సోషల్ మీడియాలో తప్పులతో ఉద్యోగాలకు ఎసరు
సోషల్ మీడియాను ఆస్వాదిస్తూ నేటి యువతరం గంటల తరబడి అందులో లీనమైపోతోంది. తమ భావాలను వ్యక్తీకరిస్తూ ప్రతి అంశంపైనా స్పందిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డిన్.. ఇలా వేదిక ఏదైనా కావొచ్చు. స్నేహితులతో చాటింగ్, తమ కామెంట్స్ పోస్టుచేయడంతో పాటు అనేక విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఆ పోస్టింగ్స్ వల్ల మీ ఉద్యోగానికే ఎసరు రావొచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సోషల్ మీడియాలో మీరు చేసిన పోస్టింగ్స్ మీకు ఉద్యోగం రాకుండా ప్రతిబంధకంగా మారొచ్చు... తస్మాత్ జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో విడుదలైన సోషల్ రిక్రూటింగ్ సర్వే తాజా ఎడిషన్‌లో దీనికి సంబంధించి అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవలి కాలంలో అమెరికా లాంటి దేశాల్లో రిక్రూటింగ్ ఏజెన్సీలు, రిక్రూటర్లు అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి. వృత్తి నిపుణుల కోసం అన్వేషణలో అవి సోషల్ మీడియాపై ప్రధానంగా దృష్టి సారించాయని ఆ సర్వేలో వెల్లడైంది. రోజులు గడుస్తున్న కొద్దీ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవడంలో రిక్రూటర్స్ 73 శాతం సోషల్ రిక్రూటింగ్ పైన, 63 శాతం రిఫరల్స్తో, 51 శాతం మొబైల్ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, ఐటీ, ఆపరేషన్స్, సేల్స్ రంగాల్లో అత్యంత ప్రతిభావంతుల కోసం డిమాండ్ ఉన్నట్టు తేలింది.
సోషల్ నెట్వర్క్ ఒక్కటే రిక్రూట్మెంట్కు ప్రామాణికం కాకపోయినా, ఉద్యోగ నియామకాల్లో రిక్రూట్ చేసుకునేవారు అభ్యర్థుల గురించి తెలుసుకోడానికి సోషల్‌మీడియా ప్రొఫైల్స్ ప్రధాన సోర్స్‌గా పనికొస్తోందని తేలింది. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో పేర్కొన్న విషయాలకు అనుగుణంగా ఇంటర్వ్యూలు జరుగుతున్నట్టు తేలింది. ఉద్యోగ నియామకాల్లో ఇండస్ట్రీస్‌కు సోషల్ మీడియా (లింక్డిన్ 94 శాతం, ఫేస్ బుక్ 66 శాతం, ట్విట్టర్ 52 శాతం) ప్రధాన సాధనంగా మారింది. అభ్యర్థులను సంప్రదించడం, సరైన అభ్యర్థులను వెతుక్కోవడం, ఇంటర్వ్యూల కన్నా ముందుగానే ఎంపికచేసిన వారిని ఫిల్టర్ చేయడం (లింక్డిన్), ఎంప్లాయర్ బ్రాండ్, రిఫర్రల్స్, ప్రీ ఇంటర్వ్యూ, పోస్ట్ ఇంటర్వూల ద్వారా వడపోత కార్యక్రమం (ఫేస్ బుక్), గతంలో చేసిన ఉద్యోగాలు, ఇంటర్వ్యూల కన్నా ముందే వడపోత కార్యక్రమం (ట్విట్టర్) వంటి వాటన్నింటికీ రిక్రూటర్స్ సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నట్టు తేలింది. ఇలా దాదాపు 73 శాతం ఇలాంటివాటి ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేసుకున్నట్టుగా రిక్రూటర్స్ చెప్పినట్టు సర్వేలో వెల్లడైంది. అయితే ఈ రకంగా చేయడంలోనూ, అత్యంత ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేసుకోవడంలో ఏజెన్సీలు 93 శాతం మేరకు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను రివ్యూ చేస్తున్నట్టు ఆ సర్వేలో బయటపడింది.
అడ్డగోలు పోస్టింగ్స్‌తో అసలుకే ఎసరు
జాబ్స్ రిక్రూట్ మెంట్స్‌లో రిక్రూటర్లు ప్రధానంగా సోషల్ మీడియాపై ఆధారపడుతున్న నేపథ్యంలో నిపుణులైన యువతీ యువకులు సోషల్ మీడియా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. డ్రగ్స్‌కు సంబంధిన విషయాలు, చట్ట వ్యతిరేక చర్యలు, శృంగారానికి సంబంధించిన పోస్టింగ్స్ వంటివి తెలిసీ తెలియక చేసినా మీకు ఉద్యోగం రానట్టే. ఇలాంటి పోస్టింగ్స్‌పై రిక్రూటర్స్ తీవ్ర వ్యతిరేకత చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది.
ప్రధానంగా డ్రగ్స్‌కు సంబంధించి స్నేహితులతో ఎలాంటి పోస్టింగ్ చేసినా అది మీకు ప్రతిబంధకం కావొచ్చు. తెలిసీ తెలియని వయసులో డ్రగ్స్‌కు సంబంధించి కొన్ని పోస్టింగ్స్ చేయొచ్చు. కానీ రిక్రూట్ చేసుకునే వారిలో 83 శాతం మేరకు వాటిని వ్యతిరేక దృష్టితోనే చూస్తున్నారు. ఆ తర్వాత సెక్సువల్ పోస్టింగ్స్ విషయంలోనూ 70 శాతం రిక్రూటర్స్ వ్యతిరేకంగానే పరిగణిస్తున్నారు. కేవలం ఒక శాతం మాత్రమే ఆ విషయాలను పాజిటివ్ కోణంలో చూస్తున్నట్టు ఆ సర్వేలో తేలింది. అశ్లీలదృశ్యాలను పోస్టు చేయడం, వాటిపై కామెంట్స్ చేయడం అభ్యర్థుల పట్ల నెగెటివ్ ప్రభావం చూపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో తుపాకీ సంస్కృతి, మద్యం వంటి విషయాల్లో పోస్టింగ్స్ కూడా 44 శాతం మంది రిక్రూటర్స్‌కు నచ్చడం లేదని వెల్లడైంది.
ఇంకో విచిత్రమేమంటే... పోస్టింగ్స్‌లో దొర్లుతున్న అక్షరదోషాలు, వ్యాకరణ దోషాలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అభ్యర్థులు ఇలాంటి పొరపాట్లు చేయడం దాదాపు 66 శాతం మంది రిక్రూట్మెంట్ మేనేజర్లకు నచ్చడం లేదు. రాజకీయ పరమైన కామెంట్స్ గానీ, రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాలకు సంబంధించిన పోస్టింగ్స్ విషయాల్లో గానీ రిక్రూటర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదని తేలింది. 1 నుంచి 6 శాతం రిక్రూటర్లు మాత్రమే రాజకీయ సంబంధాలను కూడా సందర్భాన్ని బట్టి నెగెటివ్‌గానే పరిగణిస్తున్నట్టు తేలింది.
పాజిటివ్ అంశాలూ ఉన్నాయి...
ఫేస్బుక్, లింక్డిన్లో మీ ప్రొఫైల్ మార్చుతున్నప్పుడు, లేదా అప్డేట్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఛారిటీ పనులు, స్వచ్ఛందంగా మీరేదైనా విరాళాలు ఇచ్చి ఉంటే ... అలాంటి విషయాలను సానుకూలంగా పరిగణిస్తున్నట్టు 65 శాతం రిక్రూటర్స్ వెల్లడించారు. మీ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియెన్స్, మ్యూచువల్ కనెక్షన్స్, సాంస్కృతికపరమైన అంశాలన్నీ మీకు అనుకూలంగా నిలుస్తున్నాయి.
వివిధ రకాల సోషల్ మీడియాలు
నిపుణుల వెతుకులాటలో రిక్రూటర్లు ప్రధానంగా లింక్డిన్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. 79 శాతం లింక్డిన్‌పై (బయోడాటా) ఆధారపడుతుండగా, 26 శాతం ఫేస్బుక్ పైన, 14 శాతం ట్విట్టర్ పైన ఆధారపడుతున్నారు. ప్రొఫెషనల్ అనుభవం, ఎంత కాలం సర్వీసు చేశారు, మీకు తగిన ఉద్యోగం చేశారా, కష్టపడే మనస్తత్వం ఉందా, రాయడంలో గానీ, డిజైన్‌లో గాని ఉన్న స్కిల్స్ వంటి వాటి కోసం రిక్రూటర్స్ మీ సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నాయి. వివిధ రకాల ఇండస్ట్రీకి చెందిన దాదాపు 2 వేల మంది హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్స్‌తో ఆన్లైన్ ద్వారా ఈ సర్వే నిర్వహించినట్టు జాబ్ విటే ఇటీవల ప్రకటించింది. అందువల్ల ఉద్యోగాల వేటలో ఉన్న నిపుణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాజిటివ్
న్యూట్రల్
నెగెటివ్
అశ్లీల దృశ్యాలు, కామెంట్స్
5
22
63
అక్షర దోషాలు
3
24
66
డ్రగ్స్ వంటి చట్ట వ్యతిరేక రిఫరెన్స్
2
7
83
సెక్స్ కు సంబంధించిన పోస్టింగ్స్
1
17
70
రాజకీయ పార్టీల అనుబంధం
2
69
17
విరాళాలు, స్వచ్ఛంద సేవ
65
25
2
మద్యం
2
43
44
గన్స్, మారణాయుధాలు...
2
32
51