా, తన చాయిస్‌ తనకు ఉండాలన్నా... అందుకు ఆర్థిక స్వావలంబన పునాది అనవచ్చా?
ఆర్థిక స్వావలంబన అనేది సంపాదిస్తున్న రూపాయి మీద ఉండేది కాదు, ఆమె ఖర్చు చేయగలిగిన రూపాయి మీద ఉండేది. ఖర్చు పెట్టగలగడం మాత్రమే కాదు తాను నిర్ణయం తీసుకోగలిగిన రూపాయి మీద ఆమెకు ఉండేదే స్వావలంబన అయినా సాధికారత అయినా. ఇక్కడికి వచ్చే సరికి డబ్బు కోసం కుటుంబాన్ని వదులుకోవడమా... అనే సామాజిక ఒత్తిడి మహిళ తల మీద ఉంటోంది. దానికి తలొగ్గాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. దాంతో చాలా సందర్భాలలో ఈక్వల్‌రైట్, తన చాయిస్‌ అనేవి మరుగున పడిపోతున్నాయి.

6. ‘మహిళలకు సాధికారత ఉండాలని మగవాళ్లను చైతన్యవంతం చేయాలా’? లేక... ‘సాధికారతను సాధించుకోండి’ అని మహిళలను చైతన్యవంతం చేయాలా?
ఎవ్వరూ ఎవ్వరికీ అన్నీ అమర్చి ప్లేట్‌లో పెట్టి ఇవ్వరు. తమకు తాముగా సాధించుకోవాల్సిందే. పైగా ‘సాధికారత’ అనే పదంలోనే పెద్ద మోసం ఉంది. ‘నీకు అధికారం కావాలి’ అని చెప్పి, రాజ్యాంగ సవరణ చేసి వదిలేసి, అదే పదాన్ని చిలుకపలుకుల్లాగా వల్లిస్తే సరిపోదు. ‘ఒకరి చేతికి అధికారం రావాలంటే ఎలా? అది ఎవరి చేతిలో ఉందో వారి చేతి నుంచి తీసుకోవాలి’. అలా తీసుకోగలిగిన పరిస్థితులను కల్పించాల్సింది ప్రభుత్వం, రాజకీయ పార్టీలతోపాటు సమాజం కూడా.

7. రాజకీయ సాధికారత విషయంలో భారతీయ మహిళ స్థితి ఎలా ఉంటోంది?
మహిళకు సాధికారత లేని స్థితికి కారణమైన పరిస్థితులను యథాతథంగా కొనసాగిస్తూ మహిళలను ‘మీరు సాధికారత సాధించండి’ అని చెప్పడం కాదు. సర్పంచ్‌గా ఎన్నికైన మహిళ స్వతంత్రంగా, క్రియాశీలకంగా ఉండడానికి ఆయా రాజకీయ పార్టీలు కూడా చొరవ తీసుకోవాలి. ఆమె భర్త అన్నింటిలో జోక్యం చేసుకునే పరిస్థితిని ఆ పార్టీలు కూడా అడ్డుకోవాలి. అలా జోక్యం చేసుకోవద్దని భర్తకు చెబితే ఇంట్లో ఘర్షణలు మొదలవుతాయని, దానికి సమాజ ఆమోదం కూడా లభించదనే భయంతో మహిళలు మౌనం వహిస్తుంటారు. అందుకే ప్రభుత్వం, రాజకీయపార్టీలు, సమాజం మూడూ సమష్టిగా పని చేస్తేనే మహిళ నూటికి నూరుశాతం సాధికారత సాధించగలుగుతుంది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మహిళ స్థానంలో ఆమె బాధ్యతలను హైజాక్‌ చేసే మగవాళ్లను నిలువరించేలా జీవో తేవాలి.

8. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మహిళలు చాలా వరకు ఆర్థికంగా భర్త లేదా కుటుంబం మీద ఆధార పడి ఉంటారు కాబట్టి పాలనలోనూ తన నిర్ణయాలను వ్యక్తం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటోందేమో!
భర్త మీద ఆధారపడి ఉండడం ఒక కారణమైతే, కొందరి విషయంలో ఆ ఊరి పెత్తందారులు ఆర్థిక సహాయం చేసిన సందర్భాలుంటాయి. అప్పుడు భర్త మాట కూడా చెలామణిలో ఉండదు. ఆ పెత్తందారు మాటే చెల్లుబాటులో ఉంటుంది. ఇవన్నీ తిరిగి తిరిగి ఆర్థిక వెసులుబాటు దగ్గరకే వస్తాయి.

9. స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా ఎంపికైన మహిళలు తమ బాధ్యతల పట్ల నిరాసక్తంగా ఉంటే ఆ ప్రభావం రాబోయే తరం మీద ఎలా ఉంటుంది?
తప్పనిసరిగా వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. చట్టసభల్లో ప్రాతినిధ్యం గురించి గళమెత్తిన ప్రతిసారీ... మీకు స్థానిక సంస్థల్లో ఇచ్చిన రిజర్వేషన్‌నే సరిగ్గా ఉపయోగించుకోవడం లేదంటూ విమర్శలు ఎదురవుతాయి. అందుకే గెలిచిన వాళ్లు క్రియాశీలకంగా ఉండాలి. సామాజిక వేదికలు కూడా ఆ అవకాశాన్నివ్వాలి. సివిల్‌ సొసైటీ గ్రూపులు ఈ ప్రయోజనం కోసం కూడా పోరాడాలి.

10. రాజకీయ సాధికారతలో... వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల మహిళల పరిస్థితి ఎలా ఉంది?
కొన్ని దేశాల్లో పరిస్థితి మనదగ్గరకంటే చాలా దారుణంగా ఉంది. మన దగ్గర మహిళ దుస్తులు, అలంకరణ మీద కామెంట్స్‌ తక్కువే. ఒకరిద్దరు నోరు పారేసుకున్నా వెంటనే మహిళ దుస్తుల మీద మాట్లాడడం అనైతికం అనే వాదన బలంగా వినిపిస్తుంటుంది. కాబట్టి ఆ రకమైన కామెంట్స్‌ కొనసాగవు. అభివృద్ధి చెందాయని మనం విశ్వసించే పాశ్చాత్యదేశాలలో హిల్లరీని, మెర్కెల్, థెరిసామే వంటి వాళ్ల దుస్తుల మీద కూడా కామెంట్‌ చేస్తున్నారు. మహిళ రాజకీయాలలో సమర్థంగా వ్యవహరిస్తుంటే వెంటనే మగరాయుడిలా అనే మాట అక్కడా ఉంది. ఇందిరాగాంధీ విషయంలో ఆమె సమర్థతనే చూశారు కానీ మగరాయుడిలాంటి పోలికలు చెప్పలేదు మనదేశంలో.

అయితే ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తం రాజకీయ రంగంలో మహిళను, మగవాడిని తూచే త్రాసులు వేరుగా ఉంటున్నాయి. మహిళ విషయానికి వచ్చేటప్పటికి ఆమె కుటుంబ జీవితాన్ని ప్రధానమైన అంశంగా తీసుకుంటారు. అదే మగవారి విషయంలో కుటుంబ జీవితాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఈ రకమైన రెండు తక్కెళ్ల విధానం మారాలి.
–వాకా మంజుల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement