అవిశ్రాంత ప్రజా పోరాట యోధుడు దేవులపల్లి
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, జనతాప్రజాతంత్ర విప్లవ రూపశిల్పి దేవుల పల్లి వెంకటేశ్వరరావు(డి.వి) ప్రజా పోరాటాల కోసమే జీవితాన్ని ధారపోసిన ధన్య జీవి. డి.వి వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి గ్రామంలో 1917 జూన్ 1న ఒక భూ స్వామ్య కుటుంబంలో జన్మించారు. బీ.ఏ విద్యార్థిగా ఉస్మానియా విశ్వవిద్యాల యంలో చేరి 1938లో అక్కడ వెల్లువెత్తిన వందేమాతర గీతం నిషేధ వ్యతిరేక పోరాటంలో పాల్గొ న్నారు. ఫలితంగా వర్సిటీ నుంచి బహిష్కృ తుడై జబల్పూర్ వర్సిటీలో బీఏ పూర్తి చేశారు.
అక్కడే ఆయనకు జాతీయోద్యమం, సోషలిస్టు సాహిత్యాలతో పరిచయం ఏర్పడింది. ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు సూర్యాపేట వచ్చి డీవీతో పరిచయం చేసుకు న్నారు. వారిరువురూ రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి మొదలైన వారితో కలిసి హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల విస్తరణకు కృషి చేశారు. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుకు కృషి చేసినవారిలో డీవీ, రావి నారాయ ణరెడ్డి ముఖ్యులు.
భువనగిరి ఆంధ్రమహాసభ జరిగే నాటికి వెట్టిచాకిరి రద్దు చేయా లని, రైతులకు, వ్యవసాయ కూలీలకు, చేతి వృత్తులవారికి, వర్తకులకు చట్టరీత్యా అన్ని సౌకర్యాలు కలిగించాలనీ డిమాండ్లు ముందు కు వచ్చాయి. ఆంధ్రమహాసభను ప్రజా సంస్థగా రూపొందించాలని డి.వి తదితరులు ప్రజల్లో పని చేస్తూ వచ్చారు. జనగాం తాలూ కా మడిపడగ బహిరంగ సభ చుట్టుపక్కల గ్రామాల్లో చైతన్యం రగిల్చింది. సంఘం గ్రామగ్రామానికి విస్తరిం చింది. విసునూరి దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి దుర్మార్గాలను, దోపిడీని ఎదుర్కోవడానికి ప్రజలను చైతన్య పరచడానికి ఆంధ్ర మహా సభ ఉపక్రమించింది.
ఆ సందర్భంగానే డీవీ ’జనగామ ప్రజల వీరో చిత పోరాటాలు’ అనే పుస్తకం రచించారు. రైతులు భూమిని కోరుతుం డడంతో ఆ సమస్య పార్టీ ముందు నిలిచింది. డీవీ తదితరులు ఆ సమస్యపైనే చర్చిస్తుండగా... భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు రౌడీ మూ కలతో, ఆయుధాలతో వచ్చి లంబాడీలు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తు న్న భూమిలో పంటని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి తక్షణమే వారక్కడకు వెళ్లి నిలవరించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి వరుసగా డీవీపై 40కి పైగా కేసులు పెట్టారు. భూస్వాముల దాడులను, పోలీసు, బలవంతపు లేవీ ధాన్యపు వసూ ళ్లను ప్రతిఘటించడానికి ప్రజలు సిద్ధపడగా సంఘం శిక్షణ ఇచ్చింది.
నల్గొండ జిల్లా కడవెండి గ్రామంలో శాంతియుతంగా సాగుతున్న వాలంటరీ దళ ఊరేగింపుపై 1946 జూలై 6న భూస్వాముల గూండాలు కాల్పుల్లో దొడ్డి కొమురయ్య మరణించాడు. దీంతో తెలంగాణ రైతాంగ ప్రజా ఉద్యమం ఉన్నత స్థాయికి చేరి, సాయుధ పోరాట రూపం తీసుకున్నది. 1946 డిసెంబర్ నాటికి దాదాపు120 గ్రామాల్లో గ్రామ రాజ్యాలేర్పడి 3,000 ఎకరాల భూస్వాముల భూములను పేదలకు పంచారు. 1946 నుండి 1951 వరకు సాగిన ఈ పోరాటంలో డీవీ ప్రధాన పాత్రధారి. సాయుధ పోరాటాన్ని విరమించాలని 1948లో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించినప్పుడు డీవీ ‘తెలంగాణ సాయు ధ పోరాటాన్ని విరమించాలనే తప్పుడు ధోరణులపై విమర్శ’ అన్న గ్రంథాన్ని రచించారు.
1951 నుండి 1968 వరకు కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంటరీ పంథాలో కూరుకుపోయినప్పుడు డీవీ తనదైన సైద్ధాం తిక అవగాహనతో రివిజనిస్టులను, నయారివిజనిస్టులతో విభేదిం చారు. 1968-69 కాలంలో ‘పోరాట ఉద్యమానికి పునాదులు వేయం డి’ అన్న సర్క్యులర్‌ను రచించి, ‘తక్షణ కార్యక్రమం’ అనే రచన ద్వారా తిరిగి విప్లవోద్యమానికి నిర్మించవల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఫలితంగా 1975లో భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యత కేం ద్రం ఏర్పడింది. దాని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా 1984 జూలై 12న హైదరాబాద్ మలక్‌పేటలోని శ్రీపురం కాలనీలో అజ్ఞాతవాసంలో కన్నుమూసే వరకు ఆయన ప్రజల కోసమే కృషి చేస్తూ వచ్చారు.
(నేడు డీవీ 98వ జన్మదినం)
వ్యాసకర్త ప్రముఖ రచయిత
- కె. జితేంద్రబాబు