సులువుగా సొసైటీ రిజిస్ట్రేషన్
⇒ ఆన్లైన్లోనే సొసైటీలు.. ఫర్మ్ రిజిస్ట్రేషన్లు
⇒ ఈవోడీబీలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఈ–స్టాంప్స్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, సర్టిఫైడ్ కాపీలు, పబ్లిక్ డేటా ఎంట్రీ, స్లాట్ బుకింగ్, పెండింగ్ డాక్యుమెంట్ స్టేటస్.. తదితర సేవలను ఆన్లైన్ ద్వారానే వినియోగదారులు పొందేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ వీలు కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలను కూడా ఆన్లైన్ ద్వారానే పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రోగ్రామ్ (ఈవోడీబీ)లో భాగంగా.. ఆన్లైన్ సేవలను అందించడంలో రిజిస్ట్రేషన్ల శాఖను అగ్రగామిగా నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా రిజిస్ట్రేషన్ల ఆన్లైన్ ప్రక్రియలపై కసరత్తు కొలిక్కి రావడంతో వచ్చే నెల (మార్చి) మొదటి వారంలో ఈ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త ఆన్లైన్ ప్రక్రియల ద్వారా వినియోగదారులు తమ ఇల్లు లేదా కార్యాలయం నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
సొసైటీ రిజిస్ట్రేషన్లు ఇలా..
సాధారణంగా వివిధ రంగాల్లో సమాజానికి సేవలందించాల నుకునే వ్యక్తులు ముందుగా ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుం టారు. తెలంగాణ రాష్ట్ర సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఆయా సొసైటీలను రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఇందుకు సొసైటీలో సభ్యులు కనీసం ఏడుగురు, గరిష్టంగా ఎంతమందైనా ఉండవచ్చు. సొసైటీ రిజిస్ట్రేషన్ నిమిత్తం ప్రస్తుతం మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తును సమర్పించాలి. అదే ఆన్లైన్ ప్రక్రియ అమల్లోకి వస్తే , వినియోగదారులు ఇల్లు లేదా ఆఫీసు నుంచే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో దరఖాస్తును సమర్పించవచ్చు. సొసైటీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200లను నెట్‌బ్యాంకింగ్ లేదా క్రెడిట్/డెబిట్ కార్డులతో ఆన్లైన్లోనే చెల్లించవచ్చు.
ఫర్మ్ రిజిస్ట్రేషన్లు ఇలా...
ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులు (పార్ట్నర్స్) తమ పేరిట ముందుగా ఒక ఫర్మ్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ బిజినెస్‌లో భాగస్వాములు కనీసం ఇద్దరు, గరిష్టంగా 20కి మించకుండా ఉంటేనే ఫర్మ్ రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉంటుంది. 20 మందికి పైగా భాగస్వాములు ఉన్నట్లయితే.. సదరు సంస్థలు కంపెనీల యాక్ట్ కిందకు వస్తాయి. ఫర్మ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచే దరఖాస్తు సమర్పించి, ఫీజు రూ.100ను ఆన్లైన్ ద్వారానే చెల్లించవచ్చు.
సంబంధిత పత్రాలు రిజిస్ట్రార్‌కు పంపాలి..
ఆయా రిజిస్ట్రేషన్ల నిమిత్తం చేసిన ఆన్లైన్ దరఖాస్తులలోని వివరాలకు సంబంధించిన పత్రాలను మాత్రం కొరియర్ లేదా పోస్ట్ ద్వారా సంబంధిత జిల్లా రిజిస్ట్రార్‌కు పంపాలి. దరఖాస్తు పరిశీలన అనంతరం జిల్లా రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్లను అప్రూవ్ చేస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అందుకున్న వినియోగదారులు, రిజిస్ట్రేషన్ సర్టిపికెట్లను అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి వెబ్సైట్ నుంచే పొందవచ్చు.