ఏసీబీ కోర్టుకు చిరుద్యోగి ఆస్తుల నివేదిక
భీమవరం టౌన్: కాళ్ల మండలం కోపల్లె ప్రాథమిక సహకార పరపతి సంఘం మాజీ కార్యదర్శి ఎం.సూర్యనారాయణరాజు ఆస్తులకు సంబంధించిన నివేదికను విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించామని ఏసీబీ డీఎస్పీ ఎస్వీవీ ప్రసాదరావు బుధవారం తెలిపారు. ఎం.సూర్యనారాయణరాజు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాళ్ల మండలం జక్కరం గ్రామంలోని ఆయన నివాసంలో, భీమవరం పట్టణంలోని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆస్తుల విలువ మొత్తం రూ.80 కోట్లు ఉంటుందని డీఎస్పీ ప్రసాదరావు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన అదనపు వివరాల సమాచారాన్ని బుధవారం ఫోన్లో డీఎస్పీ ప్రసాదరావును కోరగా ఆస్తుల నివేదికను విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించామని చెప్పారు. 500 గ్రాముల బంగారం తొలుత గుర్తించామని అయితే లాకర్లు తనిఖీ చేయగా మరికొంత బంగారం ఉందని, మొత్తం 800 గ్రాముల బంగారంగా నివేదికలో పొందుపరచామని పేర్కొన్నారు. నగదు, వెండి, భూములు తొలుత ప్రకటించిన దానిలో ఏవిధమైన మార్పు లేదని చెప్పారు. సూర్యనారాయణరాజు రిటైర్డ్ ఉద్యోగి కావడం వల్ల అరెస్ట్ లేదని పేర్కొన్నారు.