ఫ్యాబ్రిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఆవిష్కరణ
భివండీ, న్యూస్‌లైన్: పద్మశాలి యువత తెలుగువారి కీర్తిని దశదిశలా చాటిందంటూ పలువురు వక్తలు కొనియాడారు. కొందరు పద్మశాలి యువకులు మొట్టమొదటిసారిగా జాతీయస్థాయిలో ఫ్యాబ్రిక్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీనిని శుక్రవారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పద్మశాలీలకు ఇది మర్చిపోలేని రోజని, నేటి యువతరం కూడా మున్ముందు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి తెలుగువారి కీర్తి నలుదిశలా చాటాలని కోరారు. అనంతరం దీని రూపకర్తలు మాట్లాడుతూ తాము రూపొందించిన సాఫ్ట్వేర్ విదేశీ సాఫ్ట్వేర్ ధరతో పోలిస్తే 90 శాతం తక్కువని పేర్కొన్నారు. అత్యంత సులభమైన రీతిలోఅందరికీ అర్ధమయ్యేవిధంగా ఒకే సమయంలో ఎక్కువ నమూనాలను చూపించ వచ్చన్నారు. అనంతరం దీనిని ప్రత్యేక ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ సాఫ్ట్వేర్ రూపకల్పనకు ఎంతో తాము చాలా కష్టపడ్డామని, ఇందుకు తమ తల్లిదండ్రులు, డిజైన్ మాస్టర్లు ఎలిగేటి శ్రీనివాస్, చిలుకూరి శంకర్, కనుకుంట్ల పర శురామ్, సిరిమల్ల శ్రీనివాస్, చెన్న శివ, అజయ్ మాస్టర్ లాంటి సీనియర్లు ఎంతగానో సహకరించారన్నారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన యువకుల తల్లిదండ్రులను అతిథులు సత్కరించారు.
ఈ కార్యక్రమం అనంతరం సుమారు 50 మందికి పైగా స్థానికులు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. ఈ నెల 7,8,9 తేదీలలో ఇచల్కరేంజిలో జరగనున్న అంతర్జాతీయ టెక్స్టైల్ ప్రదర్శనలో ఈ సాఫ్ట్వేర్ నమూనాను ప్రదర్శించబోతున్నామని సిరిపురం సాగర్ తెలి పారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని సుమారు ఐదువందల మంది డిజైన్ మాస్టర్లతో పాటు ముంబై నుంచి నక్క మనోహర్, ఆడెపు మురళి , రఘు మాస్టర్, అశోక్ మాస్టర్, రాజేశ్, స్థానిక కార్పొరేటర్ మురళి మచ్చ, బీజేిపీ పట్టణ శాఖ కార్యదర్శి నిష్కం భైరిలు హాజరయ్యారు.
మాంచెస్టర్గా పేరుగాంచిన భివండి పట్టణంలో అత్యధికంగా తెలుగు వారు టెక్స్టైల్ పరిశ్రమలు నెలకొల్పి దేశవిదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు.
అయితే నమూనాల కోసం చేతిమగ్గంతో తయారుచేసిన వస్త్రాన్ని వ్యాపారస్తులకు చూపించేవారు. దేశ విదేశాలకు ఈ నమూనాలను పంపించేందుకు అనేక రోజుల సమయం పట్టేది. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా కొంతమంది డిజైన్ మాస్టర్లు విదేశాల నుంచి దుస్తుల డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ చాలా తక్కువ మంది వద్ద ఉంది.
అయితే ఈ సాఫ్ట్వేర్ ఉన్న వారికి మాత్రమే మార్కెట్లో మంచి రాబడి ఉంటుంది. అయితే మధ్య తరగతి పరిశ్రమలవారికి ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో వీరి వ్యాపారం దెబ్బతింటోంది. దీనిని దృష్టిలో ంచుకుని భివండీ పద్మశాలి టెక్స్టైల్ టెక్నీషియేషన్స్ అసోసియేషన్ (ిపీటీటీఏ) సంస్థ యాజమాన్యం ‘యాక్యురేట్ సొల్యూషన్స్ కంపెనీ’కి చెందిన పద్మశాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సిరిపురం శ్రీనివాస్, భైరి చంద్రశేఖర్, సిరిపురం సాగర్, దీకొండ శ్రీనివాస్, గొరిట్యాల హరిష్, వేముల శ్రీనివాస్, సిరిపురం సురేష్లను దుస్తుల డిజైన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని కోరింది. దీంతో ఈ బృందం ఆరు నెలలపాటు శ్రమించి ఈ సాఫ్ట్వేర్ ను రూపొందించింది.